‘మొదట కూల్చివేయడం, చుట్టూ కంచె వేసి బోర్డులు పెట్టడం, ఆపై ఆ చర్యను సమర్థించుకోవడం, కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేయడం.. ఇవేమీ హైడ్రాకు కొత్త కాదు. ఇవి తరచూ పునరావృతమవుతున్నవే. కోర్టు ఉత్తర్వులున్నాయని తెలియజేసినా భారీ బలగంతో వెళ్లి చీకటిమాటున కూల్చివేతలు చేపట్టడం, ఆపై దాన్ని విజయంగా చిత్రీకరిస్తూ మీడియాలో ప్రచారం చేసుకోవడం హైడ్రా పెత్తందారీ పోకడలను వెల్లడిస్తున్నది. ఇటువంటి పోకడలు చట్టబద్ధమైన పాలన మూలాలను దెబ్బతీస్తున్నవి. ఈ కోర్టు అధికారాన్ని, గౌరవాన్ని దెబ్బతీసే చర్యలను సహించలేం’ అంటూ హైడ్రా తీరుపై జస్టిస్ నగేశ్ భీమపాక నిప్పులు చెరిగారు.
హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మలాజిగిరి జిల్లా కూకట్‌పల్లిలో ఈ నెల 25న హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై హైకోర్టు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగింది. కోర్టు ఉత్తర్వులను గౌరవించి చట్టపరిధిలో చర్యలు చేపడుతామన్న హామీకి విరుద్ధంగా చీకటిమాటున రాత్రంతా కూల్చివేతలు చేపట్టి దానిని ఓ విజయంగా మీడియాలో ప్రచారం చేసుకోవడంపై మండిపడింది. ఇలాంటి పెత్తందారీ పోకడలను సహించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. కోర్టు ధికరణ పిటిషన్ పెండింగ్‌లో ఉండగా ఉల్లంఘనలను నిరంత రం కొనసాగించలేరని, వాటిని ఆపాల్సిందేన ని స్పష్టం చేసింది. ఉల్లంఘనలను నియంత్రి స్తూ ఉత్తర్వులు ఇచ్చే అధికారం ఈ కోర్టుకు ఉన్నదని స్పష్టంచేసింది. కూకట్‌పల్లిలోని 1,003-1,006 సర్వే నంబర్లలోని 13.17 ఎకరాల స్థలం 25న కూల్చివేతలు చేపట్టడానికి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించాలని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శితో పాటు కలెక్టర్, తహసీల్దార్‌కు హైకోర్టు ఉత్తర్వు లు జారీచేసింది. ఈ ఉత్తర్వులు అందిన 24 గంటల్లో పనులు చేయాలని, లేని పక్షంలో పి టిషనర్లే పునరుద్ధరణ చర్యలు చేపట్టి ఆ ఖర్చు ను అధికారుల సొంత నిధుల నుంచి రాబట్టుకోవచ్చని స్పష్టంచేసింది. ప్రైవేటు స్థలంలో జోక్యం చేసుకోరాదన్న ఉత్తర్వులకు విరుద్ధం గా ఈ నెల 25న హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ సంస్థ వేర్వేరుగా దాఖలు చేసిన మూడు కోర్టు ధికరణ పిటిషన్లపై జస్టిస్ నగేశ్ భీమపాక శుక్రవారం విచారణ చేపట్టారు.
ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. రికార్డులు, ఆధారాలతోపాటు పిటిషనర్లు సమర్పించిన ఫొటోలను పరిశీలించారు. అనంతరం కోర్టు ఉత్తర్వుల ద్వారా పిటిషనర్ల రక్షణలో ఉన్నవాటికి ఎలాంటి నోటీసు ఇవ్వలేదని, తొందరపాటు చర్యలు తీసుకోరాదన్న కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కూల్చివేతలు, వి ధ్వంసం, ఆక్రమణల తొలగింపునకు పాల్పడినట్టు స్పష్టమవుతున్నదని పేర్కొన్నారు. గతంలో అకడ చెరువు లేదని చెప్పిన అధికారులు ఇప్పుడు అందుకు భిన్నంగా చెరువు ఉన్నదంటూ కూల్చివేతలు చేపట్టలేరని స్పష్టం చేశారు. కూల్చివేతల సమయంలో నోటీసు ఇవ్వకపోవడం, సహజ న్యాయసూత్రాలను అమలు చేయకపోవడం పిటిషనర్ల వాదనకు బలం చేకూర్చిందన్నారు. హైడ్రాకు ఇలా ప్రవర్తించడం కొత్తేమీ కాదని, మొదట కూల్చివేయడం, కంచె వేయడం, బోర్డులు పెట్టడం, ఆపై వారి చర్యను సమర్థించుకోవడంతోపాటు కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించడమే హైడ్రా తీరు అని వ్యాఖ్యానించారు.
