న్యూఢిల్లీ, మార్చి 16 : మత స్వేచ్ఛ ఉల్లంఘనలలో పాత్ర పోషిస్తున్నందుకు భారతదేశ విదేశీ నిఘా వ్యవస్థ రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా), బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధించాలని అమెరికా ప్రభుత్వ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్(యూఎస్‌సీఆర్‌ఎఫ్) తన 2026 సంవత్సరం వార్షిక నివేదికలో సిఫార్సు చేసింది. భారతదేశంలో మతస్వేచ్ఛకు జరుగుతున్న ఉల్లంఘనలపై ఆందోళనలు వ్యక్తం చేస్తూ కమిషన్ నివేదిక ఇవ్వడం వరుసగా ఇది ఏడవసారి. అయితే భారత్‌ను మతస్వేచ్ఛ ఉల్లంఘనలు జరుగుతున్న దేశంగా ప్రకటించాలన్న కమిషన్ సిఫార్సును అమెరికా విదేశాంగ శాఖ ఇప్పటివరకు ఏ సంవత్సరమూ పరిగణనలోకి తీసుకోలేదు.
మత స్వేచ్ఛ విషయంలో తీవ్రమైన ఉల్లంఘనలకు బాధ్యత రా; ఆర్ఎస్ఎస్దేనని, ఉల్లంఘనల పట్ల సహనంతో వ్యవహరించినందుకు వీటిపై ఆంక్షలు విధించాలని కమిషన్ మార్చి 4న విడుదల చేసిన తన నివేదికలో అమెరికన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కాగా, 2023లో న్యూయార్క్‌లో ఓ అమెరికా జాతీయుడిపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి రాపైన, దాని అప్పటి అధికారి వికాశ్ యాదవ్‌పైన ఆంక్షలు విధించాలని తన 2025 సంవత్సరం వార్షిక నివేదికలో కమిషన్ సిఫార్సు చేసింది. భవిష్యత్తులో భద్రతా సహాయం, ద్వైపాక్షిక వాణిజ్య విధానాలను భారత్‌లో మత స్వేచ్ఛ మెరుగుదలతో అనుసంధానించాలని ట్రంప్ ప్రభుత్వాన్ని కమిషన్ కోరింది. అమెరికా పౌరుల పైన, మతపరమైన మైనారిటీలపైన బెదిరింపులు, వేధింపులు కొనసాగుతున్నాయని పేర్కొన్న కమిషన్ భారత్‌కు ఆయుధాల అమ్మకాలను నిలిపివేసేందుకు ఆయుధ ఎగుమతి నియంత్రణ చట్టంలోని సెక్షన్ 6ని అమలు చేయాలని అమెరికన్ కాంగ్రెస్‌ను కోరింది.
భారత ప్రజల మత స్వేచ్ఛకు ఆర్ఎస్ఎస్ ముప్పుగా పరిణమించిందని అమెరికా ప్రభుత్వానికి చెందిన అధికారిక కమిషన్ హెచ్చరించిందని కాంగ్రెస్ సోమవారం ఎక్స్‌లో పేర్కొన్నది. మహాత్మా గాంధీ హత్య తర్వాత ఆర్ఎస్ఎస్పై సర్దార్ పటేల్ నిషేధం విధించడాన్ని కాంగ్రెస్ గుర్తు చేసింది. రాజ్యాంగాన్ని వ్యతిరేకించే ఆర్ఎస్ఎస్ మనుస్మృతి ప్రకారం దేశం నడవాలని చెబుతుందని కాంగ్రెస్ పేర్కొన్నది. ఆర్ఎస్ఎస్ ఈ దేశ సమైక్యతకు, సోదరభావానికి విషంగా కాగ్రెస్ ఆరోపించింది.
ఆర్ఎస్ఎస్, ‘రా’పై ఆంక్షలు విధించాలని సిఫార్సు చేస్తూ అమెరికా కమిషన్ ఇచ్చిన తాజా వార్షిక నివేదికను విదేశీ వ్యవహారాల శాఖ సోమవారం తోసిపుచ్చింది. నిష్పాక్షిక వాస్తవాల కంటే భారత్‌పై అవాస్తవ వక్రీకరణలతో కూడిన కథనాన్ని కమిషన్ తన నివేదికలో చిత్రీకరించిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైస్వాల్ సోమవారం ఓ ప్రకటనలో విమర్శించారు. నివేదికను నిర్దంద్వంగా తిరస్కరిస్తున్నామని ఆయన తెలిపారు. గడచిన అనేక సంవత్సరాలుగా కమిషన్ భారత్‌పై వక్రీకరణలతో కూడిన నివేదికలను అందచేస్తున్నదని, కమిషన్ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తాయని జైస్వాల్ పేర్కొన్నారు. అమెరికాలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను, అమెరికాలోని భారతీయ సంతతిపై పెరుగుతున్న వేధింపులు, అసహనంపై కమిషన్ దృష్టి సారించాలని ఆయన సూచించారు.