పాట్నా: కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీహార్లో తన నియోజకవర్గమైన బెగుసారైలో శనివారం ఆయన పర్యటించారు. ఖోదవండుపూర్లోని వ్యవసాయ సంస్థ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘మీ సమస్యలను పట్టించుకోని ప్రభుత్వ అధికారులను కర్రలతో కొట్టండి’ అని తన నియోజకవర్గ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. అధికారులు తమ సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నట్లు పేద ప్రజల నుంచి తనకు తరచుగా ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన అన్నారు.
‘అలాంటి ప్రజలకు ఒకటే చెబుతున్నాను. చిన్న చిన్న పనుల కోసం నా వద్దకు మీరు ఎందుకు వస్తున్నారు?. ఎంపీలు, ఎమ్మెల్యేలు, గ్రామ సర్పంచ్, జిల్లా కలెక్టర్, ఇతర ప్రభుత్వ అధికారులు తప్పకుండా ప్రజలకు సేవ చేయాలి. వారు మీ మాట వినకపోతే.. రెండు చేతులతో వెదురు కర్ర పట్టుకుని వారి తల పగులగొట్టండి. అయినప్పటికీ వారు పని చేయకపోతే, అప్పుడు నా వద్దకు రండి’ అని గిరిరాజ్ సింగ్ అన్నారు. దీంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్న స్థానికులు పెద్దగా చప్పట్లు కొట్టారు.
మరోవైపు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలను ఆ అర్థంలో తీసుకోవద్దని బీహార్ రాష్ట్ర బీజేపీ నేతలు తెలిపారు. ఆయన జనం నేత అని, వారి ఆగ్రహాన్ని తగ్గించేందుకు అలా మాట్లాడారని చెప్పారు.
#WATCH | If someone (any government official) doesn't listen to your grievances, hit them with a bamboo stick. Neither we ask them to do any illegitimate job, nor will we tolerate illegitimate 'nanga nritya' by any official: Union Minister Giriraj Singh in Begusarai, Bihar pic.twitter.com/Wxc6TlHiYC
— ANI (@ANI) March 6, 2021
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.