సర్వత్రాహ మకర్తేతి దృఢభావనయానయా
పరమామృతనామ్నీ సా సమతై వావశిష్యతే॥
(మహోపనిషత్తు 6-2)
‘నేను సర్వత్ర అకర్తనై ఉన్నాను’ అనే ఈ దృఢ నిశ్చయంతో సర్వోత్కృష్టమైన మోక్షాన్ని సమావస్థయే శేషించును… అని పై శ్లోకానికి భావం. యథార్థానికి మానవుడు ఏ పనీ చేయడం లేదు. పరమాత్ముడే చేస్తున్నాడు. మానవుడు నిమిత్తమాత్రుడే! అని తెలిసిపోయిన మనిషి ప్రశాంతంగా ఉంటాడు. కానీ, ఆ మహోన్నత స్థాయి అంత తొందరగా రాదు. రావాలంటే పైన ఉపనిషత్ మంత్రాన్ని మననం చేయాలి. అర్జునుడు ఆ స్థాయిని అందుకున్న సంఘటన ఒకటి చెప్పుకోవడం సమంజసం. మహాభారత యుద్ధంలో తొమ్మిదో రోజు ముగిసినాక విజయోత్సాహంతో తిరిగి వస్తున్న అర్జునుడిలో ఒకింత అహం తొంగి చూసింది.
కృష్ణుడు కేవలం సారథే! విజయం తన పరాక్రమంతోనే అనుకున్నాడు. కృష్ణుడు రథాన్ని శిబిరం దగ్గర ఆపి ‘బావా! దిగు’ అన్నాడు. అయితే చోదకుడు ముందు దిగి యజమాని దిగటానికి వాహనం తలుపు తెరవడం పరిపాటి కదా! ఆ ఆచారాన్ని ఆరోజైనా పాటింపజేయాలని అర్జునుడు పట్టుదలతో ‘బావా! మీరే ముందు దిగండి’ అన్నాడు. కానీ కృష్ణుడు ‘బావా! నీవు ముందు దిగి లోపలికి వెళ్లు’ అన్నాడు. కానీ, అర్జునుడు మాటవినలేదు. చివరికి ‘నీవే ముందు దిగాలి’ అని కృష్ణుడు గద్దించేసరికి చేసేదిలేక అర్జునుడు రథం దిగి లోనికి వెళ్లాడు. తర్వాత కృష్ణుడు రథం నుంచి దుమికాడు.
తక్షణమే రథం భగ భగ మండి భీషణమైన అగ్ని జ్వాలలకు ఆహుతి అయిపోయింది. బయటికి వచ్చి ఈ దృశ్యం చూసిన అర్జునుడు ‘ఇదేమిటి బావా!’ అన్నాడు. కృష్ణుడు నవ్వుతూ ‘అందుకే నిన్ను ముందు రథం దిగమన్నది. ఇవాళ నీపై భీష్ముడు ప్రయోగించిన అస్ర్తాలు విషమయాలు, అగ్నిమయాలు. వాటన్నిటినీ నా కాళ్ల కింద తొక్కిపట్టాను. నేనే ముందు రథం దిగితే రథంతో పాటు నీవూ భస్మీపటలమై పోయేవాడివి’ అన్నాడు. అర్జునుడి అహం నశించింది. ఒళ్లు గగుర్పొడిచింది. పశ్చాత్తాపంతో ప్రాణదాత అయిన కృష్ణుడి పాదాలను కన్నీళ్లతో తడిపాడు. తాను కర్తను కానని తెలుసుకొన్నాడు.
– డా॥ వెలుదండ సత్యనారాయణ