Govt Turn down Tax break on Tesla | గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ డిమాండ్‌ను కేంద్రం తోసిపుచ్చింది. ఇప్పటికే విడి భాగాలను తీసుకొచ్చి దేశీయంగా అసెంబ్లింగ్ చేసిన కార్లపై తక్కువ సుంకాలు ఉన్నాయని తెలిపింది. దీనిపై కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు చైర్మన్ వివేక్ జోహ్రీ క్లారిటీ ఇచ్చారు. డ్యూటీలు (సుంకాలు) తగ్గించాలా.. అనే విషయాన్ని మేం పరిశీలించాం. కానీ ప్రస్తుత పన్నుల వ్యవస్థ పరిధిలోనే దేశీయంగా పాక్షికంగా ఉత్పత్తి ప్రారంభిస్తే, కొంత మేర పెట్టుబడులు వస్తాయి అని ఓ ఇంటర్వ్యూలో జోహ్రీ వివరణ ఇచ్చారు. కనుక ఇందులో అడ్డంకులేమీ లేవు. దేశీయంగా కార్ల ఉత్పత్తిని చేపట్టాలని టెస్లా కంపెనీని ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ ప్రోత్సహిస్తున్నది. ఎలన్‌మస్క్ మాత్రం తొలుత దిగుమతి చేసుకున్న కార్ల విక్రయానికి అనుమతించాలి. వాటి కార్లపై 100 శాతం సుంకాలు తగ్గించాలని కోరుతున్నారు. 15-30 శాతం విడి భాగాలు తీసుకొచ్చి దేశీయంగా అసెంబ్లింగ్ చేయొచ్చు అని చెప్పారు.
దేశీయంగా కార్ల తయారీకి టెస్లా నో
ఇప్పట్లో ఎలన్‌మస్క్ సారధ్యంలోని టెస్లా కార్ల తయారీ సంస్థ భారత్‌లోనే ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్ధంగా లేదు. ప్రభుత్వం కోరిన తర్వాత కూడా దేశంలో ఉత్పత్తికి ముందుకు రాలేదు. వచ్చేనెల ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్లోనూ దిగుమతి చేసుకున్న విద్యుత్ వాహనాలపై ఎటువంటి పన్ను రాయితీలు ప్రకటించలేదు. కానీ టెస్లా డిమాండ్‌కు మహారాష్ట్ర మద్దతు తెలిపింది.
ఐదు రాష్ట్రాల నుంచి టెస్లాకు ఇలా ఆహ్వానాలు
భారత్ మార్కెట్లోకి తమ కార్లను తేవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ ప్రకటించిన తర్వాత ఐదు రాష్ట్రాల మంత్రులు తమ రాష్ట్రాల్లో షాప్‌లు ఏర్పాటు చేయాల్సిందిగా మస్క్‌ను ఆహ్వానించారు. పూర్తిస్థాయిలో నిర్మాణం కాకపోయినా, పాక్షికంగానైనా ఉత్పత్తి చేస్తే సుంకాలు తగ్గించవచ్చునని కేంద్రం టెస్లాకు సూచించింది.
ఇతర సంస్థల ఈవీ తయారీ ఇలా
దేశీయంగా విద్యుత్ కార్లను తయారు చేస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా, టాటామోటార్స్ పద్దతులను టెస్లా అనుసరించాల్సిందేనన్న అభిప్రాయం వినిపిస్తున్నది. ఇతర కార్ల తయారీ సంస్థలు కూడా ఇదే పద్దతి అవలంభిస్తున్నాయి. ఆ రూట్లో టెస్లా కూడా రావచ్చు తలుపులు తెరిచే ఉన్నాయి అని జోహ్రీ చెప్పారు. దేశీయంగా ఎలక్ట్రిక్ కార్లను తయారుచేస్తున్న మెర్సిడెజ్ బెంజ్ వంటి సంస్థలు టెస్లా ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి.
అవకాశాలు ఉన్నా.. ఇప్పుడు సేల్స్ తక్కువ
పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వేరియంట్ కార్లతో పోలిస్తే దేశంలో హ్యుండాయ్ మోటార్స్, సుజుకి మోటార్స్ కార్పొరేషన్ తయారు చేసే విద్యుత్ కార్ల విక్రయాలు ఒక్కశాతమే. ఈ సంస్థలు తయారు చేస్తున్న విద్యుత్ కార్లు కూడా చౌకగానే ఉన్నాయి. ఇప్పటికైతే సేల్స్ తక్కువగా ఉన్నప్పటికీ ఈవీ-మేకర్లకు భారీ అవకాశాలు ఉన్నాయి.