కోర్టు ఉత్తర్వుల పట్ల హైడ్రా నిర్లక్ష్యంగా వ్యవహరించడమేకాకుండా వాటిని అగౌరవ పరిచినట్టు ప్రాథమిక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయని, చట్టబద్ధమైన హామీ ఇచ్చి గడువు తీసుకున్న ప్రభుత్వ సంస్థ ఆ హామీకి విరుద్ధం గా వ్యవహరించినట్టు స్పష్టమవుతున్నదని జస్టిస్ నగేశ్ భీమపాక ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఉత్తర్వుల గురించి తెలియజేసినప్పటికీ వాటిని పట్టించుకోకుండా చీకటిమాటున రాత్రంతా కూల్చివేతలు చేపట్టడం, ఆపై దాన్ని గొప్ప విజయంగా చిత్రీకరిస్తూ మీడియాలో ప్రచారం చేసుకోవడం హైడ్రా తీరును తేటతెల్లం చేస్తున్నదని మండిపడ్డారు. కోర్టు అధికారాన్ని, గౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. హైడ్రా పెత్తందారీ విధానాలను హైకోర్టు ఖండిస్తున్నదని, వాటిని అడ్డుకునేలా మధ్యంతర ఉత్తర్వులు జారీచేసే అధికారం ఈ కోర్టుకు ఉన్నదని తెలిపారు.
వివాదాస్పద స్థలంలో ఈ నెల 25కు ముందున్న పరిస్థితిని 24 గంటల్లోగా పునరుద్ధరించాలని అధికారులను జస్టిస్ నగేశ్ భీమపాక ఆదేశించారు. ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్, టిన్ షీట్లతో భద్రతా సిబ్బంది గదులు, ప్రవేశ ద్వారం నిర్మించాలని, విద్యుత్తు లైన్లు, లైటిం గ్, ఇతర మౌలిక వసతులన్నీ పునరుద్ధరించాలని స్పష్టంచేశారు. హైడ్రా, రెవెన్యూ సిబ్బంది వేసిన ఫెన్సింగ్, బోర్డులను తొలగించాలని, హైడ్రా, రెవెన్యూ సిబ్బందిని బయటికి పంపాలని, పిటిషనర్‌కు చెందిన యంత్రాలు, సామగ్రికి భద్రత కల్పించాలని ఆదేశించారు. ఒకవేళ పునరుద్ధరణ పనులు చేపట్టడంలో అధికారులు విఫలమైతే పిటిషనర్లే ఆ పనులు పూర్తిచేసి సంబంధిత ఖర్చులను ప్రతివాదుల సొంత నిధుల నుంచి వసూలు చేసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుత అభిప్రాయాలన్నీ మధ్యంతర ఉత్తర్వులకే పరిమతమని పేర్కొంటూ.. కోర్టు ధికరణ పిటిషన్లపై తదుపరి విచారణను జూన్ 4కు వాయిదా వేశారు.
పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ల స్వాధీనంలో ఉన్న 1,003-1,006 లోని స్థలంలో జోక్యం చేసుకోరాదని హైకోర్టు ఉత్తర్వులు జారీచేసిందని గుర్తుచేశారు. అక్కడ ఏవైనా చర్యలు చేపట్టాలనుకుంటే చట్టపరిధిలోనే చేపడతామంటూ మరో పిటిషన్లో హైడ్రా హామీ ఇచ్చిందని తెలిపారు. ఈ సర్వే నంబర్లలోని స్థలాన్ని రూ.9.27 కోట్లు చెల్లించి క్రమబద్ధీకరణ చేయించుకున్నామని, అది పట్టా భూమేనని అధికారులే స్పష్టంగా చెప్పారని వివరించారు. ఖానామెట్‌లోని 7వ సర్వే నంబర్లో గతంలో చెరువు ఉన్నట్టయితే దాన్ని పునరుద్ధరించుకోవచ్చని హైకోర్టు చెప్పిందని, అకడ సర్వే నంబర్లు ఓవర్ ల్యాప్ అయినట్టయితే చెరువును మరో ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. కోర్టు నుంచి ఇన్ని ఉత్తర్వులున్నప్పటికీ హైడ్రా సిబ్బంది ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఈ నెల 26న కూల్చివేతలు చేపట్టారని, చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ను తొలగించి, సెక్యూరిటీ గదులను కూల్చివేశారని, యంత్రాలను, ఇతర పరికరాలను ధ్వంసం చేశారని, విద్యుత్తు సరఫరాను నిలిపివేశారని, అది ప్రభుత్వ స్థలమని, హైడ్రా పరిరక్షణలో ఉన్నదని పేర్కొంటూ బోర్డు కూడా ఏర్పాటు చేశారని వివరించారు. ఆ స్థలాన్ని పునరుద్ధరించాలని, అందులో ఎవరూ జోక్యం చేసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ వాదనతో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది విభేదించారు.