హైదరాబాద్, జూన్ 23(నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ కార్మికులను మభ్యపెట్టేందుకు ప్రభుత్వం పన్నిన ఎన్నికల ఎత్తుగడ వ్యూహం బెడిసికొట్టింది. సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించి చిచ్చుపెడుదామనుకుంటే.. ఆర్టీసీ కార్మికులు సహా అన్ని యూనియన్ల నేతలంతా ‘ఎన్నికలొద్దు.. విలీనమే ముద్దు’ అంటూ నినదిస్తుండటం ప్రభుత్వ పెద్దలను కలవరానికి గురిచేసింది. అంతేగాక కార్మికుల అభీష్టం మేరకు తక్షణం ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియను మొదలుపెట్టాలని కార్మిక సంఘాలు ప్రభుత్వానికి మూకుమ్మడిగా లేఖలు రాస్తుండటంతో ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడింది. విలీనం చేయకుండా ఎన్నికలు నిర్వహిస్తే.. బహిష్కరిస్తామని కార్మికులంతా ముక్తకంఠంతో నినదిస్తుండటంతో ప్రభుత్వం అంతర్మథనంలో పడింది.
ప్రభుత్వం ఎన్నికల పేరిట తాత్సారాన్ని ఆపి తక్షణమే విలీన ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ బుధవారం బస్‌భవన్ ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఉదయం 11గంటల నుంచి దీక్ష చేస్తామని ప్రకటించినట్టుగానే తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాన్ని తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మేడే రోజున కూడా యూనియన్ల నాయకులతో జరిపిన చర్చల్లో అంతా విలీనమే మొదట చేయాలని కోరామని, మళ్లీ ప్రభుత్వం మాట తప్పి.. ఎన్నికలకు వెళ్లడం ద్వంద్వనీతిని ప్రదర్శిస్తున్నట్టు ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే విలీనం చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రివర్గ ఉప సంఘం మంత్రులకు విజ్ఞప్తి చేశారు. దీక్షకు రాష్ట్రంలోని అన్ని డిపోల్లోని కార్మికులు, ఉద్యోగులు రావాలని పిలుపునిచ్చారు.
హనుమంతు దీక్షకు తెలంగాణ ఆర్టీసీ కార్మిక జేఏసీ సంఘీభావం, సంపూర్ణ మద్దతు తెలిపింది. ప్రభుత్వం సమ్మె విరమణ సందర్భంగా అధికారికంగా ప్రకటించిన విలీన ప్రక్రియ కాలయాపన చేస్తున్నదని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న మండిపడ్డారు. నాడు కార్మిక సంఘాలకు ఇచ్చిన హామీ ప్రకారం సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టీసీ విలీన ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. టీజీఎంయూ ప్రధాన కార్యదర్శి చేపట్టిన ఆమరణ దీక్ష గురించి చర్చించిన అనంతరం జేఏసీ రాష్ట్ర కమిటీ ఆన్లైన్లో అత్యవసర సమావేశం నిర్వహించి, మద్దతు తెలియజేయాలని నిర్ణయించినట్టు వెంకన్న చెప్పారు. దీక్షకు సంఘీభావం ప్రకటిస్తున్నామని, విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నన్నామని చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, బీ యాదగిరి చెప్పారు. తమకు సంఘీభావం తెలిపిన జేఏసీకి హనుంతు ముదిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్టీసీలోని సమస్యల పరిషారానికి ప్రభుత్వం నియమించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమిటీతో జరిగిన చర్చల్లో అంగీకరించిన మేరకు కండక్టర్ ఉద్యోగ భద్రత కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని స్టాఫ్ అండ్ వరర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్ రావు ఆర్టీసీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. సమ్మె సందర్భంగా యాజమాన్య పరిధిలోని సమస్యలను కార్మిక సంఘాలతో చర్చించి పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని మంగళవారం ఒక ప్రకటనలో గుర్తుచేశారు.
ఆ మేరకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ ఏర్పాటైందని, ఆ కమిటీ మూడు దఫాలు కార్మిక సంఘాలతో నిర్వహించిన చర్చల్లో కండక్టర్ ఉద్యోగ భద్రతపై ప్రత్యేక చర్చ జరిగిందని తెలిపారు. చర్చలో కండక్ట రెగ్యులేషన్స్-1963లోని క్లాజు 28 వీఐ (ఏ)ను, మోటర్ వెహికిల్ యాక్ట్-2019లో సెక్షన్లు 124, 178కి అనుగుణంగా సవరించాలని డిమాండ్ చేశారు. తుది దశ చర్చలు కూడా ముగిశాయని, ఇంతవరకు కమిటీని ప్రకటించలేదని, అందువల్ల ఆలస్యం చేయకుండా కమిటీని వెంటనే ఏర్పాటు చేసి, సంఘాలతో సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.