మహబూబాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : అన్నదాతలకు యాప్ తిప్పలు మొదలయ్యాయి. యూరియా పంపిణీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాప్‌తో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతులంతా ఆపసోపాలు పడుతున్నారు. టచ్ ఫోన్లు లేక, బుకింగ్ చేయడం తెలియక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ రైతులు మరో సమస్యను ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీ గ్రామాల్లో ఫోన్ సిగ్నల్స్ లేక.. యాప్ ఓపెన్ కాక.. సకాలంలో యూరియా దొరకక అవస్థ పడుతున్నారు. ఈ ఏడాది వానకాలంలో జిల్లాలో 4,78,085 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని, 43,311 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే, ఇప్పటి వరకు 7వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే రాగా, 614 కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్నారు.
అందులో 67 పీఏసీఎస్‌లు, 47 ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలు, 32 హాకా, 10 ఓడీసీఎంఎస్, 458 ప్రైవేటు డీలర్లు యాప్‌లో బుక్ చేసుకున్న రైతులకు పంపిణీ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా బయ్యారం, గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాలకు చెందిన గ్రామాల్లో సిగ్నల్ సమస్య తీవ్రంగా ఉండడంతో గిరిజన రైతులు యాప్‌తో అనేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ శివారులో ఉన్న వాటర్ ట్యాంకులు, చెట్లు, ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లి సిగ్నల్ వచ్చిన చోట యూరియా బుకింగ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే సమయాభావం కావడం, ఉన్న యూరియాను మైదాన ప్రాంతాలకు చెందిన రైతులు బుక్ చేసుకోవడంతో స్టాక్ లేక నిరాశ చెందుతున్నారు. గిరిజన గ్రామాల్లోని కొందరు రైతులకు టచ్ ఫోన్లు లేకపోవడం, ఒక వేళ ఉన్నా వాటిని ఆపరేట్ చేయలేక ఇతరులపై ఆధారపడడం వంటి కారణాలతో యూరియా బుక్ చేసుకోలేక పోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఏజెన్సీలోని గిరిజన గ్రామాల రైతులకు నేరుగా యూరియా అందించాలని కోరుతున్నారు.
సిగ్నల్ సమస్య ఉన్న ప్రాంతాల్లోని రైతులకు ఇబ్బంది కలుగకుండా చూస్తాం. జిల్లాలోని బయ్యారం, గంగారం, కొత్తగూడ, గూడూరు మండలాల్లోని 54 గ్రామాల్లో కొద్దిపాటి, ఐదు గ్రామాల్లో పూర్తిగా లేనట్లు గుర్తించి నివేదికను కలెక్టర్‌కు అందించాం. సిగ్నల్ సమస్య ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. షెడ్యూల్ తయారు చేసి ఏఈవోల ద్వారా యూరియా బుకింగ్ చేసేలా చర్యలు తీసుకుంటాం. సిగ్నల్ పెంపునకు సంబంధిత శాఖకు సిఫారసు చేస్తాం.
గ్రామంలో సిగ్నల్ సమస్య ఉంది. యాప్‌లో యూరియా బుక్ చేద్దామంటే పక్క గ్రామానికి వెళ్లాల్సి వస్తున్నది. అక్కడ కూడా సరిగా సిగ్నల్స్ లేక ఒక్కోసారి యూరియా బుక్ కావడం లేదు. సమయానికి యూరియా అందక పంటలు దెబ్బతింటున్నాయి. గతేడాది సరిపడా యూరియా వేయక దిగుబడి తగ్గింది. యాప్‌లో యూరియా బుక్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఏజెన్సీ రైతులకు నేరుగా యూరియా అందిస్తే బాగుంటుంది.
జిల్లాలోని ఐదు గ్రామాల్లో పూర్తిగా సిగ్నల్ లేనట్లుగా వ్యవసాయ అథికారులు గుర్తించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయచంద్ర ఇటీవల ఆయా గ్రామాల్లో పర్యటించి సిగ్నల్ సమస్యపై ఆరా తీశారు. గూడూరు మండలంలోని నేలవంచ, ఊట్ల, దొరవారి తిమ్మాపురం, కొంగరగిద్ద, బయ్యారం మండలంలోని నర్సాపురం గ్రామాల్లో పూర్తిగా సిగ్నల్ లేనట్లుగా గుర్తించగా, ఇక్కడ రైతులు 470 మంది ఉన్నారు. అంతేకాకుండా బయ్యారం, గంగారం, కొత్తగూడ మండలాల్లోని 54 గ్రామాల్లో కొద్దిపాటి సిగ్నల్స్ ఉన్నట్లుగా గుర్తించి, విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.