హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్ (టీఎల్ఎంఏఎల్) యుద్ధ విమానం రెక్కల (ఫైటర్ వింగ్స్) తయారీలో మరో మైలురాయిని అధిగమించింది. దేశీయంగా తొలి ప్రోటోటైప్ ఫైటర్ వింగ్ షిప్సెట్ను విజయవంతంగా తయారు చేసింది. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిన ఈ ఫైటర్ వింగ్‌ను మంగళవారం ఆదిబట్లలోని టీఎల్ఎంఏఎల్ కార్యాలయంలో ప్రదర్శించింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు మాట్లాడుతూ.. ఏరోస్పేస్, డిఫెన్స్ ఎకోసిస్టం అభివృద్ధిలో తెలంగాణకు సాటిలేదని చెప్పారు. హైదరాబాద్‌లో తయారైన 150వ సీ130జే విమానం తోక భాగాన్ని (ఎంపన్నేజ్ను) ఇటీవలే డెలివరీ చేసిన టీఎల్ఎంఏఎల్ తాజాగా ఫైటర్ వింగ్‌ను విజయవంతంగా సర్టిఫై చేసి విడుదల చేయడం ఆ సంస్థ సామర్థ్యానికి నిదర్శనమని ప్రశంసించారు. ఈ ఫైటర్ వింగ్‌లో 70% దేశీయ పరికరాలనే ఉపయోగించారని, వాటిలో 16 హైదరాబాద్‌లో తయారైనవేనని తెలిపారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణ గత ఐదేండ్లలో ఎంతో అభివృద్ధిని సాధించిందనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు.
రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూల విధానాలు, ఇక్కడ కల్పిస్తున్న మౌలిక సదుపాయాలే ఇలాంటి గొప్ప విజయాలకు దోహదపడుతున్నాయని చెప్పారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ తదితర దేశాలకు చెందిన ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్లు తమ ఇంజినీరింగ్, తయారీ, శిక్షణ, ఇన్నోవేషన్ కేంద్రాల స్థాపనకు తెలంగాణను ఎంచుకోవడం ఇక్కడ ఎకోసిస్టం అభివృద్ధికి మరో కారణమని అన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు అవసరమైన పరికరాలను సరఫరాచేసే వెయ్యికిపైగా చిన్న తరహా పరిశ్రమలు తెలంగాణలో కొనసాగుతున్నాయని తెలిపారు. 2018, 2020లో పౌర విమానయానశాఖ మోస్ట్ ప్రోగ్రెసివ్ ఔట్లుక్ ఇన్ ఏరోస్పేస్ సెక్టార్ కింద తెలంగాణను బెస్ట్ స్టేట్ అవార్డ్‌తో సత్కరించిందని, 2020-21లో ఫైనాన్షియల్ టైమ్స్ కాస్ట్ ఎఫెక్టివ్‌నెస్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణకు మొదటి ర్యాంకు లభించిందని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.
త్వరలో అత్యంత సంక్లిష్ట ఏరోస్ట్రక్చర్ల తయారీ
టీఎల్ఎంఏఎల్ త్వరలో ఫ్యూయల్ క్యారీయింగ్ 9జీ, 12,000 హోవర్‌ను తయారు చేయనున్నదని, సాంకేతికంగా ఇవి అత్యంత సంక్లిష్టమైన ఏరోస్ట్రక్చర్లని లాక్‌హీడ్ మార్టిన్ వైస్‌ప్రెసిడెంట్ అమీ బర్నెట్ తెలిపారు. సీ-130జే ఎంపెన్నేజ్ అసెంబ్లీలకు ఏకైక అంతర్జాతీయ సోర్స్‌గా తమ సంస్థ సేవలు అందించనున్నదని, ఈ ఎంపెన్నేజ్లను అన్ని నూతన సూపర్ హెర్క్యులస్ విమానాల్లోనూ అమర్చుతారని వివరించారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సుకరణ్‌సింగ్ మాట్లాడుతూ.. ఫైటర్ వింగ్ షిప్‌సెట్ ప్రోటోటైప్ ప్రాజెక్టును పూర్తిచేయడాన్ని లాక్‌హీడ్ మార్టిన్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ భాగస్వామ్యంలో కీలక మైలురాయిగా అభివర్ణించారు. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ జోయల్ రీఫ్మాన్, ఎల్ఎం ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ విలియం బ్లెయిర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూల విధానాలు, ఇక్కడ కల్పిస్తున్న మౌలిక సదుపాయాలే ఇలాంటి గొప్ప విజయాలకు దోహదపడుతున్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ తదితర దేశాలకు చెందిన ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్లు తమ ఇంజినీరింగ్, తయారీ, శిక్షణ, ఇన్నోవేషన్ కేంద్రాల స్థాపనకు తెలంగాణను ఎంచుకోవడం ఇక్కడ ఎకోసిస్టం అభివృద్ధికి మరో కారణం. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు అవసరమైన పరికరాలను సరఫరా చేసే వెయ్యికిపైగా చిన్న తరహా పరిశ్రమలు తెలంగాణలో కొనసాగుతున్నాయి.
-మంత్రి కేటీఆర్