హైదరాబాద్, డిసెంబర్ 13(నమస్తే తెలంగాణ): కాటేదాన్‌లోని కాలుష్యకారక స్టీల్ పరిశ్రమలను వచ్చే మూడు నెలల్లోగా ఔటర్ రింగ్‌రోడ్డు వెలుపల ఏర్పాటు చేసిన రాకంచర్ల స్టీల్ ఇండస్ట్రియల్ పార్కుకు తరలించాలని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఐఐసీ) చైర్మన్ గ్యాదరి బాలమల్లు స్పష్టం చేశారు. లేనిపక్షంలో రాకంచర్లలో వారికి కేటాయించిన భూములను రద్దుచేయడమే కాకుండా కాటేదాన్‌లోని పరిశ్రమలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కాటేదాన్‌లోని కాలుష్యకారక స్టీల్ పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలికి తరలింపు అంశంపై సోమవారం బాలమల్లు అధ్యక్షతన స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత పరిశ్రమల యజమానుల సమావేశం టీఎస్ఐఐసీ కార్యాలయంలో జరిగింది.
ఈ సందర్భంగా 2008లో షిఫ్టింగ్ నోటీసులు జారీచేసిన పరిశ్రమలతోపాటు తాజాగా కాటేదాన్, జీడిమెట్లలో గుర్తించిన మొత్తం 35 పరిశ్రమలను వికారాబాద్ జిల్లా రాకంచర్లలో 150 ఎకరాల్లో ఏర్పాటు చేసిన స్టీల్ ఇండస్ట్రియల్ పార్కుకు తరలించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా బాలమల్లు మాట్లాడుతూ.. పరిశ్రమల తరలింపు తప్పదని, వారికి ఇదే చివరి అవకాశమని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరి 10లోగా డీపీఆర్‌ను సమర్పించి మూడు నెలల్లోగా రాకంచర్ల ఇండస్ట్రియల్ పార్కులో పరిశ్రమల ఏర్పాటు పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాలు, ప్రభుత్వ మార్గదర్శకాలు, ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు, దీనికి ప్రతి ఒక్కరూ కట్టుబడుతూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
పరిశ్రమల తరలింపులో సమస్యలుంటే తక్షణమే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో చేవెళ్ల పార్లమెంటు సభ్యులు రంజిత్ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, తదితరులు పాల్గొని పరిశ్రమల తరలింపుపై యజమానులు, అధికారులకు తగిన సూచనలు చేశారు. టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి, వికారాబాద్ జెడ్పీ వైస్ చైర్మన్ విజయ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ ఇంజినీర్ నరేందర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.