స్టార్టప్స్, ఎన్జీవోల భాగస్వామ్యాన్ని కోరిన టీఎస్ఐసీ
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): సంక్లిష్టమైన సామాజిక సమస్యలకు పరిష్కారాలను కనుగొనేందుకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ఇంపాక్ట్ ల్యాబ్‌ను ప్రారంభించింది. దీనిలో భాగస్వాములు కావాలని దేశవ్యాప్తంగా ఉన్న స్టార్టప్స్‌కు, ఎన్జీవోలకు పిలుపునిచ్చింది. యాక్షన్ ఎయిడ్ ఇండియా, వరల్డ్ విజన్ ఇండియా, సేవ్ ద చిల్డ్రన్, ప్లాన్ ఇంటర్నేషనల్, హెల్ప్‌ఏజ్ ఇండియా, సోపార్-బాల వికాస, అక్షయపాత్ర, యంగిస్థాన్ ఫౌండేషన్, గ్రీన్‌పీస్ ఇండియా తదితర జాతీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు ఈ ల్యాబ్‌లో పాలుపంచుకొంటున్నాయి. విద్య, ఆరోగ్యం, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ తదితర విభాగాల్లో పరిష్కారాలు కనుగొనడంపై ఈ ల్యాబ్ దృష్టి సారిస్తుంది. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారాలను చూపడంపై స్టార్టప్‌లు దృష్టిసారిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఇంపాక్ట్ ల్యాబ్ ద్వారా మరో సరికొత్త చొరవకు శ్రీకారం చుట్టిందని ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ పేర్కొన్నారు.