e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News ప్రశ్న ఈవారం కథ

ప్రశ్న ఈవారం కథ


( నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజా గ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2020’లో ప్రచురణకు ఎంపికైన కథ. )


శివశంకర్‌, ఐఏఎస్‌ (డిస్ట్రిక్ట్‌ కలెక్టర్‌ అండ్‌ మేజిస్ట్రేట్‌)’ అన్న నేమ్‌బోర్డ్‌ చదువుతూ.. కాస్త గర్వంగా కలెక్టరేట్‌ ఆవరణలోకి ప్రవేశించాడు కృష్ణమూర్తి. కలెక్టరుకు పిల్లనిచ్చిన మామగారు.. మరి ఆమాత్రం గర్వం ఉండదా! లోపలికి వస్తుండగా, గార్డెన్‌లో చెట్ల చాటు నుంచి మాటలు వినిపిస్తే.. ఒక చెవి అటు వేశాడు.
“అబ్బే.. సారు చాలా స్ట్రిక్ట్‌! ఎవరు చెప్పినా వినడు. కచ్చితంగా రూల్స్‌ ఫాలో అవుతాడు. ఎక్కడికి ట్రాన్స్‌ఫర్‌ చేసినా రెడీగా ఉంటాడు.. అంతేగానీ ఏమాత్రం కాంప్రమైజ్‌ కాడు!”.. ఇదీ ఆ మాటల సారాంశం. ఆ మాటలు వినగానే కృష్ణమూర్తి మరింత గర్వంతో ఆఫీసు మెట్లు ఎక్కసాగాడు.
విజిటర్స్‌ అందరినీ కలిసి పంపించేశాడు కలెక్టర్‌ శివశంకర్‌. బయటకు వెళ్లబోతుండగా ఆ రోజు జిల్లా వార్తల పేపర్‌ క్లిప్పింగ్స్‌ ఉన్న ఫోల్డర్‌ను తీసుకొని వచ్చాడు సీసీ.
“ఉండనీ.. వచ్చాక చూస్తాను”.. అన్న వాడల్లా, ‘దారిలో చూడొచ్చు కదా!’ అనుకొని కారులో పెట్టమన్నాడు. గుమ్మంలో ఎదురైన మామగారిని తనతోపాటు కారులో ఎక్కించుకొన్నాడు.
“ఎక్కడికి అల్లుడూ ప్రయాణం?” అడిగాడు కృష్ణమూర్తి.
“ఇక్కడే పది కిలోమీటర్లు ఉంటుంది. హాస్టల్‌కు వెళ్లి అక్కడే భోజనం చేద్దాం పదండి” అని చెప్పాడు శివశంకర్‌.
కారులో కూర్చునే.. పేపర్‌ క్లిప్పింగ్స్‌ చూడటం మొదలుపెట్టాడు.
‘కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ.. అధికారుల సస్పెన్షన్‌’, ‘కట్టిన ఆరునెలలకే కుప్పకూలిన వాటర్‌ ట్యాంక్‌.. కాంట్రాక్టర్‌ లైసెన్స్‌ రద్దుకు సిఫార్సు చేసిన కలెక్టర్‌’, ‘బంగారం అని నమ్మించి మోసం.. వ్యాపారిని గజ్జికుక్కను కొట్టినట్టు కొట్టిన గ్రామస్తులు’.. ఇలా వార్తల హెడ్డింగ్స్‌ చదువుతున్న వాడల్లా, ‘గజ్జికుక్క’ అనే పదం కనిపించగానే ఒక్కసారి ఆగిపోయాడు. వెంటనే తన బడి రోజుల్లో జరిగిన ఒక సంఘటన కండ్లముందు మెదిలింది. ఆ వెంటనే రామనాథం మాస్టారూ గుర్తుకువచ్చారు. అప్రయత్నంగానే తన కండ్లు తడి అయ్యాయి. తల వెనక్కి వాల్చి, ఒక్కసారి గతంలోకి తొంగి చూశాడు శివశంకర్‌.


