హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : అభ్యర్థులందరికీ ఉద్యోగాలు ఇవ్వలేమని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం అభిప్రాయపడ్డారు. ఏ నోటిఫికేషన్ జారీ చేసినా దరఖాస్తు చేసుకున్న అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యపడదని చెప్పారు. సోమవారం నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడిన ఆయన పరీక్షల్లో డిస్టింక్షన్ మార్కులు తెచ్చుకోవడం సులభం కానీ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ న్యాయం చేయలేమని తెలిపారు. కేవలం 0.01 శాతం అభ్యర్థులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలమని, 99.99 శాతం వారికి ఇవ్వలేమని స్పష్టం చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి తాము నోటిఫికేషన్ జారీచేస్తే, 19 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, ఎంత మంది దరఖాస్తు చేసినా కేవలం 20 మందికే ఉద్యోగాలు ఇవ్వగలమని.. ఉద్యోగాలు దక్కని వారిలో అసంతృప్తి ఉండటం, కమిషన్‌పై దుష్ప్రచారం చేయడం సహజమని చెప్పారు.
ఆర్థికశాఖ ఇప్పటి వరకు 3,800 పోస్టుల భర్తీకే అనుమతులిచ్చిందని బుర్రా వెంకటేశం వెల్లడించారు. అయితే వీటిలో తక్కువ పోస్టులున్నవే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. కొన్ని ఒక పోస్టు ఉన్నవి కూడా ఉన్నాయని.. ఐదు కంటే తక్కువ పోస్టులున్నవి 25 ఉన్నాయని, 50కి పైగా పోస్టులున్నవి 11 శాఖలున్నాయని వివరించారు. దీంట్లో 1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఈ పోస్టుల భర్తీకి ఒక్కో జోన్‌కు ఒక్కో పరీక్ష నిర్వహించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. నియామక పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలోనే నిర్వహిస్తామని, పరీక్ష తర్వాత ఆటోమెటిక్‌గా మార్కులు తెరపై డిస్ప్లే అవుతాయని, అభ్యర్థులంతా సీబీటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం మూడు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నామని, 270కి పైగా పోస్టుల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు ఇస్తామని వెంకటేశం తెలిపారు. ఈ నెలలో ఐదారు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని, ఆ తర్వాత వరుసగా నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు. త్వరలోనే డిప్యూటీ ఈవో పోస్టుల భర్తీకి ప్రయత్నిస్తున్నామని, డిగ్రీ లెక్చరర్ల భర్తీలో ఇంటర్వ్యూలు ఉంటాయని, యూజీసీ నిబంధనల మేరకు ఇంటర్వ్యూలు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటర్వ్యూలు ప్రవేశపెట్టబోతున్నామని వివరించారు. సమావేశంలో కమిషన్ సభ్యులు ప్రొఫెసర్లు లక్ష్మీకాంత్ రాథోడ్, విశ్వజిత్ కంపాటి, చంద్రకాంత్‌రెడ్డి, డాక్టర్ అమీరుల్లాఖాన్, కార్యదర్శి ఎం హరిత పాల్గొన్నారు.
తప్పుడు ఆలోచనలు.. స్వార్థం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు అనేక అంశాలను ప్రచారం చేస్తున్నారని, ఒక స్థాయి దాటితే ఊరుకోబోమని, న్యాయమైన చర్యలు తీసుకుంటామని బుర్రా వెంకటేశం హెచ్చరించారు. తప్పుడు ప్రచారం చేసేవారు ఏ స్థాయిలో ఉన్నా వదలబోమని చెప్పారు. ‘ఇంత కాలం మేం ఓపికపట్టాం.. బుద్ధిమంతుడిగా వ్యవహరిస్తే మా చేతగానితనమనుకుంటే పొరపాటే. ఆరోపణలు చేసే వారిని కమిషన్ ఇంత కాలం ఉపేక్షించింది. ఇక నుంచి మాత్రం ఊరుకునేది లేదు.
చెయ్యని తప్పును, లేని లోపాన్ని కావాలని తప్పుగా చూపించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోము. కోడిగుడ్ల మీద ఈకలు పీకినట్టు ప్రతిదాన్నీ తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తే ఉపేక్షించేది లేదు’ అని హెచ్చరించారు. ‘కమిషన్ రాజ్యంగబద్ధమైన సంస్థ. అనేక అధికారాలుంటయ్. వాటిని వాడకపోవడంతో కమిషన్‌పై ఆరోపణలు గప్పిస్తున్నారు. మేము సైలెంట్‌గా ఉండటంతో అనేక ఆరోపణలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా సహేతుకమైన నిర్మాణాత్మక సూచనలిస్తే తీసుకుంటాం.. విమర్శలను స్వీకరిస్తాం’ అని చెప్పారు.