ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతక విజేత మీరాబాయి చాను రాబోయే లాస్ఏంజెల్స్ విశ్వక్రీడల్లో తన వెయిట్ క్యాటగిరీని 49 కిలోల నుంచి 53 కిలోలకు మార్చుకోనుంది. లాస్ ఏంజెల్స్ గేమ్స్ కోసం ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ).. 49 కి. విభాగాన్ని రద్దు చేసి కనిష్ట వెయిట్ క్లాస్‌ను 53 కి.గా నిర్ధారించింది. దీంతో ఆమె కొత్త క్యాటగిరీకి మార్చుకోవాల్సి వచ్చింది.
టోక్యోలో ఆమె 49 కి. విభాగంలోనే రజతం గెలిచింది. అయితే 53 కి. క్యాటగిరీకి మారడం మీరాకు మంచిదేనని ఆమె కోచ్ విజయ్ శర్మ తెలిపాడు. టోర్నీ కోసం బరువు తగ్గడం.. దానిని మెయింటెన్ చేయడం కష్టంగా ఉండేదని.. ఇకపై ఆ తిప్పలుండవని చెప్పారు. అయితే వచ్చే ఏడాది ఆసియా క్రీడల వరకూ చాను.. పాత (48/49) వెయిట్ క్లాస్‌లోనే పోటీపడుతుంది.