- Advertisement -

“శివుడూ! ఒరే.. శివుడూ!”
లీలగా తల్లి పిలుపు వినిపించడంతో కండ్లు తెరిచాడు శివుడు. గుడిసె కన్నాలలోంచి ఉదయపు ఎండ నేరుగా కండ్లలోపడి చురుక్కుమంటోంది. పక్కకు ఒత్తిగిలడానికి కొంచెం కదిలాడు. ఒంట్లో ఏమాత్రం సత్తువలేక కదలలేక పోయాడు. కడుపులో పేగుల్ని మెలిపెడుతున్న ఆకలి.
‘వాడు ఎప్పుడు లేస్తాడా? ఎప్పుడు మీద పడదామా’ అని ఎదురు చూస్తున్న పులిలాంటి ఆకలి.
“ఇంకా లేవవేమిరా! బడికి టైమైతుల్లా”.. మళ్లీ తల్లి కేక.
ఆ కేకకు గుడిసె ముందు చెట్టుకు కట్టిన ఉయ్యాలలో పసిపిల్ల ఉలిక్కిపడి లేచి ఏడుపు అందుకుంది. కాసేపటికి చెల్లెల్ని ఎత్తుకొని తల్లి లోపలికి వచ్చింది. మంచం మీద కూర్చొని, గెడ్డం పట్టుకొని బతిమిలాడుతూ అడిగింది..
“మా నాయన కదూ! మూడు రోజులాయె బడికి పోక.. ఇట్టాగైతే ఎట్టా జెప్పు? నువ్వు బాగా సదూకోవాల. పెద్ద ఆఫీసర్‌ కావాల. మన బతుకు మారిపోవాల”..
తల్లి మాటలు వింటుంటే శివుడికి భవిష్యత్తు అందమైన కలలా కండ్లముందు కదలాడింది.
కష్టం మీద లేచి కూర్చున్నాడు.
పొట్ట చేత్తో పట్టుకొని..
“బాగా ఆకలిగా ఉందే! శాతనైతలేదు” అంటూ మళ్లీ తల్లి ఒడిలో తల దూర్చాడు.
ప్రేమగా కొడుకు తల నిమిరింది లలిత.
“సూడూ బుద్ధిగా బడికిపోతే మద్దేనం అన్నం పెడతారుకందా! నేను పన్జేసే యజమానురాల్ని అడిగినా! మాపట్కి పైసలు ఇస్తానన్నది. నువ్వొచ్చే పాలికి ఇన్ని నూకలు కొనుక్కొచ్చి అన్నం ఒండుతాలే! ఇయ్యాల్టికి గుళ్లో ప్రసాదం తిని బడికి పో! మా బాబు కదూ!”.
“నువ్వు పైసలు తెస్తే అయ్య మల్లావచ్చి గుంజుకపోతాడుగా!”.
“సచ్చినోడు రేతిరే వచ్చిపోనాడుగా.. అప్పుడే రాడులే!” రాత్రి మొగుడు తాగొచ్చి, పైసల కోసం చితకబాదిన సంగతి యాదికొచ్చి, వొళ్లు నొప్పులు తెలిసి లలిత కండ్లలో నీళ్లు సుడులు తిరిగాయి.
“ఏ దిక్కూ లేనోళ్లకు దేవుడే దిక్కంటారు. మనల్ని ఆ దేవుడు సల్లగా సూసే రోజులొస్తాయి. మన పని.. ఎదురు సూడ్డమే!” అంటూ కొడుకును బుజ్జగిస్తూ, బుజ్జగిస్తూ లేపి బడికి తయారుచేసింది.
“అమ్మా! మనుసులందరికీ ఆకలి ఉంటదా?”.
“ఎందుకుండదూ? అందరికీ ఉంటది!”.
“సమానంగా ఉంటదా?”.
“ఆ! సమానంగానే ఉంటది!”.
“ఆకలి సమానంగా ఉన్నప్పుడు మరి అన్నం కూడా సమానంగా ఇయ్యాలిగా ఆ దేవుడు..” ఆ ప్రశ్నకు లలిత ఉలిక్కి పడింది.
గెడ్డం పట్టుకొని తల దువ్వుతున్నదల్లా చప్పున ఆపేసి, కొడుకు మొహంలోకి చూసింది.
“చెప్పమ్మా! మనకు అన్నం ఎందుకు లేదు? ఆ కిష్టిగాడికి ఎక్కిసం వచ్చేటట్టు ఎందుకుంది? దేవుడు మంచివాడు.. అందర్నీ సమానంగా చూస్తాడంటవు కదా!”.
“నాయనా! ఈ పెశ్న దేవున్ని అడుగుదామంటే ఆయన కనబడడు. ఎవుల్నడగాలో నాకూ తెల్దు! నువ్వు బాగా సదూకొని పెద్దోడివైనాంక.. ఆ పెశ్న ఎవల్నడగాలో కనుక్కో”.


