హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ నాయకత్వంలో గురువారం చేపట్టిన మహాధర్నా దేశాన్ని కదిలించిందని టీఆర్ఎస్ ఎంపీలు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారని తెలిపారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిన రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోరాటంలో మరణించిన వందలాది మంది రైతులకు నివాళి అర్పించారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో పార్లమెంట్ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని గతంలో అనేక రాష్ర్టాలు డిమాండ్ చేసినా పట్టించుకోని కేంద్రం, సీఎం కేసీఆర్ జాతీయస్థాయిలో ఉద్యమాన్ని లేవదీస్తామని, టీఆర్ఎస్ నాయకత్వం వహిస్తుందని ప్రకటించడంతో దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారి తీసిందని చెప్పారు.
సీఎం కేసీఆర్ రైతాంగానికి నాయకత్వం వహిస్తే జరిగే పరిణామాలను అంచనా వేసిన తర్వాతే ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు ద్వంద్వ విధానాన్ని మానుకోవాలని హితవుపలికారు. ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ చట్టాలను పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పటి నుంచే సీఎం కేసీఆర్.. ఆ చట్టాలు రైతుల పాలిట మరణశాసనంగా మారుతాయని భావించే వాటిని వ్యతిరేకించాలని తమకు దిశానిర్దేశం చేశారని గుర్తుచేశారు. అందుకు అనుగుణంగానే తామంతా పార్లమెంట్ లోపలా, బయటా ప్లకార్డులు పట్టుకొని నినదించామని చెప్పారు. ఎంపీ పోతుగంటి రాములు మాట్లాడుతూ.. రాష్ర్టాలు బాగుపడితేనే దేశం సుభిక్షంగా ఉంటుందని సీఎం కేసీఆర్ ఆలోచన అని, ఆ ఆలోచన వల్లే రాష్ట్ర రైతాంగం బాగుపడుతున్నదని తెలిపారు.
ఇదే స్ఫూర్తి దేశమంతా రావాలని ఆకాంక్షించారు. ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రైతుల కోసం ఆలోచిస్తున్న సీఎం కేసీఆర్ ఒక్కరేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో వరి ధాన్యం కొనేవరకు తమ పోరాటం ఆగదన్నారు. ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ.. రాష్ట్ర రైతాంగాన్ని తప్పుదారి పట్టించేలా ప్రయత్నాలు చేస్తే బండి సంజయ్‌లాంటి వారికి బడితే పూజ తప్పదని హెచ్చరించారు.ఎంపీ వెంకటేశ్‌నేతకాని మాట్లాడుతూ.. రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పటికైనా కండ్లు తెరవాలని హితవుపలికారు. రాజ్యాంగ విలువలకు, సమాఖ్యస్ఫూర్తికి నిదర్శనంగా నిలవాల్సిన కేంద్రం, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ ఎం శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు లింగంపల్లి కిషన్‌రావు, గాంధీనాయక్ పాల్గొన్నారు.