హైదరాబాద్, మే 30(నమస్తే తెలంగాణ): ప్రజాపాలనలో మద్యం ఏరులై పారుతున్నది. రేవంత్‌రెడ్డి మార్క్ పాలనలో రికార్డులు బద్దలై మద్యం వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నది. పల్లె, పట్నం.. ఆడ, మగ తేడా లేకుండా తెగతాగేస్తుండగా, ముఖ్యంగా 15ఏండ్లు పైబడిన పురుషుల్లో దాదాపు సగం మంది(43.9శాతం)కి మద్యం అలవాటు ఉన్నదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ శాఖ నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-6(ఎన్ఎఫ్హెచ్ఎస్)లో తెలంగాణ రాష్ట్రంలో మద్యం వినియోగంపై షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని పెద్ద రాష్ర్టాలన్నింటి కన్నా తెలంగాణలోనే అత్యధికంగా మద్యం వినియోగిస్తున్నట్టు తేలింది. ఈ సర్వే ప్రకారం మునుపటితో పోల్చితే మద్యం సేవించడంలో పట్టణాలను పల్లెలు దాటేశాయి. ప్రతి ఇద్దరు పురుషుల్లో ఒకరు మద్యం సేవిస్తుండగా, పట్టణ మహిళల కంటే గ్రామీణ మహిళలు రెండింతలు ఎక్కువగా తీసుకుంటున్నట్టు సర్వే వెల్లడించింది.
పెద్ద రాష్ర్టాల విభాగంలో 43.9 శాతంతో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా.. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ 31.6శాతం, కర్ణాటక 15.6 శాతం, తమిళనాడు 13.7 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మద్యం నిషేధం అమలులో ఉన్న బీహార్‌లో 16.5 శాతం మంది పురుషులు ఇంకా మద్యం తాగుతున్నట్టు సర్వే తేల్చింది. చిన్న రాష్ట్రాలను కూడా కలిపితే అరుణాచల్‌ప్రదేశ్ (50.5 శాతం పురుషులు, 23.2 శాతం మహిళలు) అగ్రస్థానంలో ఉన్నది. అత్యంత తకువగా లక్షద్వీప్‌లో 0.4శాతం మంది మాత్రమే మద్యం తాగుతున్నారు.
ఈ నివేదికతో పాటు దేశంలో జీవనశైలి మారిపోతున్నదని, వ్యాధులు పెరిగిపోతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. భారతదేశంలో 30.7శాతం మహిళలు, 27.3 శాతం పురుషులు అధిక బరువు లేదా స్థూలకాయంతో బాధపడుతున్నారని, రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) వంటి వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపింది. మద్యం వినియోగంలో టాప్‌లో ఉన్న తెలంగాణలో.. ఈ జీవనశైలి మార్పులు, ప్రజారోగ్య సవాళ్లపై పాలకులు, నిపుణులు ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉన్నదని ఈ సర్వే నొకి చెప్పింది.
ముంబైకి చెందిన ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్(ఐఐపీఎస్) దేశవ్యాప్తంగా 715 జిల్లాల్లోని 6.79 లక్షల గృహాల్లో ఈ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం.. తెలంగాణలో 15 ఏండ్లు పైబడిన పురుషుల్లో 43.9శాతం, మహిళల్లో 6.8 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. ఇది జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ. జాతీయ సగటు 18.9శాతం(పురుషులు), 1.1శాతం(మహిళలు) సగటుగా తేలింది. పురుషులు పట్టణ ప్రాంతాల్లో 34శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 47.9 శాతం మంది మద్యం తాగుతున్నారు. ఇక మహిళల విషయానికి వస్తే, పట్టణాల్లో 3.2శాతం మంది తాగుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఆ సంఖ్య రెండింతలు పెరిగి 8.3 శాతానికి చేరింది. దేశవ్యాప్తంగా కూడా పట్టణాల కంటే పల్లెల్లోనే మద్యం వినియోగం ఎకువగా ఉన్నట్టు సర్వే స్పష్టంచేసింది.