లలితకు మొగుడున్నది పేరుకే. ఉన్నా లేనట్టే. గంజులో హమాలీ పనిచేస్తాడు. అక్కడే పనిజేసి, ఒళ్లు నొప్పులు పోవడానికి అక్కడే తాగుతాడు. తెలివుంటే ఎదో ఒకటి తింటాడు. లేదంటే అక్కడే ఎక్కడో మూలకు పడిపోతాడు. లలిత బతుకుతున్నదే పిల్లలకోసం. తన ఆశలన్నీ పిల్లలే. వాళ్లకు ఏ లోటూ లేకుండా చూడాలని, వాళ్లను బాగా చదివించాలని నాలుగిండ్లలో పాచి పనిజేసి ఇల్లు గడుపుకొస్తున్నది. మొగుడి సంపాదన ఎన్నడూ అడగలేదు. తనను, తన పిల్లలను తమ మానాన తమను వదిలేస్తే అదే పదివేలు అనుకుంటుంది. అయినా పని దొరకని రోజు మొగుడు ఇంటికి వచ్చి డబ్బులకోసం చచ్చేట్టు కొట్టి పోవడం మామూలే. అన్నీ పిల్లల కోసమే భరిస్తున్నది. నెలరోజుల క్రితం మొగుడు కొట్టిన దెబ్బలకు మంచానపడి మొన్ననే కోలుకుంది. అందుకే పిల్లలకింత అన్నం పెట్టలేకపోతున్నది.
శివుడు గుళ్లో పెట్టిన ప్రసాదం తిని సర్కారు బడికి వచ్చేసరికి గంట కొట్టేసినారు. రామనాథం మాస్టారు తెలుగు పాఠం మొదలెట్టేసినారు. శివుడు తలుపు దగ్గర నిలబడి, అడగడానికి కూడా శక్తిలేక.. ఉన్నా అడగడానికి భయమేసి, బిక్కమొగంతో మాస్టారు వంక చూస్తున్నాడు. ఆయన చూశాక దగ్గరికి రమ్మన్నట్టు తలూపాడు. శివుడు భయపడుతూ దగ్గరికి వెళ్లి, ఆయన చేతికి అందనంత దూరంలో నిలబడ్డాడు. మాస్టారు చేయి చాచి జుట్టు అందుకోబోయాడు. శివుడు అప్రయత్నంగా దూరం జరిగాడు. మాస్టారు గుడ్లురిమి..
“దగ్గరికి రా!” అని గర్జించాడు.
శివుడు గజగజ వణుకుతూ దగ్గరికి వెళ్లాడు. రామనాథం మాస్టారు జుట్టు పట్టుకొని లాగి, చెంపమీద ఒక్కటి కొట్టాడు. ఆ దెబ్బకు గది మారుమోగింది. శివుడికి ప్రాణం పోయినంత పనయింది. విసురుగా పోయి మూలకు పడ్డాడు. పడ్డవాడు పడ్డట్టు.. అలాగే ఉండిపోయాడు.
“లేచి గోడకుర్చీ వెయ్యి”.. అని ఆజ్ఞాపించాడు మాస్టారు.
శివుడు కదలలేదు.
“డ్రామాలు చాలు.. మర్యాదగా లేచి గోడకుర్చీ వెయ్యి”.. రామనాథం మళ్లీ గర్జించాడు.
శివుడు ఉలిక్కిపడి మెల్లగా లేచి గోడకుర్చీ వేశాడు. కడుపులో ఆరని ఆకలి మంటను పంటి బిగువున ఓర్చుకుంటూ గోడకుర్చీ వేశాడు.
