సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకోవాలంటే వాహనదారులకు కత్తిమీద సాములా మారింది. ఏదైనా నంబర్ ఎంపిక చేసుకుని అందుకు సంబంధించిన రిజర్వేషన్ ఫీజు చెల్లించాక బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో సదరు వ్యక్తి బిడ్డింగ్ ఎమౌంట్ సకాలంలో చెల్లించలేక వెనకబడిపోతున్నారు. ఫలితంగా నచ్చిన నంబర్ కోల్పోవల్సి వస్తుంది. ప్రహ్లాద్ ఇటీవల ఓ నంబర్ కోసం బిడ్డింగ్‌లో పాల్గొన్నాడు. రిజర్వేషన్ ఫీజు చెల్లించి బిడ్డింగ్‌లో పాల్గొన్నాక ఆ నంబర్‌పై తనకు నచ్చిన ఎమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. అతడు వాహన్ పోర్టల్ లింక్‌లో ట్రాన్స్క్షన్ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అది ఫెయిల్ అయింది.
మళ్లీ ఆ వివరాలు ఎంటర్ చేయడానికి ప్రయత్నిస్తే తీసుకోవడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. నచ్చిన నంబర్‌తో పాటు ముందు చెల్లించిన రిజర్వేషన్ ఫీజు సైతం కోల్పోవల్సి వచ్చిందని వాపోయాడు. సాధారణంగా బిడ్డింగ్ వాహన్ పోర్టల్ ద్వారా కొనసాగుతుండటంతో సాంకేతిక సమస్యలు చుట్టుముట్టాయి. ఆ సమస్య నియంత్రణ ఇక్కడి వారి చేతుల్లో ఉండటం లేదు. దీంతో సమయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఫ్యాన్సీ నంబర్ బిడ్డింగ్ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ఆర్టీఏ సేవలు కేంద్ర పోర్టల్‌కి మారడంతో వాహనదారులు తక్కువ ధరలో నచ్చిన నంబర్‌ను ఎంపిక చేసుకునే అవకాశం కోల్పోయారు. తత్కాల్లో వెయ్యి రూపాయల చెల్లింపుతో అందుబాటులో ఉన్న నచ్చిన నంబర్‌ను తీసుకునే సేవను ఇప్పుడు రూ.6 వేలు చేశారు. గతంలో ఫ్యాన్సీ నంబర్ మినహాయించి ఏ రోజుకు ఆ రోజు అందుబాటులో ఉన్న 150 నంబర్లలో నచ్చిన నంబర్ దక్కించుకోవడానికి వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉండేది. ఉన్న వాటిలోనే నంబర్ ఎంపిక చేసుకునే వీలుండేది. ఆ నంబర్‌కు ఎటువంటి బిడ్డింగ్ లేకపోతే సదరు వాహనానికి నంబర్ అధికారులు కేటాయించేవారు. కానీ ఈ తరహా అవకాశం ప్రస్తుతం లేదు. ఫ్యాన్సీ నంబర్లు కానీ వాటిని కూడా ఎంపిక చేసుకున్నా అధిక మొత్తం చెల్లించాల్సి వస్తోంది.
ఫోర్ వీలర్లకు రూ.6వేలు, ద్విచక్ర వాహనాలకు రూ.3 వేలు ఛార్జీ ఉంది. అంతేకాదు డబ్బులు చెల్లించినా మళ్లీ బిడ్డింగ్‌లో ఎవరైనా పోటీ వస్తే వేలంలో పాల్గొనాల్సి వస్తుంది. అప్పుడు 6 వేలకు అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో 9999 దక్కించుకోవాలంటే రూ.50వేల ఫీజు చెల్లించి ఆపై బిడ్డింగ్‌లో పాల్గొనేవాళ్లు. కానీ ఇప్పుడు ఈ 9999 నంబర్‌ను దక్కించుకోవాలంటే 1.50లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత బిడ్డింగ్‌లో పాల్గొనాలి. కాగా గతంలో 1,9 నంబర్లకు రూ.50వేలు ఉంది. ఇప్పుడు లక్ష రూపాయల ఫీజు ఉంది. 3333, 4444, 5555, 7777, 8888 రూ.30వేలు గతంలో ఉండేది. ప్రస్తుతం రూ.50 వేలు ఉంది. పెరిగిన ధరలున్నప్పటికీ బిడ్డింగ్ ప్రక్రియలో ఆన్లైన్ ఇబ్బందులు వల్ల నష్టపోతున్నామంటూ వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.