మరో ప్రభుత్వ రంగ సంస్థకు ‘ఉరి’!
ఒకప్పుడు కోట్లలో పోలియో వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేసిన ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్‌లోని భారత్ ఇమ్యునోలాజికల్, బయోలాజికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్(బీఐబీసీవోఎల్) ఫ్యాక్టరీని నరేంద్ర మోదీ ప్రభుత్వం శాశ్వతంగా మూసివేయడంతో పదుల సంఖ్యలో ఉద్యోగులు రోడ్డునపడ్డారు.
- యూపీలోని పోలియో వ్యాక్సిన్ ఉత్పత్తి ప్లాంట్ మూసివేత
- నాలుగేండ్లు కార్మికులకు జీతాలు చెల్లించని మోదీ సర్కార్
- కుటుంబ పోషణకు మంగళసూత్రాలు అమ్ముకుంటున్న ఉద్యోగులు
బులంద్‌షహర్, నవంబర్ 6: ఒకప్పుడు కోట్లలో పోలియో వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేసిన ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్‌లోని భారత్ ఇమ్యునోలాజికల్, బయోలాజికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్(బీఐబీసీవోఎల్) ఫ్యాక్టరీని నరేంద్ర మోదీ ప్రభుత్వం శాశ్వతంగా మూసివేయడంతో పదుల సంఖ్యలో ఉద్యోగులు రోడ్డునపడ్డారు. 2022 డిసెంబర్లో ఫ్యాక్టరీ వ్యాక్సిన్ల ఉత్పత్తిని నిలిపివేసిన తర్వాత దాదాపు 100 మంది ఉద్యోగులకు జీతాల చెల్లింపు నిలిచిపోయింది.
తమ వేతన బకాయిలను డిమాండ్ చేస్తూ కోర్టులను ఆశ్రయించారు. సీబీఐ, లోక్‌పాల్ జోక్యం కోరారు. ప్రభుత్వ అధికారులకు లేఖలు రాశారు. నిరసనలు సైతం చేపట్టారు. అప్పటికీ ఆ ప్లాంట్‌ను ప్రభుత్వం పునరుద్ధరిస్తుందనే ఆశను వారు వదులుకోలేదు. అయితే ఆ ఆశ ఇప్పుడు అడియాసగా మారింది. ఈ ఏడాది సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం బీఐబీసీఓఎల్ను మూసివేయడానికి ఆమోదం తెలపడంతో ఫ్యాక్టరీ మళ్లీ పుంజుకుంటుందనే అవకాశాలన్నీ పూర్తిగా మూసుకుపోయాయి. తమకు రావలసిన వేతనాలు, ఇతర ప్రయోజనాల విషయంలో కార్మికులకు ఇప్పటికీ ఎటువంటి స్పష్టత లేదు. అలాగే వారిని ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో సర్దుబాటు చేస్తారా లేదా అన్న దానిపై కూడా ఎటువంటి సమాచారం లేదు.
1989లో భారత్‌ను వ్యాక్సిన్ల విషయంలో స్వయం సమృద్ధి చేసే లక్ష్యంతో స్థాపించిన ఈ ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ) కోసం వారు వెచ్చించిన దశాబ్దాల జీవితం ఇప్పుడు అర్థరహితంగా మిగిలిపోయింది. దేశాన్ని పోలియో రహితంగా మార్చిన పీఎస్యూను అవినీతిపరులైన అధికారులు మింగేశారు అని ఫ్యాక్టరీ మాజీ ఉద్యోగి 58 ఏండ్ల సునీల్ కుమార్ శర్మ పేర్కొన్నారు. ఉపాధి కోల్పోయిన పలువురు ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందుల వల్ల మరణించారని, మిగిలిన వారు ఆకలి చావుల అంచున ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ, ఆరోగ్య ఖర్చుల కోసం కొందరు తమ మంగళసూత్రాలను అమ్ముకునే దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు లక్షలాది మందికి కలల ప్రజా ఆరోగ్య కేంద్రంగా వెలుగొందిన ఈ సంస్థ ఇప్పుడు ఒక విఫలమైన వాగ్దానంలా నిలిచింది. ఇది పాత ప్రభుత్వ రంగ సంస్థల అవశేషాలను కాపాడటానికి మోదీ ప్రభుత్వం సుముఖంగా లేదని సూచిస్తున్నది.
అన్ని ప్రయత్నాలూ విఫలం
ఫ్యాక్టరీ మూసివేతను నివారించే ప్రతి ప్రయత్నమూ విఫలమైంది. 2025 మార్చిలో ఒక పార్లమెంటరీ స్థాయీ సంఘం ఈ సంస్థ పునరుద్ధరణ ప్యాకేజీని సిఫార్సు చేసింది. అదే సంవత్సరం డిసెంబర్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వేతన బకాయిల విషయమై సంస్థ ఉద్యోగుల ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. కానీ ఆ రెండు చర్యలూ ఆ సంస్థను మూసివేత నుంచి కాపాడలేకపోయాయి. ఈ ఫ్యాక్టరీ ప్రాంగణం ఇప్పుడు కోతులకు ఆటస్థలంగా మారింది. ప్రస్తుతం కార్మికులు తమకు రావలసిన బకాయిలను తిరిగి పొందాలని మాత్రమే ఆశిస్తున్నారు.
కంపెనీ మూసివేత, ఉద్యోగాల తొలగింపు లేదా బకాయిల చెల్లింపు గురించి ఎవరికీ ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఏండ్ల తరబడి కొనసాగుతుండగా ఇప్పుడు ఈ మౌనం కార్మికుల పరిస్థితిని మరింత దుర్భరంగా మార్చింది. నిరసన తెలుపుతూ తీవ్ర వేదనలో ఉన్న సంస్థ ఉద్యోగులకు ఢిల్లీలోని మంత్రిత్వ శాఖ అధికారులు ఎటువంటి సమాచారం కూడా అందించలేదు. ఫ్యాక్టరీ మూసివేత తర్వాత కార్మికుల పరిస్థితి ఏమిటని అడిగినప్పుడు మేము ఆ ప్రక్రియను చేపడుతున్నాము అని బయోటెక్నాలజీ విభాగం(డీబీటీ) సంయుక్త కార్యదర్శి ఏక్తా విష్ణోయ్ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