మాస్టారు పాఠం ముగించి బయటికి వెళ్లిపోయాడు. ఆయన బయట కాలుపెట్టిన మరుక్షణం.. శివుడు తన ప్రమేయం లేకుండానే దబ్బున కింద పడిపోయాడు. అట్లాగే గోడకు పడుకున్నాడు. బయటికి వెళ్లిన రామనాథానికి శివుడి విషయం గుర్తుకు వచ్చి చప్పున లోపలి వచ్చాడు. క్షణంలో రణగొణ ధ్వనిగా మారిన తరగతి గది మరుక్షణంలో సద్దు మణిగింది. శివుడు ఆ నిశ్శబ్దానికి మెల్లగా కండ్లు తెరిచాడు. ఎదురుగా రామనాథం మాస్టారు. దగ్గరికి రమ్మన్నట్టు చేయి ఊపాడు.
‘ఈ రోజు నా ప్రాణాలు పోయినట్టే!’ అనుకున్నాడు శివుడు. కష్టం మీద లేచి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చాడు. మాస్టారు చేయి తనకేసి వస్తూంటేనే ఉలిక్కిపడి దూరంగా జరిగాడు. ఈసారి మాస్టారు కొట్టలేదు. వాడి పరిస్థితి చూసి జాలి కలిగి వాడి భుజం మీద చేయి వేశాడు.
“బడికి ఎందుకు లేటుగా వచ్చావు?” అనునయంగా అడిగాడు రామనాథం మాస్టారు.
మాస్టారు అలా అడగంగానే.. శివుడికి ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చింది.
“కొట్టనులే.. ఏం జరిగిందో చెప్పు”.. మరింత అనునయంగా అడిగాడు.
శివుడు వెక్కిళ్ల మధ్యే చెప్పాడు.. “కడుపునిండా అన్నం తిని మూడు రోజులయింది సార్‌! ప్రసాదం కోసం గుళ్లోకి వెళ్తే లేటయింది”.
రామనాథం మనసు కలుక్కుమంది. మొదటిసారి తనమీద తనకు అసహ్యం వేసింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.
‘కూర్చో’ అన్నట్టు సైగ చేస్తూ.. మౌనంగా బయటికి నడిచాడు.
కాసేపటికి.. “సార్‌” అని వినపడితే వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా శివుడు వస్తున్నాడు.
“సార్‌.. నాకొక డౌట్‌.. అడగమంటారా?”.
అడగమన్నట్టు చూశాడు రామనాథం.
“దేవుడి దృష్టిలో మనుషులంతా ఒకటే అంటారు కదా! ఆకలి అందరికీ సమానం అయినపుడు అన్నం అందరికీ ఎందుకు సమానంగా లేదు సార్‌?” అడిగాడు శివుడు.
ఆరో తరగతి చదివే ఒక కుర్రవాడి నుండి అలాంటి ప్రశ్నను రామనాథం ఊహించలేదు. అది మామూలు ప్రశ్న కాదు. ఆ ప్రశ్న ఆయనలో రేపిన ప్రకంపన అంతా ఇంతా కాదు. ఆయన వాడి మొహంలోకి చూశాడు.
‘నా ప్రశ్నకు సమాధానం చెప్పి ఇక్కణ్నుండి కదలండి’ అని అంటున్నట్టుగా అనిపించింది. గిరుక్కున మొహం తిప్పుకున్నాడు. తిరిగి వాడి కండ్లలోకి చూడటానికి ఆయనకు ధైర్యం సరిపోలేదు. యాంత్రికంగా అక్కడనుంచి వెళ్లిపోయాడు.
శివుడు తరగతిలోకి వచ్చాడు. వచ్చి కూర్చున్నా డే కానీ, వాడి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.


