సిటీబ్యూరో, జూన్ 15(నమస్తే తెలంగాణ): వర్షాకాలంలో నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరానే లక్ష్యంగా టీజీఎస్పీడీసీఎల్ తన పరిధిలో చేపట్టిన పోల్స్ అండ్ లైన్స్ స్పెషల్ డ్రైవ్ వాక్ అలాంగ్ ద లైన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆ సంస్థ సీఎండీ జితేశ్ వీ పాటిల్ హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ప్రాంత పరిధిలో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలోని తిరుమలగిరి 33/11కేవీ సబ్‌స్టేషన్ నుంచి వెలువడే 11కేవీ వేణుగోపాల్ నగర్ ఫీడర్పై వాక్ అలాంగ్ ద లైన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జితేశ్ పాటిల్ ఫీడర్ వెంట పాదయాత్ర చేస్తూ విద్యుత్ లైన్లు, స్తంభాలు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, ఇన్సులేటర్లు, కండక్టర్లు ఇతర విద్యుత్ మౌలిక సదుపాయాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
క్యూర్ పరిధిలోని అన్ని సర్కిళ్లలో 33 కేవీ సబ్స్టేషన్లు, 33 కేవీ, 11 కేవీ ఫీడర్లు, డీటీఆర్లు, ఎల్టీ నెట్‌వర్క్‌లను సమగ్రంగా తనిఖీ చేసి వర్షాకాలానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరా నాణ్యత, లైన్‌క్లియరెన్స్, నిర్వహణ పనులు, పరికరాల స్థితిగతులు, నెట్ వర్క్ పనితీరును సీఎండీ క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యుత్ అంతరాయాలకు దారితీసే సమస్యలను ముందుగానే గుర్తించి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం మేడ్చల్ జోన్ గన్రాక్లోని మేడ్చల్ సర్కిల్ కార్యాలయంలో, రంగారెడ్డి జోన్ కార్యాలయంలో వర్షాకాల సన్నద్ధతపై సమీక్ష సమావేశం నిర్వహించిన జితేశ్ పాటిల్ వర్షాకాలంలో ట్రీట్రిమ్మింగ్ పనులు, లైన్ క్లియరెన్స్, ఫీడర్ల నిర్వహణ, ట్రాన్స్ఫార్మర్ల భద్రత, అత్యవసర స్పందన వ్యవస్థలపై సమగ్రంగా చర్చించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో 11కేవీ ఫీడర్లపై చెట్లకొమ్మల తొలగింపు పనులను ఈనెల 16నుంచి ప్రారంభించి నెలాఖరు వరకు కొనసాగిస్తామని సీఎండీ చెప్పారు. విద్యుత్ లైన్లను తాకే చెట్ట కొమ్మలను తొలగించడం ద్వారా షార్ట్ సర్క్యూట్లు, ఫీడర్ ట్రిప్పింగ్, విద్యుత్ అంతరాయాలను నివారించేందుకు చర్యలు చేపడుతున్నారని జితేశ్ పాటిల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమర్షియల్ డైరెక్టర్ చక్రపాణి, మేడ్చల్ జోన్ సీఈ పీవీ రమేశ్, ఎస్ఈ కరుణాకర్‌బాబు, రంగారెడ్డి జోన్ సీఈ పాండ్యానాయక్, జీఎం అంజయ్య, సికింద్రాబాద్ సర్కిల్ ఇన్చార్జి ఎస్ఈ దిలీప్‌కుమార్, సైబర్ సిటీ సర్కిల్ ఎస్ఈ చంద్రశేఖర్, సరూర్‌నగర్ సర్కిల్ ఎస్ఈ లక్ష్మీనారాయణ, రాజేంద్రనగర్ డీఈ రత్నాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.