న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ప్రముఖ దేశీయ ఔషధ రంగ సంస్థల రెవిన్యూ ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) 8 నుంచి 10 శాతం పెరిగే వీలుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా శుక్రవారం అంచనా వేసింది. భారతీయ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో 60 శాతం వాటాను కలిగి ఉన్న 25 కంపెనీల తీరుతెన్నులను ఇక్రా గమనించింది. ఈ క్రమంలోనే ఫార్మా ఇండస్ట్రీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8-10 శాతం వృద్ధిని అందుకోవచ్చని పేర్కొన్నది. పెరిగిన ఆయా ఔషధాల ధరలు, మార్కెట్లోకి కొత్త ఉత్పత్తుల విడుదల, పట్టణ-గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ సేవలకు పెరుగుతున్న ప్రాధాన్యం వంటివి ఫార్మా ఇండస్ట్రీకి కలిసొచ్చే అంశాలుగా ఓ ప్రకటనలో ఇక్రా పేర్కొన్నది.
గడిచిన కొన్నేండ్లు మినహా 2013-14 నుంచి భారతీయ ఔషధ రంగ మార్కెట్ వృద్ధిపథంలోనే నడుస్తున్నట్టు ఇక్రా ఈ సందర్భంగా పేర్కొన్నది. 2013-14 నుంచి 2022-23 వరకు దేశీయ మార్కెట్ వార్షిక చక్ర వృద్ధిరేటు (సీఏజీఆర్) ఆకర్షణీయంగా 9.7 శాతంగా ఉన్నట్టు తెలిపింది. కరోనా నేపథ్యంలో ఇండస్ట్రీకి కొంత వింత పరిస్థితులే ఎదురయ్యాయని చెప్పాలి. కొన్ని కంపెనీలు (కరోనా చికిత్సలో వినియోగించే ఔషధాల ఉత్పత్తి సంస్థలు) పెద్ద ఎత్తున ఆదాయాన్ని అందుకోగా.. మరికొన్ని సంస్థలు వెనుకబడ్డాయి. ముఖ్యంగా వ్యాక్సిన్ తయారీ సంస్థలకు కలిసొచ్చింది. అయితే మార్కెట్లో ఇప్పుడు పరిస్థితులు మెరుగయ్యాయి. దీంతో అన్ని ఫార్మా కంపెనీలకు ఆశాజనకంగానే ఉన్నది.