తరవాతి పీరియడ్‌ లెక్కలు. రుక్మాంగదరావు సారుది. పిల్లలంతా హోంవర్క్‌ పుస్తకాలు టేబుల్‌ మీద పెడుతున్నారు. శివుడికి ముచ్చెమటలు పోశా యి. రుక్మాంగదరావు చండశాసనుడు. ఒక్కసారి లేచి ఉరికి ఇంటికి పోదామా అనిపించింది. జరుగబోయే దృశ్యం కండ్లముందు మెదులుతున్నది.
“హోంవర్క్‌ ఎవరెవరు చేయలేదో లేచి నిలబడండి”.. రుక్మాంగదరావు కంచు కంఠంతో శివుడు ఈ లోకంలోకి వచ్చాడు.
ఒకరిద్దరు లేచి నిలబడ్డారు.
అంతలో ఆయమ్మ వచ్చి.. “సార్‌! శివున్ని రామనాథం సార్‌ పిలుస్తున్నాడు” అన్నది.
సార్‌ శివుడి వంక చూసి..
‘పో’ అన్నట్టు సైగ చేశాడు.
బతుకు జీవుడా అనుకుంటూ వెళ్తున్న శివుడికి వెనకనుండి.. “హోంవర్క్‌ చేసుకొచ్చావా?” అని వినిపించే సరికి మళ్లీ గుండెల్లో రాయి పడ్డది.
ఆగి.. తిరిగి ‘అవును, కాదు’ అనేలోగా..
“సరే! ముందు పోయిరా!” అన్నాడు సారు.
“సారు స్టాఫ్‌ రూంలో ఉన్నాడు. వెళ్లు” అంటూ ఆయమ్మ వెళ్లిపోయింది.
శివుడు స్టాఫ్‌రూమ్‌ తలుపు దగ్గరికి వెళ్లేసరికి రామనాథం మాస్టారు లేచొచ్చి శివుణ్ని లోపలికి తీసుకెళ్లాడు. తాను ఇంటినుండి తెచ్చుకున్న క్యారియర్‌ తెరిచి ప్లేట్లో వడ్డించి, తినమన్నాడు. శివుడికి నమ్మబుద్ధి కాలేదు. కలో నిజమో అర్థం కాలేదు. ఇంకా సంశయిస్తూ నిల్చున్న వాడిని భుజంపట్టి.. “ఫర్వాలేదు.. తిను” అంటూ కూర్చోబెట్టాడు.
శివుడు చుట్టూ చూశాడు. ఆ గదిలో ఎవరూ లేరు. చటుక్కున కూర్చొని అన్నం కలుపుకుని ఆబగా తినసాగాడు. బక్క పలచగా, కాస్త సామనలుపుగా, పొడుగ్గా రివటలాగా ఉన్న శివుడికి పదకొండు, పన్నెండేండ్లు ఉండవచ్చేమో. వేసుకున్న అంగీ, నిక్కరుకు అక్కడక్కడా చిరుగులున్నా.. శుభ్రంగా ఉతికి ఉన్నాయి. రామనాథానికి వాడి కండ్లలో ఏదో మెరుపు కనిపించింది.
అన్నం తిన్నాక వాడిని తీసుకొని బడి ఆవరణలో ఉన్న చింతచెట్టు కిందికి తీసుకు వెళ్లాడు.
వెళ్తూ వెళ్తూండగానే ఆయమ్మను పిలిచి, మెల్లగా ఏదో చెప్పాడు. కాసేపటికి ఆయమ్మ విస్తరినిండా కలిపిన అన్నం తీసుకువచ్చి వీధిలో పెట్టింది.
అది చూసి దూరంగా ఉన్న రెండు చిన్న చిన్న కుక్కపిల్లలు, ఒక ముసలి కుక్క, ఒక బక్క చిక్కిన కుక్క పరుగెత్తుకొని వచ్చి ఆబగా అన్నం తినసాగాయి. అది చూసి చాలా దూరంనుండి ఒక కుంటి కుక్క కుంటుతూ వస్తున్నది. రెండే రెండు క్షణాలు.. అంతలో ఎక్కణ్నుంచి వచ్చిందో ఒక గజ్జి కుక్క విసురుగా వచ్చి మిగతా కుక్కల మీద పడి కరిచింది. చిన్న కుక్కపిల్లలు కుయ్యో మొర్రో అంటూ ఎగిరి దూరంగా పడ్డాయి. అందులో ఒకదాని కాలును గజ్జికుక్క కొరికినట్టుంది. అది మొత్తుకుంటూ మూలుగుతున్నది. గజ్జికుక్కను చూడగానే దూరంగా వెళ్లి నిలబడింది ముసలికుక్క. బక్కచిక్కిన మరో కుక్క కాసేపు గజ్జికుక్కతో పెనుగులాడి గెలవలేక దూరం జరిగింది.
గజ్జికుక్క గబగబా అన్నం తినేస్తూ, మధ్య మధ్య లో మిగతా కుక్కల వంక మిర్రి మిర్రి చూస్తూ.. అరుస్తూ గుర్రుమంటూ ఉంది. అవి దానివంక చూస్తూ ఏం చేయలేక నిల్చున్నాయి. దెబ్బ తగిలిన చిన్న కుక్క ‘కుయ్యో కుయ్యో’ అంటూనే ఉంది. కుంటి కుక్క దూరం నుండి ఇంకా వస్తూనే ఉంది.
అంతలో ఓ నాలుగు కుక్కలు పిడుగుల్లాగా వచ్చి గజ్జికుక్క మీద పడ్డాయి. కొంతసేపు అక్కడ చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఆ కుక్కల ధాటికి ఆగలేక గజ్జికుక్క ‘గుర్‌ గుర్‌’ మని గొణుక్కుంటూ వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్లిపోయింది.
ఆ నాలుగు కుక్కల్లో ఒక కుక్క గబగబా రెండు ముద్దలు మింగి, నాలుకతో మూతి తుడుచుకుం టూ దూరంగా నిలబడ్డ కుక్కల వంక చూడసాగిం ది. మూడు కుక్కలు మూడు నిమిషాల్లో విస్తరి ఖాళీ చేశాయి. వెంటనే అక్కణ్నుంచి వెళ్లిపోయాయి.
అంతసేపూ దూరంగా ఉన్న ముసలి కుక్క దగ్గరికి వచ్చి విస్తరి వాసన చూసి వెళ్లిపోయింది. రెండు చిన్న కుక్క పిల్లలకు అక్కడికి రావడానికి ధైర్యం సరిపోక దూరం నుంచే చూస్తూ నిలబడ్డాయి. దెబ్బ తగిలిన కుక్క ఇంకా చిన్నగా మొత్తుకుంటూనే ఉంది. బక్క చిక్కిన కుక్క విస్తరిలో మిగిలిన అన్నం మెతుకులను ఒక్కొక్కటి ఏరుకొని, విస్తరి మొత్తం నాకేసి వెళ్లిపోయింది. అప్పుడు చేరుకుంది కుంటికుక్క అక్కడికి.. అప్పటికి అక్కడ ఏమీ మిగల్లేదు.


