హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): సర్కారు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టాలని నిర్ణయించిన విద్యాశాఖ టీశాట్ చానళ్ల ద్వారా టీచర్లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, టీశాట్ సీఈవో శైలేశ్‌రెడ్డి బషీర్‌బాగ్‌లోని మంత్రి కార్యాలయంలో ఈ అంశంపై సమీక్షించారు. రాష్ట్రంలో 1.03 లక్షల మంది టీచర్లు ఉండగా, వారిని మూడు బ్యాచ్‌లుగా విభజించి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.
శిక్షణ ఇచ్చే మాడ్యూల్స్‌ను సిద్ధంచేసి, వాటిని టీశాట్ ద్వారా ప్రసారం చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని శైలేశ్‌రెడ్డి మంత్రి సబితాఇంద్రారెడ్డికి వివరించారు. ఆయా మాడ్యూల్స్‌ను టీశాట్ ద్వారానే కాకుండా డిజిటల్, సోషల్ మీడియా ద్వారా అందుబాటులోకి తేవచ్చని సూచించారు. దీని ద్వారా శిక్షణకు హాజరుకాలేని వారు, ఒకటి రెండు సార్లు వీక్షించి సమర్ధంగా శిక్షణ పొందుతారని వెల్లడించారు. వేసవి సెలవుల్లో 1 నుంచి 8 తరగతుల్లోని ఇంగ్లిష్ పాఠ్యాంశాలను రికార్డు చేసి, డిజిటల్ పాఠాలను టీశాట్ ద్వారా ప్రసారం చేస్తే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని ప్రతిపాదించారు.
మూడు రకాల శిక్షణ ఇలా..
మొదటిది సహచర టీచర్ల చేత మిగిలిన టీచర్లందరికీ శిక్షణ ఇప్పించటం.
రెండోది అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ కోర్సును పూరి ్తచేయించడం.
మూడోది టీశాట్ ద్వారా డిజిటల్ శిక్షణ. తొలుత తెలుగు మీడియం వారికి శిక్షణ ఇచ్చి, ఆ తర్వాత ఇంగ్లిష్ మీడియం వారికి ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.