న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 : అదనపు సుంకం ఆదివారం నుంచి అమల్లోకి రావడంతో 10 సిగరెట్లు ఉండే ప్యాకెట్‌పై కనీసం రూ. 22 నుంచి రూ. 25 వరకు ధరలు పెరిగాయి. 76 మిల్లీమీటర్ల పొడవుండే ప్రీమియం సిగరెట్ ప్యాకెట్ (10 సిగరెట్లు) బ్రాండును బట్టి రూ. 50 నుంచి రూ. 55 వరకు ఖరీదు చేయనున్నట్లు పంపిణీదారులు తెలిపారు. సవరించిన ఎంఆర్పీని ఉత్పత్తిదారులు ఇంకా జారీచేయనప్పటికీ పంపిణీదారులు మాత్రం 40 శాతం జీఎస్టీతో పాత స్టాక్‌నే రిటైలర్లకు విక్రయిస్తున్నారు.
ఆదివారం హోల్‌సేల్ మార్కెట్లకు సెలవు కావడంతో సోమవారం నుంచి కొత్త ఎంఆర్పీతో తాజా స్టాక్ రావచ్చని పంపిణీదారులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం రూ.95 ఉన్న విల్స్ నేవీ కట్(76 మి.మీ పొడవు) సిగరెట్ ప్యాకెట్(10 సిగరెట్లు) రూ.120కి పెరుగవచ్చని ఓ పంపిణీదారుడు తెలిపారు. గోల్డ్ ఫ్లేక్ లైట్స్, విల్స్ క్లాసిక్, విల్స్ క్లాసిక్ మైల్డ్ మొదలైన ప్రీమియం సిగరెట్లు(84 మి.మీ పొడవు)ప్రస్తుతం రూ.170కి (10 సిగరెట్ల ప్యాక్) అమ్ముతుండగా వాటి ధర రూ. 220 నుంచి రూ. 225కి పెరగవచ్చని ఆయన చెప్పారు. అదేవిధంగా క్లాసిక్ కనెక్ట్ సిగరెట్ (97 మి.మీ పొడవు) ప్యాకెట్ (20 సిగరెట్ల ప్యాక్) ధర ప్రస్తుతం రూ. 300 ఉండగా కొత్త ఎంఆర్పీ రూ. 350 వరకు ఉండవచ్చని తెలుస్తున్నది.
ఈ నెలాఖరు నాటికి తయారీదారుల నుంచి కొత్త ఎంఆర్పీలతో సిగరెట్ ప్యాక్‌లు వచ్చే అవకాశం ఉందని పంపిణీదారులు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు తమ సిగరెట్ ప్యాక్ నిల్వలను విడుదల చేయడం లేదని, కొత్త పన్ను విధానం కింద వాటికి బిల్లింగ్ చేసి విడుదల చేయడం ప్రారంభిస్తాయని ఓ స్టాకిస్టు తెలిపారు. దేశంలో 8,000 నుంచి 9,000 మంది సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల స్టాకిస్టులు ఉన్నట్లు ఏఐసీపీడీఎఫ్ తెలిపింది. ధరల పెరుగుదలతో విదేశీ సిగరెట్ల అక్రమ రవాణా పెరగడంతో పాటు నకిలీ ఉత్పత్తులు కూడా వెల్లువెత్తే
అవకాశం ఉంది.