రామనాథం మాస్టారు శివుడి భుజం మీద చెయ్యేసి నడిపిస్తూ.. “జరిగింది చూశావుగా! ‘దాని అర్థం ఏమిటి?’ అని నన్ను అడక్కు. అలాగే ‘నీకు ఏం అర్థమైంది?’ అని నేనూ అడగను. నీకు అర్థమయితే సంతోషం. లేదంటే అర్థం అయ్యేదాక ఈ దృశ్యాన్ని మనసులోనే నెమరు వేసుకుంటూ ఉండు” అని చెప్పాడు.
“నాకు అర్థమైంది మాస్టారు. నేను బాగా చదువుకుంటాను. చాలా చాలా పెద్ద చదువు చదువుతాను” అని సమాధానమిచ్చాడు శివుడు.
“ఏం చదువు చదువుతావు?”.
“ఈ ప్రపంచాన్ని మార్చేంతగా చదువుతాను”.
“అంత వద్దు. గతంలో నీలాగే చాలామంది ఆవేశంతో ప్రతిజ్ఞలు చేశారు. తీరా చదువు అయిపోయాక, ఎందుకు చదువుకున్నారో మరిచిపోయా రు. కొంతమంది గుర్తున్నవాళ్లు ఏమైనా చేద్దామనుకున్నా.. వాళ్లను కూడా ఏమీ చేయకుండా అడ్డుకున్నారు. కానీ, ఒక్క పని చేస్తానని నాకు మాటివ్వు”.
శివుడు ఆయన వంక ఆశ్చర్యంగా చూశాడు.
“నీ చదువు బాధ్యత నాది. దానికి ప్రతి గా నీ కంఠంలో ఊపిరి ఉన్నంతవరకూ ప్రశ్నించడం మానకూడదు. ఈ రోజు నన్ను ప్రశ్నించినట్టే ప్రశ్నిస్తూనే ఉండాలి. ఆ ప్రశ్న కోట్లాది ప్రజల గుండెల్లో మారుమోగేలా నిరంతరం ప్రశ్నిస్తూనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నించడం ఆపకు. నీ ప్రశ్న.. ఆకలినీ, పేదరికాన్నీ, అస్తవ్యస్త వ్యవస్థలోని అసమానతలనూ వరుసగా ఛేదించే త్రిశూలం కావాలి!”.
అప్పుడే.. గణగణమని గంట మోగింది. పిల్లలందరూ బిలబిలమంటూ మధ్యాహ్నం అన్నం పెట్టే చెట్టు కింద లైన్లో నిలబడ్డారు.
రామనాథం మాస్టారు స్టాఫ్‌ రూమ్‌కు వెళ్లాడు. శివుడు లైబ్రరీ వైపు నడిచాడు.


