ఖైరతాబాద్, నవంబర్ 5 : చిత్ర రంగంలో తెలంగాణ, ఆంధ్రా విభజన జరగాల్సిన అవసరం ఉందని తెలంగాణ సినిమా వేదిక అధ్యక్షుడు లారా అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇంకా ఆస్తుల విభజన జరగలేదని, ఇతర రాష్ర్టాలకు చెందిన వారివే ఉన్నాయని, ఒకవేళ వారిని ఉండనిచ్చినా సినీరంగ అభివృద్ధికి పాటుపడిన దాఖలాలు లేవన్నారు.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన రెండేండ్ల కాలంలో తెలంగాణ సినీ కార్మికులకు చేసిందేమి లేదన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు తెలంగాణ సినీ కార్మికులకు ఇచ్చిన హామీలను సైతం విస్మరించారన్నారు. ప్రస్తుతం తెలుగు ఫిలించాంబర్‌ను హోల్‌సేల్‌గా అమ్మే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఇటీవల తమ సమస్యలపై సినిమాటోగ్రఫి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని కలిసి వివరించామని, తాను పేరుకే మంత్రినని, తనచేతిలో ఏమిలేదని, తాను ఇంకా చార్జి కూడా ఏమి తీసుకో లేదని, తనను బొమ్మను చేసుకొని ఆడుకుంటున్నాడని, ఇక్కడ షాడో మినిస్టర్‌ను ఏర్పాటు చేసుకొని నడిపిస్తున్నాడంటూ తమతో అనడం ఆశ్చర్యమేసిందన్నారు. సమావేశంలో తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్ బైరాగి, ఏవీ రావు, గోవిందరాజు పాల్గొన్నారు.