ఆత్మకూర్ : ఆత్మకూరు పట్టణంలో రెండు వర్గాల కల్లు దుకాణాల పంచాయతీ (Taddy panchayat ) రచ్చకెక్కింది. కొత్తగా ఏర్పాటుచేసిన దుకాణంలోకి పాత దుకాణాపు నిర్వాహకులు దాడిచేసి కల్లు కేసులను ధ్వంసం చేసిన ఘటన పట్టణంలో సంచలనం కలిగించింది. గత సంవత్సరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మకూరు పట్టణంలో కల్లు దుకాణం ఏర్పాటుకు మాజీ సర్పంచ్ గంగాధర్ గౌడ్‌కు ( Gangadhar Goud ) అనుమతించారు.
కొన్ని నెలల తరువాత సొసైటీలోని సభ్యులకు షేర్ల పంపకాల్లో తేడాలు రావడంతో కల్లు దుకాణం లైసెన్స్ కలిగిన సొసైటీ అధ్యక్షుడు ఆలవిందర్తో కలిసి కొంతమంది సొసైటీ సభ్యులు చందుగౌడ్ అనే వ్యక్తి పేరిట మరో కల్లు దుకాణాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఈ పంచాయతీ స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ( MLA Srihari ) దృష్టికి వెళ్లడంతో ఇరువర్గాలను పిలిచి సముదాయించి ఇరువురు గొడవలు లేకుండా కల్లు దుకాణాలు నడిపించుకోవాలని సూచించడంతో వివాదం సద్దుమణిగింది.
అయితే రెండవ కల్లు దుకాణంలో విక్రయాలు పెరిగి గంగాధర్ గౌడ్ కల్లు దుకాణంలో తగ్గడంతో మళ్లీ గొడవ ప్రారంభమైంది. మాజీ సర్పంచ్ గంగాధర్ గౌడ్ వర్గీయులు రెండవ కల్లు దుకాణంలోకి చొరబడి కల్లు కేసులను పారబోసి ధ్వంసం చేశారు. పట్టణంలో రెండు దుకాణాల మధ్య జరుగుతున్న గొడవపై ఎక్సైజ్ అధికారులు చూసిచూడనట్లు ఉండడంపై సర్వత్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.