ఒకవైపు భుజం నొప్పి ఇబ్బందిపెడుతోంది.. మరోవైపు అలసట నరనరాన్నీ వేధిస్తోంది.. ఇంకోవైపు గుండె ఆగిపోయేంత ఒత్తిడిని పెంచుతూ పోటీ సాగుతోంది.! కానీ, ఏ క్షణంలోనూ ఆమె చూపు లక్ష్యం నుంచి పక్కకు మరలలేదు. ఒత్తిడి సుడిగుండంలోనూ గురి తప్పని అసాధారణ పోరాటస్ఫూర్తితో తెలంగాణ బిడ్డ, భారత స్టార్ షూటర్ ఇషా సింగ్ ఆసియా క్రీడల్లో సంచలనం సృష్టించింది.
ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన మను భాకర్.. వెటరన్ షూటర్ రాహీ సర్నోబత్ కనీసం ఫైనల్ కూడా చేరలేకపోయిన వేళ.. ప్రపంచ నంబర్ వన్ హోదాలో రేంజ్‌లోకి అడుగుపెట్టిన 21 ఏండ్ల ఇషా ప్రతిభకు మాత్రమే కాకుండా ఓర్పు, సహనానికి పరీక్షగా నిలిచిన మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో రజత పతకం సాధించింది.
అథ్లెటిక్స్‌లో గుల్వీర్ సింగ్, యశ్వీర్ సింగ్, శ్రీశంకర్ కూడా సిల్వర్ మెడల్స్ గెలిచినా .. సోమవారం మొత్తంగా వచ్చిన ‘అష్ట’పతకాల్లో మన ఇషా తెచ్చిన వెండే అత్యంత ప్రకాశవంతంగా మెరిసింది.
నగోయా : ఆసియా క్రీడల షూటింగ్ రేంజ్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ అద్భుతం చేసింది. సోమవారం నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో రజత పతకాన్ని ముద్దాడింది. క్వాలిఫికేషన్లో ఎనిమిదో స్థానంతో ఆఖరి షూటర్‌గా ఫైనల్‌కు అర్హత సాధించిన ఇషా ఫైనల్లో అసాధారణ సంయమనాన్ని ప్రదర్శించి పోడియంపైకి వచ్చింది. నాటకీయ పరిణామాల మధ్య అత్యంత హోరాహోరీగా సాగిన తుదిపోరులో ఇషా, చైనా షూటర్ జియారుయిక్సువాన్ జియావో ఇద్దరూ 38 హిట్స్‌తో సమంగా నిలిచి గేమ్స్ రికార్డు బ్రేక్ చేశారు. విజేతను తేల్చే షూటాఫ్‌లోనూ ఐదింటికి చెరో నాలుగు హిట్స్‌తో సమంగా నిలిచారు. చివరకు రెండో షూటాఫ్‌లో జియావో మూడు హిట్స్ సాధిస్తే.. రెండు హిట్స్ మాత్రమే కొట్టిన హైదరాబాద్ షూటర్ రెండో స్థానంతో రజతంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది.తొలుత ఎలిమినేషన్ ప్రక్రియలో ఉత్తర కొరియా షూటర్ కిమ్ హ్యోన్ సుక్తొ ఇషా 34 హిట్స్‌తో సమంగా నిలిచినా.. మూడు షూటాఫ్స్లో నెగ్గి టాప్-2లో వచ్చింది. అంతకుముందు క్వాలిఫికేషన్ స్టేజ్ ముగిసేసరికి ఇషా 580 స్కోరుతో ఎనిమిది, చివరి స్థానంతో సరిపెట్టింది. 9వ స్థానంలో నిలిచిన చైనీస్ తైపీ షూటర్‌తో సమానంగా పాయింట్లు ఉన్నప్పటికీ బుల్స్ ఐకి అత్యంత సమీపంలో కొట్టిన ఇన్నర్ 10ల (ఇషా-22, తైపీ షూటర్-20) ఆధారంగా ఎనిమిదో క్వాలిఫయర్‌గా ఫైనల్ బెర్తును దక్కించుకుంది.
