ఆసియా గేమ్స్‌లో వరుస రెండు రోజులు స్వర్ణాలతో మెప్పించిన భారత జోరు కాస్త తగ్గింది. మెగా గేమ్స్ ముంగిపునకు చేరుకుంటున్న దశలో గురువారం భారత్ రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు అందుకుంది. రెజ్లింగ్ గ్రీకో రోమన్ విభాగంలో 64 ఏండ్ల తర్వాత నితేశ్ దేశానికి వెండి పతకం అందించగా.. సెయిలింగ్‌లో కేరళ కజిన్స్ మను ఫ్రాన్సిస్- ప్రిన్స్ కురిసింకల్ నోబుల్ కూడా రజతంతో మెరిశారు. ఆర్చరీలో ఏపీ కుర్రాడు గణేశ్ కాంస్యానికి గురి పెట్టగా డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగిన పురుషుల క్రికెట్, హాకీ జట్లు ఫైనల్‌కు దూసుకెళ్లి స్వర్ణాల ముంగిట నిలిచాయి.
నగోయా: ఆసియా క్రీడల రెజ్లింగ్‌లో భారత మల్ల యోధుడు నితేశ్ సివాచ్ మెరిశాడు. పురుషుల గ్రీకో రోమన్ 97 కేజీల విభాగంలో రజతం సాధించాడు. ఈ విభాగంలో భారత్‌కు బంగారు పతకం అందించే సువర్ణావకాశాన్ని చేజార్చినా.. 1962 తర్వాత దేశానికి తొలి సిల్వర్ అందించాడు. గురువారం జరిగిన ఫైనల్లో అతను 0-4తో జపాన్‌కు చెందిన యూరి నకజాటో చేతిలో ఓడి వెండి పతకంతో తిరిగొచ్చాడు. హర్యానాలోని పానిపట్ జిల్లా జగ్సీ గ్రామానికి చెందిన ఒక పాల వ్యాపారి కుమారుడైన నితేశ్.. ఫైనల్ చేరే క్రమంలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
క్వార్టర్స్‌లో తజికిస్థాన్ రెజ్లర్ అమాన్బెర్దిని 7-1తో, సెమీస్‌లో మంగోలియాకు చెందిన గంఖుయాంగ్ను 9-0తో చిత్తు చేసి తుదిపోరుకు అర్హత సాధించాడు. ఫైనల్లో నకజాటో పక్కా వ్యూహంతో ఆడి నితేశ్‌కు దాడి చేసే అవకాశం ఇవ్వకుండా డిఫెన్స్‌తో కట్టడి చేశాడు. సుమిత్ (60 కేజీ), అమన్ బరోనియా (77 కేజీ) క్వార్టర్ ఫైనల్స్‌లోనే నిష్క్రమించి పతక రేసు నుంచి తప్పుకున్నారు.మరోవైపు మహిళల 62 కిలోల విభాగం కాంస్య పతక పోరులో మాన్సీ అహ్లావత్ 2-5తో మంగోలియా రెజ్లర్ అల్ట్జిన్ చేతిలో ఓడి నిరాశ పరిచింది.
పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ఆంధ్రప్రదేశ్ చెందిన 20 ఏండ్ల గణేశ్ మణిరత్నం తిరుమురు కాంస్యం అందుకున్నాడు. కాంస్య పతక ప్లే ఆఫ్ పోరులో అతను 149-144తో వియత్నాం ఆర్చర్ కాంగ్ డక్ డాంగ్‌ను ఓడించాడు. టీమ్ ఈవెంట్లో గోల్డ్ నెగ్గిన అతను గణేశ్ బ్రాంజ్ మెడల్ ప్లేఆఫ్లోమ్యాచ్లో విసిరిన 15 షాట్లలో ఏకంగా 14 షాట్లను పర్ఫెక్ట్ 10 పాయింట్లుగా మలిచాడు. మహిళల, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో బంగారు పతకాలు గెలిచిన తెలంగాణ అమ్మాయి తానిపర్తి చికిత వ్యక్తిగత విభాగంలో ఆ జోరు కొనసాగించలేకపోయింది. క్వార్టర్ ఫైనల్లో చికిత 143-144తో ఇండోనేషియా ఆర్చర్ నురిసా దియాన్ అష్రిఫా చేతిలో ఒక్క పాయింట్ తేడాతో ఓడిపోయి హ్యాట్రిక్ మెడల్స్ సాధించే చాన్స్ కోలపోయింది.
స్కాష్‌లో మహిళల, పురుషుల టీమ్ విభాగాల్లో భారత జట్లు సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నాయి. మహిళల సెమీస్‌లో టీమిండియా 1-2తో హాంకాంగ్ చేతిలో ఓడిపోయింది తన్వి ఖన్నా 3-1తో తన ప్రత్యర్థిపై నెగ్గినా.. యువ సంచలనం అనాహత్ సింగ్, వెటరన్ ప్లేయర్ జోష్న చిన్నప్ప నిరాశపరిచారు. పురుషుల సెమీఫైనల్లో భారత్ 1-2తో మలేషియా చేతిలో పరాజయం పాలైంది. ఇతర క్రీడల్లో సెపక్తక్రా పురుషుల క్వాడ్రంట్ విభాగంలో 2-1తో మయన్మార్‌పై గెలిచిన భారత్ సెమీఫైనల్‌కు చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. గోల్ఫ్ మహిళల వ్యక్తిగత విభాగం రెండో రౌండ్లో ప్రణవి రెండో స్థానంలో ఉండగా.. టీమ్ విభాగంలో ప్రణవి, దీక్షా దాగర్, అదితి అశోక్‌తో కూడిన జట్టు 273 స్కోరుతో కాంస్య పతక రేసులో
నిలిచింది.
టెన్నిస్ ప్లేయర్లు ఈసారి రిక్తహస్తాలతో తిరిగొచ్చారు. రేసులో మిగిలిన ఏకైక ఆటగాడైన సుమిత్ నగాల్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 4-6, 4-6తో చైనా ప్లేయర్ యిబింగ్ వు చేతిలో ఓడిపోయాడు. దీంతో 1986 తర్వాత తొలిసారిగా భారత టెన్నిస్ జట్టు ఒక్క పతకం కూడా లేకుండానే
వెనుదిరిగింది.