హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ మహిళల సీనియర్ హ్యాండ్‌బాల్ టోర్నీలో ఆతిథ్య తెలంగాణ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన క్వార్టర్స్ పోరులో తెలంగాణ 27-22 తేడాతో రాజస్థాన్‌పై అద్భుత విజయం సాధించింది. ఆది నుంచే ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. దీంతో ప్రథమార్ధం ముగిసే సరికి తెలంగాణ 13-9తో ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలోనూ అదే జోరు కొనసాగించిన మన అమ్మాయిలు కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుని మ్యాచ్‌ను కైవసం చేసుకున్నారు. నాలుగో రోజు పోటీలను భారత ఒలింపిక్ సంఘం కోశాధికారి ఆనందీశ్వర్‌పాండే, జాతీయ హ్యాండ్‌బాల్ అసోసియేషన్(హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్రావు, సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.