గర్భగుడి దాటని బుల్లి దేవతలు
మాటువేసి సూస్తున్న
రాటుదేలిన రాక్షసుల భయానికి
కడప దాటకుంట
కడుపులనే మాయమైతున్నరు…
ఓ పక్క మల్లెపూలకు మంటవెట్టిన
కమురు వాసన…
ఇంకొక పక్క అందమైన
గులాబీలను మరుగవెట్టిన
కౌసు వాసన… అయినా గానీ
గా వాసన ఎన్ని ముక్కులల్ల సొచ్చినా
ఏ గుండెనూ తాకుత లేదు…
గా వాసన సుడిగాలిల కల్సి
గాయి గత్తర సేత్తుంది…
కుతిదీర తిందమని
బుద్దితోటి తాటిల ఏసుకున్న
బువ్వల సెమట కలిసిన ఉప్పు రుచి…
ల్యాత గులాబీ మొగ్గలకు
తుమ్మముండ్లు గుచ్చి
తుకపెక ఉడికిచ్చిన
రుచి… అయినా గానీ
గా రుచి ఎన్ని నాలికెల
నరాలల్ల పాకినా
ఏ మెదడుదాకా పారుతలేదు…
గా రుచికి కడుపులకెల్లి
దేవుకచ్చిన గానీ
దేకుడు లేదు కానుడు లేదు…
గీ మనుషులు తిరిగే అడివిల
ఏ వాసనా సోకని ఏ రుచీ తాకని
ఆకులు రాలిన సెట్లు
రాలిపోయిన మొగ్గలను సూడలేక
బుగులు బుగులుగా
మొగులు కెయి మొకమేసి
రాలేటి రంగుల సుక్క కోసం
కొన్ని కండ్లు ఒక్క తీరు సూత్తున్నయి…