హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పన్మక్త గ్రామంలో ఇటీవల జరిగిన భూవేలం ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది. ఆ గ్రామంలోని సర్వే నం.83/1లో ఐదు ఎకరాల భూమి వేలానికి సంబంధించి మే 6న జారీ చేసిన ఈ-వేలం నోటిఫికేషన్, అనంతర ప్రక్రియను మూడు వారాలపాటు నిలిపివేసింది. ఈ వేలంలో ఎకరం రూ.237 కోట్లకు దకించుకున్న గౌర వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లెటర్ ఆఫ్ అవార్డు జారీచేశారన్న వాదనను పరిగణనలోకి తీసుకొని వేలం నోటిఫికేషన్‌తోపాటు మొత్తం ప్రక్రియ అమలును నిలిపివేసింది. గౌర వెంచర్స్, రాష్ట్ర ప్రభు త్వం, టీజీఐఐసీతోపాటు ఇతరులకు నోటీసులి చ్చింది. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. మే 6న జారీచేసిన వేలం నోటిఫికేషన్‌తోపాటు, వినతిపత్రం తిరసరణ, వేలం విక్రయాన్ని సవాల్ చేస్తూ ఎస్బీఐ దాఖలు చేసిన మూడు వేర్వేరు వ్యాజ్యాలను జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ గురువారం మూడు గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో ని అత్యంత విలువైన ఐదెకరాల భూమి వేలాన్ని స వాల్ చేసిన కేసుల్లో మధ్యంతర స్టే ఉత్తర్వులు వెలువరించారు. ఎస్బీఐ నుంచి భూమిని స్వాధీనం చేసుకోకుండా, వారు చెల్లించిన సొమ్మును వాపస్ చే యకుండా వేలం నోటిఫికేషన్‌ను ఎలా జారీ చేస్తారని టీజీఐఐసీని ప్రశ్నించారు. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు.
‘ఉపాధి కల్పనలో భాగంగా పరిశ్రమలకు భూకేటాయింపులు జరుగాలి. మీరు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్కు భూమిని అప్పగిస్తున్నారా? ఐదు ఎకరాల భూమిని పొందిన కంపెనీ ఉపాధి కల్పిస్తుందా? రియల్ ఎస్టేట్ కోసమే వేలంలో భూమిని ఆ సంస్థ కొనుగోలు చేసిందా? టీజీఐఐసీ ఏర్పాటు ఉద్దేశం, లక్ష్యం ఏమిటి? ఉపాధి కల్పించే కంపెనీలను ప్రోత్సహించడంలో భాగంగా టీజీఐఐసీని ఏర్పాటుచేశారు కదా? ఉపాధి కల్పన కోసమే భూ ముల కేటాయింపు జరగాలి కదా? ఎస్బీఐ నుంచి భూమిని స్వాధీనం చేసుకున్నాకే వేలం నోటిఫికేషన్ జారీచేశారా? భూ కేటాయింపు రద్దు చేసినట్టయితే ఎస్బీఐ చెల్లించిన డబ్బును తిరిగి ఇచ్చారా? ఎస్బీఐకి సొమ్ము వాపస్ ఇవ్వకుండా ఏ ప్రాతిపదికన వేలం నిర్వహించారు? పరిశ్రమల ఏర్పాటుకోసం నిర్దేశించిన భూములను రియల్ ఎస్టేట్‌కు ఇస్తున్నారా? ఉపాధి కల్పన కోసం భూములను కే టాయించాలి కదా? ఏ ప్రజాప్రయోజనాల కోసం వేలం వచ్చిన కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నా రు? భూముల వేలం దేని కోసం? రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం వేలం వేస్తున్నారా?’ అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీజీఐఐసీని హైకోర్టు ప్రశ్నలతో ఉకిరిబికిరి చేసింది. ఈ వేలం ద్వారా సాధించదలచిన ప్రజాప్రయోజనం ఏమిటని నిలదీసింది.
ఎస్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ‘ఎస్బీఐ దేశ ఆర్థికాభివృద్ధిలో అత్యంతక కీలక పాత్ర పోషిస్తున్నది. ఎస్బీఐ లాంటి సంస్థకు భూ కేటాయింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దా రుణంగా ఉంది. ఈ భూమిని 2010లో అప్పటి ప్రభుత్వం.. ఎస్‌బీహెచ్‌కు బ్యాంకింగ్ కార్యాలయ సముదాయ నిర్మాణం కోసం కేటాయించింది. ఎస్బీహెచ్ రూ.13.33 కోట్లు చెల్లించి 2011 జనవరి లో భూమి స్వాధీనం చేసుకుంది. 2017లో ఎస్బీహెచ్ ఎస్బీఐలో విలీనమైన తర్వాత ఒప్పందం ప్రకారం ఇకడ ఏసీఐసీ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ముంబై తర్వాత దేశంలోనే అత్యంత ప్రాధాన్యం కలిగిన రెండో కేంద్రంగా దీనిని అభివృ ద్ధి చేయాలని ఎస్బీఐ భావించింది’ అని తెలిపారు.
ఏపీ విభజన, వివిధ అనుమతుల జాప్యం, ఎస్బీహెచ్-ఎస్బీఐ విలీనం, ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా వ్యవహరించిన బీఎస్ఎన్ఎల్ ఆర్థిక ఇబ్బందులు, కొవిడ్ మహమ్మారి వంటి కారణాల తో ప్రాజెక్టు ఆలస్యమైందని బీఎస్ ప్రసాద్ చెప్పా రు. అయినప్పటికీ విమానాశ్రయ, అగ్నిమాపక, ప ర్యావరణ, జీహెచ్ఎంసీ నిర్మాణ అనుమతులు పొందామని, ట్విన్ టవర్ల నిర్మాణానికి అవసరమై న తవ్వకాలు జరిగాయని తెలిపారు. సదరు స్థలం లో బ్యాంకు ఏటీఎంలను ఏర్పాటు చేయడంతోపాటు అభివృద్ధి పనులపై సుమారు రూ.21.5 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. ఈ భూమి కేటాయింపును 2021లో ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ, ఆ నిర్ణయాన్ని హైకోర్టు గతంలో రద్దు చేసి తిరిగి పరిశీలించాలని ఆదేశించిందని గుర్తుచేశారు. ఆ తర్వాత డివిజన్ బెంచ్ కూడా ఎస్బీఐ అభ్యర్థనను పునఃపరిశీలించాలని ఆదేశించిందని గుర్తు చేశారు. అయితే, ఎస్బీఐ కోరిన గడువు పొడిగిం పు అభ్యర్థన పెండింగ్‌లో ఉండగానే ప్రభుత్వం గత మే 6న భూమి వేలం నోటిఫికేషన్ జారీచేసిందని, ఇది కోర్టు ఆదేశాలను ధికరించడమేనని వాదించా రు. ‘ఎస్బీఐకి కేటాయించిన భూమిని ప్రభుత్వం రద్దు చేయలేదు, ఎస్బీఐ చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వలేదు. ఎస్బీఐ ఆధీనంలో ఉన్న భూమిని టీజీఐఐసీ స్వాధీనం చేసుకోలేదు. ఓవైపు ఆ భూమిలో ఎస్బీఐ కార్యకలాపాలు కొనసాగుతుండగా.. ఆ భూమిని వేలం వేయడం ఏమిటి? ఇది పూర్తిగా ఏ కపక్షం, చట్ట వ్యతిరేకం. అందుకే వేలం ప్రక్రియను నిలిపివేస్తూ స్టే ఇవ్వాలి’ అని బీఎస్ ప్రసాద్ కోరా రు. మే 5నాటికి పూర్వ ఉన్న పరిస్థితులను కొనసాగించేలా ఉత్తర్వులు ఇ వ్వాలని కోరారు. భూకేటాయింపును రద్దు చేయకముందే నోటిఫికేషన్ చెల్లదని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం భూమి కేటాయింపును రద్దు చేయడం చెల్లదన్నారు. టీజీఐఐసీ మే 23న బ్యాంకుకు రాసిన లేఖలో ప్రభుత్వం భూకేటాయింపును రద్దు చేసిన విషయం కూడా తె లియజేయలేదని చె ప్పారు. తక్షణమే ప్రభుత్వం ని ర్వహించిన వేలం ప్రక్రియపై స్టే ఇవ్వాలని కోరారు.
టీజీఐఐసీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎస్బీఐ ఎన్నో సంవత్సరాలుగా భూమిని స్వాధీనంలో ఉంచుకున్నది కానీ, ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు అమలు చేయలేదని చెప్పారు. జరిగిన ఆలస్యానికి ఎస్బీఐ చూపుతున్న కారణాలు నమ్మశక్యంగా లేవని ఆయన పేర్కొన్నారు. వేలంలో భూమిని కొన్నవారికి ఆ స్థలాన్ని తమకు నచ్చిన విధంగా వినియోగించుకొనే హకు ఉంటుందని పేర్కొన్నారు. కేటాయించిన భూమిలో అవసరమైతే ఫామ్‌హౌస్ లేదా స్విమ్మింగ్‌పూల్ కూడా నిర్మించవచ్చని వివరించారు. ప్రజాప్రయోజనం అనేది కొనుగోలుదారుడు ఏ నిర్మాణం చేస్తాడన్నది కాకుండా, వేలం ద్వారా సమకూరిన ఆదాయాన్ని ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించడంలో ఉన్నదని తెలిపారు. సదరు ఐదు ఎకరాల భూమిని గౌర వెంచర్స్ ఎకరం రూ.170 కోట్ల చొప్పున కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. ఒకసారి ప్రభుత్వం తన భూమిని అమ్మేస్తే అది పూర్తిగా ప్రైవేట్ ప్రాపర్టీ అవుతుందని, అలాంటి భూమిని కొన్న వాళ్లు తమ అభీష్టం మేరకు దానిని వినియోగించుకోవచ్చునని ఆయన వాదించారు. టీజీఐఐసీ అధికారులతో బ్యాంకు అధికారులు చర్చించారని, మరో స్థలాన్ని తీసుకునేందుకు అంగీకరించారని ఆయన చెప్పారు. అయితే ఎస్బీఐ ఈ విషయాన్ని వెల్లడించడం లేదని ఆరోపించారు. ఈ-మెయిల్ ద్వారా సమాచారం పంపినా స్పందించ లేదని చెప్పారు. అయితే మే 4వ తేదీన జరిగిన సమావేశంలో తాజా గా డీపీఆర్ సమర్పిస్తే 2.57 ఎకరాలను శేరిలింగంపల్లి మండలంలో కేటాయించడానికి టీజీఐఐసీ అంగీకరించిందని, ఆ తర్వాతే వేలం నోటిఫికేషన్ వెలువడిందని తెలిపారు. వేలం ప్రక్రియ పూర్తయ్యాక పిటిషన్ వేయడం చెల్లదని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ టీ రజనీకాంత్‌రెడ్డి వాదిస్తూ, రూ.13 కోట్లకు అత్యంత ఖరీదైన భూమిని తీసుకున్న ఎస్బీఐ గత 16 ఏండ్లుగా పనులు చేయలేదని అన్నారు. ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో నిర్మాణం ప్రారంభించి రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలనే లక్ష్యాల సాధనకు ప్రయత్నాలు జరగలేదని చెప్పారు. కేటాయింపుల లక్ష్యానికి అనుగుణంగా భూమిని వినియోగంలోకి తేకపోతే భూకేటాయింపులను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని తెలిపారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా పారదర్శకంగా ఈ-వేలం నిర్వహించినట్టు చెప్పారు. 2010లో భూమిని కేటాయిస్తే 2023 వరకు బ్యాంకు ఎలాంటి పనులూ చేపట్టలేదని తెలిపారు. ప్రభుత్వ భూములను వేలం ద్వారా విక్రయించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించిందని గుర్తుచేశారు. వేలం నోటిఫికేషన్ జారీచేసిన తరువాత 17 రోజులు ప్రేక్షకపాత్ర పోషించిన ఎస్బీఐ ఇప్పుడు కేసు వేయడం చెల్లదని అన్నారు. 18 ఏండ్లుగా ఎలాంటి పనులు చేపట్టకుండా ఉండి కేవలం మూడు ఏటీఎంలు పెట్టి వినియోగిస్తున్నామంటే సరికాదని చెప్పారు.

ప్రభుత్వం వేలం వేసిన భూమిలో కొనుగోలుదారు స్విమ్మింగ్‌ఫూల్ కట్టుకోవచ్చంటూ టీజీఐఐసీ వాదించడాన్ని ఎస్బీఐ తరఫున హా జరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్ వెంకటరామన్ తప్పుపట్టారు. నిర్దిష్ట లక్ష్యసాధన కోసం ప్రభుత్వం భూమిని వేలం వేయాలని, ఎవరికిపడితే వాళ్లకు కట్టబెట్టే వీల్లేదని స్పష్టంచేశారు. ఏది పడితే అది చేసుకొనేందుకు ప్రభు త్వ భూములను వేలం వేయడానికి వీల్లేదన్నా రు. ప్రభుత్వం ట్రస్టీగా ఉండాల్సిన భూముల ను ఇష్టారీతిన అమ్మేస్తామంటే కుదరదని చెప్పారు. ఫామ్‌హౌస్ లేదా స్విమ్మింగ్‌పూల్ కూడా ప్రజాప్రయోజనం కోసమేనని చెప్పడం ఆశ్చర్యకరమని అన్నారు. భూమిని మానిటైజ్ చేయడమే ప్రజాప్రయోజనానికి ప్రత్యామ్నా యం కాదని స్పష్టంచేశారు.
ఐకియా వంటి ఇ తర సంస్థలకు ప్రభుత్వం గడువు పొడిగించి ఎస్బీఐకి మాత్రం గడువు ఇవ్వడం లేదన్నా రు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని వాదించారు. ఎప్పటిలోగా ఒప్పందానికి అనుగుణంగా నిర్మాణాలు చేస్తారన్న హైకోర్టు ప్రశ్నకు సమాధానంగా రెండేండ్లలో పూర్తవుతుందని జవాబు చెప్పారు. ఆరేండ్లు ప్రభుత్వం కారణంగానే పనులు జరగలేదని తెలిపారు. అనేక కంపెనీలు భూమి తీసుకొని పనులు చేయకపోయినా చర్యలు తీసుకోని ప్రభుత్వం ఎస్బీఐ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు. 2011 నుంచి 2021 వరకు ప్రభుత్వం భూమికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఐకియా, డెల్లాయిట్, ఫినిక్స్ వంటి కంపెనీలకు ప్రభుత్వం గడువు పొడిగించిందని గుర్తుచేశారు. సెలవు రోజున వేలం వేయడం కూడా కుట్రలో భాగమని అన్నారు. గడువు పొడిగింపునకు 2021 జులై 7న ప్రభుత్వం అంగీకరించిందని, 9న టీజీఐఐసీ కూడా ఆమోదం తెలిపిన తర్వాత అందుకు వ్యతిరేకంగా చర్యలు ఉన్నాయని చెప్పారు.