కారు హారన్‌ కొడుతూ, హాస్టల్‌ ఆవరణలోకి ప్రవేశించింది. శివుడు అలియాస్‌ కలెక్టర్‌ శివశంకర్‌ ఈ లోకంలోకి వచ్చాడు. గతం తాలూకు ఆలోచనలతో అతని గుండె బరువెక్కింది.

దాసరి వెంకటరమణ
దాసరి వెంకటరమణ స్వస్థలం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని ఉయ్యాలవాడ. హైదరాబాద్‌లో విద్యాభ్యాసం సాగింది. ప్రస్తుతం తెలంగాణలో సబ్‌ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 1982 నుంచీ కథలు రాస్తున్నారు. ఇప్పటివరకూ దాదాపు 500 రచనలు వివిధ వార, మాస పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ‘ఆనందం’ పుస్తకానికి 2014లో ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు’ అందుకొన్నారు. మరో పుస్తకం ‘అమ్మ మనసు’ 2006లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ‘ఉత్తమ బాలసాహిత్య పురస్కారం’ దక్కించుకొన్నది. ‘మా పిల్లికి లెక్కలొచ్చు’ కథ తానా బహుమతి పొందింది. నన్నపనేని మంగాదేవి అవార్డు, చక్రపాణి – కొలసాని అవార్డు, సత్యవతి స్మారక జాతీయ పురస్కారం, కస్తూరి నరసింహ మూర్తి స్మారక పురస్కారం మొదలైన అవార్డులు వరించాయి. ఈయన రచనలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో చోటు సంపాదించుకొన్నాయి. కథ, మాటలు, పాటలు సమకూర్చిన
‘మహాకవి భారవి’ టీవీసీరియల్‌ నాలుగు నంది బహుమతులను గెలుచుకొన్నది. ‘అద్దంలో చందమామ’ లఘుచిత్రం తెలుగు విశ్వవిద్యాలయ పోటీలో రెండో ఉత్తమ చిత్రంగా నిలిచింది.

“ఆకలి సమానంగా ఉన్నప్పుడు మరి అన్నం కూడా సమానంగా ఇయ్యాలిగా ఆ దేవుడు..”
ఆ ప్రశ్నకు లలిత ఉలిక్కి పడింది. గెడ్డం పట్టుకొని తల దువ్వుతున్నదల్లా చప్పున ఆపేసి, కొడుకు మొహంలోకి చూసింది. “చెప్పమ్మా! మనకు అన్నం ఎందుకు లేదు?
ఆ కిష్టిగాడికి ఎక్కిసం వచ్చేటట్టు ఎందుకుంది?”


ఈ రోజు నన్ను ప్రశ్నించినట్టే
ప్రశ్నిస్తూనే ఉండాలి.
ఆ ప్రశ్న కోట్లాది ప్రజల గుండెల్లో మారుమోగేలా నిరంతరం
ప్రశ్నిస్తూనే ఉండాలి.
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నించడం ఆపకు. నీ ప్రశ్న.. ఆకలినీ,
పేదరికాన్నీ, అస్తవ్యస్త వ్యవస్థలోని అసమానతలనూ వరుసగా
ఛేదించే త్రిశూలం కావాలి!

దాసరి వెంకటరమణ
90005 72573

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement