జయశంకర్ భూపాలపల్లి(చిట్యాల) : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి ఎస్సారెస్పీ కెనాల్లో బోల్తా పడటంతో డ్రైవర్ మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని చిట్యాల మండలం జూకల్ – తిరుమలాపూర్ గ్రామాల మధ్య జరిగింది.
స్థానికులు, మృతుడి మిత్రులు తెలిపిన వివరాల ప్రకారం..మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాకు చెందిన మారడి మహేష్(27) బతుకు తెరువు కోసం వలస వచ్చి కర్ర సప్లై లో లేబర్‌గా పని చేస్తున్నాడు. కాగా, కర్రను లోడ్ చేసుకునేందుకు సోమవారం ఉదయం వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపుతప్పి కెనాల్లో పడిపోయింది.
ట్రాక్టర్‌పై బావ, బావమరుదులు ఇద్దరు వెళ్తుండగా పక్కనే కూర్చొని ఉన్న వ్యక్తి బావమరిది దూకడంతో ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్నాడు. డ్రైవర్ మహేష్ అక్కడికక్కడే మృతిచెందాడు.
ఎస్ఐ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీసి చిట్యాల సివిల్ దవాఖానలోని మార్చురీకి పంపించారు.