రాజన్న సిరిసిల్ల, జూన్ 23(నమస్తే తెలంగాణ): ఒకవైపు తీవ్ర అనారోగ్యం.. మరోవైపు ఆరునెలలుగా వేతనం రాకపోవడంతో సరైన వైద్యం చేయించుకోలేక ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనతో సిరిసిల్ల పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సిరిసిల్లలోని గణేశ్‌నగర్‌కు చెందిన గడ్డం అజయ్(27) ఐదేండ్ల క్రితం టెస్కో గోదాంలో చీరల చెకింగ్‌లో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేశాడు. తర్వాత రెండేండ్ల క్రితం చేనేత జౌళీశాఖలో జూనియర్ అసిస్టెంట్ కమ్ కమ్యూనిటీ ఫెసిలేటర్గా ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా విధుల్లో చేరాడు. ఈ క్రమంలో అజయ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు.
ఐదేండ్లుగా నిమ్స్ దవాఖానతోపాటు ఇతర దవాఖానల్లో వైద్యం చేయించుకోవడానికి రూ.10లక్షల వరకు ఖర్చుచేశాడు. సోమవారం సైతం కార్యాలయంలో విధులు నిర్వర్తించాడు. అదేరోజు రాత్రి అజయ్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు స్థానిక ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌కు రిఫర్ చేయగా, అక్కడి ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అజయ్ మృతితో కార్మిక క్షేత్రంలో విషాదం అలుముకున్నది. ఆరు నెలలుగా వేతనం రాకపోవడంతో అజయ్ వైద్యానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు కుటుంబ సభ్యులు వాపోయారు. తక్షణమే తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.