భువనేశ్వర్, మార్చి 12: ఒడిశాలో ఓ ఎమ్మెల్యేను ప్రజలు చితకబాదారు. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. జనంపైకి కారును నడిపి 23 మందిని గాయపరచడమే ఇందుకు కారణం. ఈ ఘటన ఖుర్దా జిల్లాలోని బనాపూర్ పట్టణంలో శనివారం చోటుచేసుకున్నది. బ్లాక్ చైర్పర్సన్ ఎన్నిక నేపథ్యంలో బనాపూర్ బీడీఓ కార్యాలయం ఎదుట పెద్దయెత్తున జనం గూమిగూడారు. ఈ సమయంలో అటుగా వస్తున్న సస్పెండ్ అయిన బీజేడీ ఎమ్మెల్యే ప్రశాంత్ జగ్దేవ్ కారు వారి మీదకు దూసుకెళ్లింది. క్షతగాత్రుల్లో 15 మంది బీజేపీ కార్యకర్తలు, ఒక బీజేడీ కార్యకర్త, ఏడుగురు పోలీసులు ఉన్నారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కోపోద్రిక్తులైన ప్రజల దాడిలో ఎమ్మెల్యే జగ్దేవ్కు కూడా గాయాలయ్యాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల నేపథ్యంలో ఛిలికా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న జగ్దేవ్ను బీజేడీ గతేడాది పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.