న్యూఢిల్లీ, నవంబర్ 20: భారతీయుల వ్యక్తిగత డాటాను గుప్పిట పట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారీ ప్లాన్ వేసినట్టే కనిపిస్తున్నది. డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) బిల్లు-2022 పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడైనా, ఎలాగైనా వాడుకొనే అపరిమిత అధికారాలను సొంతం చేసుకొనేందుకు మోదీ సర్కారు స్కెచ్ వేసిందని హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. నాలుగుసార్లు మార్చిన ఈ బిల్లు ముసాయిదాలో పౌరుల డాటాకు రక్షణ కంటే కేంద్రం అధికారాలు పెంచేందుకే ప్రాధాన్యం ఇచ్చారని మండిపడుతున్నారు. 2018లో రూపొందించిన బిల్లుకు, 2022 బిల్లుకు సంబంధమే లేదని చెప్తున్నారు. డీపీడీపీ బిల్లు-2022 ముసాయిదాను కేంద్రం శుక్రవారం ప్రజలముందు పెట్టింది. 2021 బిల్లులో 90 సెక్షన్లు ఉండగా, 2022 బిల్లులో 22కు కుదించారు. తాజా బిల్లులో 18 చోట్ల ‘అవసరమైతే నిర్దేశించవచ్చు’ పదాన్ని వాడారు. దీన్ని బట్టి చట్టం అయ్యాక కూడా కేంద్రం తనకు అవసరమైనట్టు మార్చుకొనే వెసులుబాటు చేసు కొన్నదని న్యాయకోవిదులు అంటున్నారు. చాలా సెక్షన్లలో అస్పష్టమైన పదజాలాన్ని వాడారని చెప్తున్నారు.
లాభం కంటే నష్టమే ఎక్కువ
పౌరుల డాటా రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలని ‘పుట్టస్వామి’ కేసులో సుప్రీం కోర్టు 2017లో ఆదేశించింది. గోప్యత అనేది పౌరుల ప్రాథమిక హక్కు అని చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. అప్పటి నుంచి కేంద్రం అయిష్టంగానే 4 ముసాయిదాలను తయారు చేసింది. సుప్రీం ఆదేశాలతో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలో కమిటీని వేసింది. ఈ కమిటీ 2018లో మొదటి ముసాయిదాను రూపొందించింది. దానిలో మార్పులు చేస్తూ కేంద్రం 2019లో మరో ముసాయిదా తెచ్చింది. దాన్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపగా, కమిటీ ఏకంగా 81 సవరణలు ప్రతిపాదించింది. డీపీడీపీ-2021 బిల్లును కూడా రూపొందించింది. అయితే, 2021 ఆగస్టులో ఉన్నట్టుండి ఆ బిల్లును వెనక్కి తీసుకొన్నది. జేపీసీ 81 సవరణలు ప్రతిపాదించినందునే దానిని వెనక్కి తీసుకొన్నట్టు ప్రకటించింది. తాజాగా డీపీడీపీ-2022 ముసాయిదాను రూపొందించి ప్రజల ముందు పెట్టింది.
ఐఎఫ్ఎఫ్ అభ్యంతరాలు..
డీపీడీపీ-2022బిల్లుపై ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్ అభ్యంతరాలు లేవనెత్తింది.
డీపీడీపీ-2022లోని క్లాజ్ 18, 35.. పాత బిల్లులోని క్లాజులకు కొత్త రూపంగా ఉన్నాయి. క్లాజ్ 35 ప్రకారం ‘సార్వభౌమత్వం, దేశ సమగ్రత, దేశ రక్షణ, ఇతర దేశాలతో స్నేహ సంబంధాలు, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాలు జరగకుండా ముందస్తు ఆంక్షలు విధించటం’ వంటి కారణాలతో ప్రభుత్వ యంత్రాంగాలకు ఈ బిల్లు నుంచి మినహాయింపు లభిస్తుంది. అంటే.. ప్రభుత్వం పైవాటిలో ఏదో ఒక కారణం చూపి పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని కోరవచ్చు. అసలు అడగకుండానే డాటా సేకరించే అధికారం కేంద్రానికి దఖలు పడుతుంది.
ప్రభుత్వ సంస్థలు చట్టం పరిధిలోకి రాకపోతే డాటా సేకరణ, విశ్లేషణ, సామూహిక నిఘా తదితర విషయాల్లో ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాయి. ఇది పౌరుల భద్రతకు ప్రమాదం మాత్రమే కాదు.. అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు ప్రభుత్వ సంస్థల ద్వారా సేకరించిన పౌరుల సమాచారాన్ని వాడుకొనే ప్రమాదం కూడా ఉన్నది.
డాటా ప్రొటెక్షన్ బోర్డు పేరుతో ఓ స్వతంత్ర సంస్థను నెలకొల్పాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. అయితే ఈ బోర్డు సభ్యులను కేంద్రమే నియమించ నున్నందున భవిష్యత్తులో డమ్మీగా మారనున్నదని పౌర హక్కుల కార్యకర్త మిషి చౌదరి విశ్లేషించారు.
డాటా దుర్వినియోగానికి పాల్పడే సంస్థలకు రూ.500 కోట్ల వరకు జరిమానా విధించాలని ప్రతిపాదించారు. కానీ, డాటా పోగొట్టుకొని నష్టపోయిన పౌరునికి నష్టపరిహారం చెల్లించే ప్రస్తావన బిల్లులో లేకపోవటం ఆశ్చర్యం కలిగించింది.
పైగా తప్పుడు వ్యక్తిగత సమాచారం ఇచ్చే పౌరులకు జరిమానా విధించే అధికారం బోర్డుకు ఉంటుంది. ఉదాహరణకు షాపింగ్‌మాల్‌కు వెళ్తే.. మీ వివరాలు అడిగారు అనుకొందాం. తప్పుడు వివరాలు ఇస్తే బోర్డు మీకు జరిమానా విధించవచ్చు.