భారీ అంచనాలతో బరిలోకి దిగిన డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్ క్వాలిఫికేషన్ రౌండ్లో 579 స్కోరుతో 11వ స్థానంలో నిలిచి ఫైనల్ చేరలేకపోయింది. ఆసియాడ్ మాజీ చాంపియన్, వెటరన్ షూటర్ రాహీ సర్నోబత్ 568 స్కోరుతో 30వ స్థానానికి పరిమితమైంది. పైగా, రాహీ కొట్టిన ఒక షాట్ ఫ్రేమ్‌లోకి వెళ్లినా సున్నా పాయింట్‌గా నమోదవ్వడం భారత టీమ్ విభాగం ఆశలపై నీళ్లు చల్లింది. ఈ పొరపాటు వల్ల మూడో స్థానంలో ఉన్న భారత జట్టు (1727 పాయింట్లు) ఒక్కసారిగా ఐదో స్థానానికి పడిపోయింది. ఆ షాట్‌కు పది పాయింట్లు వచ్చి ఉంటే భారత్ రజతం నెగ్గేది.
ఫైనల్ కు ముందు రాత్రి నాకు అసలు నిద్ర పట్టలేదు. ఆందోళన, ఒత్తిడి తాళలేక మా అమ్మ శ్రీలతకు ఫోన్ చేశాను. కాస్త ఓదార్పు దొరుకుతుందేమో అనుకుంటే.. అమ్మ నుంచి నాకు గట్టి తిట్లు పడ్డాయి.“ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటున్నావ్? నోరుమూసుకుని పడుకో. ఆటను ఆస్వాదించు. ఆసియాడ్‌లో ఆడే అవకాశం అందరికీ దక్కదు” అని అమ్మ చెప్పింది. నిజానికి ఆ క్షణంలో నాకు కావలసిన ప్రశాంతత అమ్మ మాటల నుంచే లభించింది. నా కెరీర్లో ఇలాంటి నాటకీయ మ్యాచ్‌ను, ఐదు షూటాఫ్స్ ను ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఫైనల్లో వరుసగా ఫైరింగ్ చేస్తూ ఉండటంతో నా చేయి బిగుసుకుపోయింది. అయితే మధ్యలో సాంకేతిక లోపాల వల్ల ఆటను15 నిమిషాలు నిలిపివేశారు. దేవుడి దయతో లభించిన ఆ విరామ సమయం నా చేతికి, అలసిపోయిన మనసును రిలాక్స్ చేసుకోవడానికి వీలైంది. గత ఆసియాడ్‌లో 18 ఏండ్ల వయసులో 4 పతకాలు సాధించినప్పటికంటే, ఈసారి నంబర్ వన్ హోదాతో రావడం వల్ల భారం పెరిగింది. నాపై తీవ్రమైన ఒత్తిడి ఉందనే విషయాన్ని నేను దాచను. కానీ ఆ ప్రతికూలతలన్నింటినీ అధిగమించి సాధించిన ఈ రజత పతకం నాకు సరికొత్త సంతృప్తిని ఇచ్చింది. దీన్ని మా అమ్మ చేతుల్లో పెడతా. ఫైనల్లో నిలదొక్కుకోవడానికి నేను ఎంతగా పోరాడాల్సి వచ్చిందో నాకు తెలుసు. అందుకే ఈ ఉత్కంఠభరిత అనుభవం, ఈ పతకం నా జీవితంలో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతాయి.
-ఇషా సింగ్
5 ఆసియాడ్‌లో ఇషాకు ఇది ఐదో పతకం. 25 మీటర్ల ఈవెంట్లో రెండోది. గత ఎడిషన్‌లో తను ఓ స్వర్ణం సహా నాలుగు మెడల్స్ గెలిచింది. 10, 25 మీటర్ల పిస్టల్ విభాగాల్లో రజతాలు సాధించిన ఆమె 25 మీటర్ల టీమ్ ఈవెంట్లో స్వర్ణం, 10 మీటర్ల టీమ్ పోటీలో మరో వెండి అందుకుంది.