Jasveer Singh : సాఫ్ట్వేర్ ఉద్యోగాల (Software Jobs) లో ‘ప్యాకేజీ’ల పరుగు చిత్రవిచిత్రంగా ఉంటుంది. తాజాగా జరిగిన ఓ ఘటనే అందుకు నిదర్శనం. కంపెనీలో చేరతానని మాట ఇచ్చిన ఒక టెకీ.. తీరా జాయినింగ్ తేదీకి రెండు రోజుల ముందు ఊహించని మెలిక పెట్టాడు. దాంతో ఆ కంపెనీ యజమాని (Company owner) అసహనానికి గురయ్యారు.
ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. ఉద్యోగ నియామక ఇంటర్వ్యూకు హాజరైన ఓ టెకీకి ఒక స్టార్టప్ కంపెనీ రూ.28 లక్షల వార్షిక ప్యాకేజీతో జాబ్ ఆఫర్ చేసింది. పాత కంపెనీలో అతడు అందుకుంటున్న రూ.21 లక్షల ప్యాకేజీకి దాదాపు 33 శాతం హైక్ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ ఆఫర్ నచ్చడంతో సదరు టెకీ కూడా సుముఖత వ్యక్తంచేశాడు.
అయితే, నోటీస్ పీరియడ్ కారణంగా జాయినింగ్ కు సమయం కోరాడు. అందుకు ఆమోదం తెలుపుతూ
టెకీకి అనుకూలమైన తేదీని జాయినింగ్ డేట్‌గా పేర్కొంటూ కంపెనీ ఆఫర్ లెటర్ ఇచ్చింది. అయితే
విధుల్లో చేరడానికి కేవలం రెండు రోజుల ముందు, ఆ టెకీ మళ్ళీ కంపెనీని సంప్రదించాడు. తనకు
మరో కంపెనీలో రూ.31 లక్షల వార్షిక వేతనంతో ఆఫర్ వచ్చిందని, ఇంటర్వ్యూలో తాను
అంగీకరించిన రూ.28 లక్షల ప్యాకేజీని పెంచాలని కోరాడు.
రూ.36 లక్షల వార్షిక వేతనం ఆఫర్ చేస్తేనే కంపెనీలో చేరుతానని, లేదంటే లేదని మెలిక పెట్టాడు. ఈ పరిణామంతో సదరు టెకీపై కంపెనీ యజమాని తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘ముందే
అంగీకరించి చివరి నిమిషంలో ఇలాంటి డిమాండ్లు పెట్టడం ఏంటి..? దీనివల్ల ప్రాజెక్టుల సమయం
వృథా అవ్వడమే కాకుండా కంపెనీ నమ్మకం దెబ్బతింటుంది’ అని సోషల్ మీడియా వేదికగా
విమర్శించారు.
ముందు ఒప్పుకున్నాక ఇప్పుడు జీతం పెంచితేనే వస్తానని అనడం ఏంటని ప్రశ్నించాడు. జీతం విషయంలో బేరసారాలు తప్పని తాను అనడంలేదని, అయితే అదంతా ఆఫర్ ఒప్పుకోవడానికి ముందే చేయాలని పేర్కొన్నారు. తమకు కావాల్సిన ఉద్యోగి దొరికాడని ఇంటర్వ్యూలు కూడా ఆపేశామని ఆయన వాపోయారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది.
‘ఇది ముమ్మాటికీ ప్రొఫెషనలిజం కాదు, చివరి నిమిషంలో బ్లాక్ మెయిల్ చేయడమే’ అని కొందరు నెటిజన్లు యజమానికి మద్దతు తెలుపుతుంటే.. మరికొందరు మాత్రం ‘మార్కెట్లో పోటీ ఎక్కువగా ఉన్నందున ఎక్కువ జీతం వచ్చే చోటికి వెళ్లడంలో తప్పులేదు’ అని టెకీని సమర్థిస్తున్నారు. మొత్తానికి ప్రస్తుత ఐటీ మార్కెట్లో ‘ఆఫర్ లెటర్లు’ ఇచ్చినా సరే ఉద్యోగి కంపెనీలో చేరేవరకు నమ్మకం లేదనేది స్పష్టమవుతున్నది.