Toxic | తెలుగు చిత్ర పరిశ్రమలో థియేటర్ల కేటాయింపుల వివాదం మరోసారి తీవ్రరూపం దాల్చింది. బాక్సాఫీస్ వద్ద స్ట్రైట్ తెలుగు మరియు డబ్బింగ్ చిత్రాలు ప్రదర్శితమవుతున్న వేళ, పాన్-ఇండియా స్థాయిలో రాబోతున్న భారీ బడ్జెట్ డబ్బింగ్ సినిమా ‘టాక్సిక్’ (Toxic) ఎంట్రీతో సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో, ఎగ్జిబిటర్లు ఈ సినిమాకు అత్యధిక సంఖ్యలో స్క్రీన్లను కేటాయించేందుకు పోటీ పడుతున్నారు.
ఇటు టాలీవుడ్లో సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, అలాగే రవితేజ నటించిన ‘ఇరుముడి’ చిత్రాలు పాజిటివ్ టాక్తో విజయవంతంగా ప్రదర్శించబడుతున్నాయి. ఇలాంటి తరుణంలో ‘టాక్సిక్’ లాంటి భారీ క్రేజ్ ఉన్న పాన్-ఇండియా చిత్రం ఎంట్రీ ఇస్తుండటంతో థియేటర్ల పోరు నైజాంతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మళ్లీ మొదలైంది. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో స్క్రీన్ల సర్దుబాటు నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లకు తలనొప్పిగా మారింది. భారీ రేట్లకు థియేటర్ల హక్కులను దక్కించుకున్న బడా సంస్థలు సింగిల్ స్క్రీన్లతో పాటు మల్టీప్లెక్స్లలోనూ సింహభాగం స్క్రీన్లను ‘టాక్సిక్’ కోసం లాక్ చేస్తున్నట్లు సమాచారం. దీనివల్ల బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోవాలని చూస్తున్న స్థానిక తెలుగు చిత్రాలకు, చిన్న సినిమాలకు థియేటర్ల కొరత తీవ్రంగా ఏర్పడుతోంది. ప్రతిసారీ భారీ బడ్జెట్ పాన్-ఇండియా సినిమాలు విడుదలైనప్పుడల్లా టాలీవుడ్లో లోకల్ సినిమాలకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తడం, థియేటర్ల కోసం పెద్ద యుద్ధమే జరగడం పరిపాటిగా మారింది. ఈసారి ఈ వివాదం ఏ స్థాయికి వెళ్తుందోనని సినీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.