హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్లకు మేలు చేకూర్చేందుకే కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణకు పూనుకొంటున్నదని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్ బీఎస్ రాంబాబు పేర్కొన్నారు. బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2021కి వ్యతిరేకంగా ఈ నెల 16, 17వ తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగుతున్న నేపథ్యంలో బుధవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. బ్యాంకులను ప్రైవేటీకరిస్తే ఎదురయ్యే పరిస్థితులను వివరించారు.
నమస్తే: బ్యాంకింగ్ చట్టాల సవరణ-2021 బిల్లు పాసైతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి?
రాంబాబు: అన్నివర్గాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ బిల్లు పాసైతే అల్పాదాయ వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఎట్టిపరిస్థితుల్లో రుణాలు దొరకవు. పబ్లిక్ నుంచి ప్రైవేట్ సెక్టార్లోకి ఒకసారి బ్యాంకులు వెళ్తే వాటిపై ప్రభుత్వానికి అజమాయిషీ ఉండదు. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యాపారుల పార్టీగా ముద్రవేసుకున్నది.
సమ్మెచేస్తే ఖాతాదారులు ఇబ్బందులకు గురవుతారు కదా?
రెండు రోజులు చాలా తక్కువ సమయం. పార్లమెంట్లో బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు-2021ని ఆమోదిస్తే ఉద్యోగులతోపాటు దేశ ప్రజలంతా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని జాతీయం చేసిన బ్యాంకుల లక్ష్యం నీరుగారిపోయి.. సంపదంతా పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్తుంది. అప్పుడు మహిళా పొదుపు సంఘాలకు, చేనేత వృత్తిదారులకు, వివిధ కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక స్వావలంబన కోసం ఇచ్చే రాయితీలను కుదిస్తారు. వారు నిర్ణయించిన వడ్డీని కాదనకుంటా చెల్లించాల్సి ఉంటుంది.
సమస్యలు వస్తున్నందునే బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తున్నామంటున్నారు కదా?
ప్రజల సొమ్మును కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెట్టడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ అస్ర్తాన్ని సంధిస్తున్నది. బ్యాంకుల్లో ఉన్న 1.57 కోట్ల ప్రభుత్వరంగ సంస్థల డిపాజిట్లను కార్పొరేట్లకు పంచడమే ప్రైవేటీకరణ ప్రధాన ఉద్దేశం. బ్యాంకులపై కార్పొరేట్ల అజమాయిషీ పెరిగితే మహిళా స్వయం సహాయక బృందాలకు ఇచ్చే వడ్డీ లేని రుణాలను, తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రాయితీలను కోల్పోవాల్సి వస్తుంది. కార్పొరేట్ సంస్థల మొండి బకాయిలే నేడు బ్యాంకులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. కార్పొరేట్ సంస్థల రుణాలను యూపీఏ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు మాఫీ చేస్తే.. మేమేమీ తక్కువ తినలేదన్నట్టు బీజేపీ ప్రభుత్వం రూ.15 లక్షల కోట్లు మాఫీ చేసింది. లేనోడిని కొట్టి ఉన్నోడికి పెట్టినట్టు ఉన్నది పరిస్థితి.
ప్రైవేటీకరణ వల్ల పేదరికం పెరిగే అవకాశం ఉన్నదా?
ప్రైవేటు రంగంలో బ్యాంకులు పట్టణాలకే పరిమితమవుతాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అసమానతలు పెరిగిపోయి పేదరికానికి దారితీస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ లాంటి పార్టీలు ఓటు బ్యాంకు కోసం జిమ్మిక్కులు చేసి అమలుకు నోచుకోని హామీలను గుప్పించి పేదలకు మొండిచేయి చూపుతాయి. బిల్లును వెనక్కి తీసుకోకుంటే అన్ని వర్గాలతో కలిసి ఉద్యమిస్తాం.
ప్రభుత్వ పథకాల అమలులో ప్రైవేట్ బ్యాంకుల పాత్ర ఎలా ఉంటుంది?
ఉదాహరణకు జనధన్ ఖాతాలు తెరువడంలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు 99 శాతం కృషి చేశాయి. 1969లో బ్యాంకుల జాతీయీకరణను వ్యతిరేకించినవారే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో ఉన్నారు. వారే బ్యాంకులను మళ్లీ ప్రైవేటుకు అప్పగించాలని అంటున్నారు. రిజర్వు బ్యాంకు గవర్నర్గా రఘురాంరాజన్ ఉన్నప్పుడు రుణ ఎగవేతదారులపై కేంద్రమే చర్యలు తీసుకోవాలని సూచించారు. కానీ నరేంద్రమోదీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. ఎగవేతదారులకు వంత పాడింది.
బిల్లుపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే?
రైతులు ఉద్యమించిన తరహాలో దేశవ్యాప్తంగా ఉద్యోగులు, పలు సంఘాలు, పార్టీలతో కలిసి పోరాడుతాం. ఇప్పటివరకు 13 ప్రైవేట్ కార్పొరేట్ ఖాతాల ద్వారా ఉన్న మొండి బాకీలు రూ.4,46,800 కోట్లు కాగా.. వసూలైన మొత్తం రూ.1,61,820 కోట్లు మాత్రమే. బ్యాంకులు నష్టపోయిన సొమ్ము రూ.2,84,980 కోట్లు (64 శాతం). ఇది దేశ ప్రజలందరికీ నష్టమే కదా. అందుకే అందరం కలిసి పోరాడితే కేంద్రం దిగిరాక తప్పదు.
బ్యాంకుల విలీనం వల్ల మూలధనం పెరుగుతుందా?
గతంలో 28 బ్యాంకులుగా ఉన్నప్పుడు 86 వేల శాఖలుండేవి. మూలధనం పేరుతో వాటిని యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు విలీనం చేయగా ప్రస్తుతం 12 బ్యాంకులు మాత్రమే మిగిలాయి. లాభాలు రాకపోతే మూసివేయాలన్న ముందస్తు ప్రణాళికతో తొలుత శాఖలను విలీనం చేస్తారు. పార్లమెంటులో గనక బిల్ పాస్ అయితే ఎస్బీఐ తప్ప మిగిలిన 11 బ్యాంకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ఇప్పటివరకు యజమానిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం.. 71 నుంచి 76 శాతం మేర ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే వీలు ఏర్పడుతుంది. దీంతో ప్రైవేటు వ్యక్తులు తమ సొంత పాలసీని అమలుచేయడం వల్ల ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నది.