కొవిడ్ పరిస్థితుల కారణంగా రెండేండ్లుగా వాలెంటైన్స్ డేను జరుపుకోలేక నిరుత్సాహానికి గురైన ప్రేమికులు ఈసారి రెట్టింపు ఉత్సాహంతో సన్నద్ధమవుతున్నారు. రెండు సంవత్సరాలుగా పార్కులు, సినిమాలు, టూరిజం ప్రాంతాలు కూడా కళతప్పాయి. అయితే ఈసారి థర్డ్‌వేవ్ కూడా ఫిబ్రవరి 14ను గతంలో మాదిరిగానే సందడి రహితంగా చేస్తుందనే భయాలు మొన్నటి వరకూ ప్రేమికుల్లో నాటుకున్నాయి. కానీ థర్డ్‌వేవ్ ముగిసిందని వైద్యాధికారులు ప్రకటించడంతో ప్రేమికుల్లో ఆనందం రెట్టింపు అయింది. ఈసారి వచ్చే వాలెంటైన్స్ డేను తమకు అత్యంత గొప్పదిగా భావిస్తున్నారు. అందుకోసం వెరైటీ గిఫ్ట్స్ కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. కొందరూ వయస్సు నంబర్, లక్కీ నంబర్లతో కేకుల తయారీ, లవ్ సింబల్స్, లవర్స్ ఫొటో, కీ చైన్స్, పర్సులు, వాచీలు తదితర వాటిని ఎక్కువగా ఆర్డర్స్ చేస్తున్నారని చెబుతున్నారు.
అందమైన బహుమతి అందించి తమ ప్రేమ మనసును వ్యక్తం చేయడానికి ప్రేమికులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని లవ్ సింబాలిక్ గుర్తులతో ఉన్న గిఫ్ట్‌లు, చాక్లెట్స్, కేకులకు డిమాండ్ పెరిగింది. దీంతో వాటిని రూపొందించే వ్యాపారులు వినూత్నంగా తీర్చిదిద్దుతూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. నగరానికి చెందిన మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్ వాలెంటైన్స్ డేను దృష్టిలో పెట్టుకుని విభిన్న రకాల యాక్ససరీస్‌ను తయారు చేస్తున్నారు. చాక్లెట్, కేకులతో కస్టమర్లకు నచ్చేలా వివిధ రకాల ఆకృతులతో మంచి లుక్ ఉండేలా రూపొందిస్తున్నారు. వీటిని ప్రేమికుల దినోత్సవం రోజున తమకు ఇష్టమైన వారికి అందించడానికి ముందుగానే ఆర్డర్ చేసుకుంటున్నారు. నగరంలో వాలెంటైన్స్ డే ఆర్డర్స్ పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
చాక్లెట్ కేకులకు భలే డిమాండ్
ఈ ఫిబ్రవరి 14ను చాలా స్పెషల్‌గా భావిస్తున్నారు. రెండేండ్లుగా వాలెంటైన్స్ డే సంబురాలు లేవు. ఈసారి థర్డ్‌వేవ్ ముగియడంతో ప్రేమికుల నుంచి ఆర్డర్స్ పెరిగాయి. ఎక్కువగా చాక్లెట్ కేకును వారి ఫొటోలతో రూపొందించే వాటికి ఆర్డర్స్ వస్తున్నాయి. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా కేకులు, గిఫ్ట్ హాంపర్లు సిద్ధం చేశాం. కస్టమర్‌కు నచ్చినట్టుగా స్టైల్, రుచి, ఇంగ్రీడియంట్స్‌తో తయారు చేయడం మా ప్రత్యేకత.
– దివ్యసాగర్, ఫౌండర్, రెనీ బేకర్స్
కస్టమర్ కోరుకున్నట్లుగా తయారీ
కస్టమర్ కోరుకున్న ప్రొడక్ట్స్ రూపొందిస్తాం. వారికి నచ్చినట్టుగా తయారు చేసి నిర్ణీత సమయానికి డెలివరీ చేస్తాం. ప్రతీ గిఫ్ట్ యూనిక్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం. టీ షర్ట్స్పై లవ్ సింబల్స్, రైటింగ్స్, ఫ్లవర్స్‌లో ఫొటోలు అమర్చడం, పర్సులపై నేమ్స్, వాచీలపై నచ్చిన స్లోగన్స్ ఇలా అనేక రకాల సర్వీస్ అందుబాటులో ఉంది. ప్రేమ వివాహాలు చేసుకున్న వారి నుంచి ఎక్కువగా తమ ప్రేమకు ప్రతి రూపాలైన పిల్లల ఫొటోలతో కేకులు తయారు చేయాలని ఆర్డర్ చేస్తున్నారు.
– స్వప్న, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్