హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)పై యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటి టెస్ట్(నెట్) పరీక్ష ప్రభావం పడనుంది. అటు టెట్.. ఇటు యూజీసీ నెట్ రెండు పరీక్షలు ఒకే తేదీల్లో జరగనున్నాయి. దీంతో టెట్‌ను వాయిదావేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. టెట్ నోటిఫికేషన్ నవంబర్ 7న విడుదల కాగా, పరీక్షలను జనవరి 1 నుంచి 20 వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. ఇటీవలే యూజీసీ నెట్ నోటిఫికేషన్ సైతం విడుదలైంది. డిసెంబర్ 11 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈ పరీక్షలను జనవరి 1 నుంచి 19 వరకు నిర్వహిస్తామని యూజీసీ ప్రకటించింది.
ముషీరాబాద్, డిసెంబర్ 2: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడువకముందే 85 వేల కోట్ల అప్పు చేసిందని, కనీసం ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల ఉసురు తీస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. 16.75 లక్షల మంది విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని, గందరగోళంగా మారిన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో విద్యార్థులతో కలిసి మహాదీక్ష చేపట్టారు.