నవంబర్ నెలలో ‘SSMB 29’ అప్డేట్ ఉంటుందని తెలిసిన నాటి నుంచి ఈ నెల కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు నవంబర్ వచ్చేసింది. విఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తన సినిమా అప్డేట్ ఎప్పుడిస్తారు? ఎలా ఇస్తారు? ఏం ప్రకటిస్తారు? మహేశ్‌బాబు ఫస్ట్‌లుక్ ఉంటుందా? టైటిల్ ఎనౌన్స్మెంట్ ఉంటుందా? ఇలా ఆడియన్స్‌లో వేయి ప్రశ్నలు. ఈ నేపథ్యంలోనే మహేశ్‌బాబు సైతం తన ఎక్స్ వేదికగా అప్డేట్ ఎప్పుడొస్తుందంటూ రాజమౌళిని నిలదీశారు. దీనికి జక్కన తనదైన శైలిలో స్పందించారు.
ఈ మీట్లో కథానాయిక ప్రియాంక చోప్రా, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా జాయినవ్వడంతో సంభాషణ సరదాగా సాగింది. ‘నవంబర్ వచ్చేసింది.. అప్డేట్ ఎప్పుడు?’ అని మహేశ్ అడిగితే.. ‘అవునూ.. ఈ నెలలో ఏ సినిమాకు రివ్యూ ఇద్దామనుకుంటున్నావ్?’ అంటూ మాట దాట వేశారు రాజమౌళి. ‘మీ డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతానికి రివ్యూ ఇవ్వాలనుకుంటున్నా..’ అంటూ వెటకారంగా సమాధానమిచ్చిన మహేశ్.. ‘నవంబర్‌లో అప్డేట్ అన్నారు. మాట నిలబెట్టుకోండి..’ అంటూ రెట్టించారు.
‘ఇప్పుడేకదా నవంబర్ మొదలైంది.. నెమ్మదిగా ఇద్దాం..’ అన్నారు రాజమౌళి తాపీగా. దాంతో షాకైన మహేశ్.. ‘నెమ్మదిగానా?.. ఎంత నెమ్మదిగా? 2030లోనా?’ అన్నారు.. ఇలా వీరి సంభాషణ సాగింది. మధ్యలో ప్రియాంక, పృథ్వీరాజ్ కూడా జాయిన్ అవ్వడంతో మరింత సరదాగా ఈ సంభాషణ ముగిసింది. ఇదిలావుంటే.. ఈ నెల రెండోవారం హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో ‘SSMB 29’కి సంబంధించి, ఓ భారీ ఈవెంట్‌ను మేకర్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఆ వేడుకలోనే ఆప్డేట్ని కూడా విడుదల చేస్తారని తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నదని వినికిడి.