హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సర్కార్ స్కూళ్లను 4 వేలకు కుదించడం వల్ల అనేక దుష్పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. సర్కార్ టీచర్ల భవితవ్యం ప్రశ్నార్థకం కానుంది. టీచర్లు ఎక్కువ ఉన్నారని వీఆర్ఎస్ ఇచ్చే ప్రమాదమున్నది. మిగులు టీచర్ల సర్దుబాటు పేరిట వారిని క్లర్కులుగా మార్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని 10 వేలకుపైగా గ్రామ పంచాయతీల్లో సర్కార్ బడి అన్నదే ఉండదని, ఇలాంటి అనేక అనర్థాలు పొంచి ఉన్నాయని ఉపాధ్యాయ సంఘా ల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని 27 వేల సర్కార్ బడుల్లో 1.1 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. మన దగ్గర 12 మంది విద్యార్థులకొక టీచర్ ఉన్నారు. అదే జాతీయస్థాయిలో చూస్తే 24 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు.
ఇంతమంది టీచర్లున్నా ఆశించిన ఫలితాలు రావడంలేదని సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు చెప్పారు. 23 వేల బడుల మూసివేతతో టీచర్లను నాలుగు వేలకుపైగా స్కూళ్లల్లో సర్దుబాటు చేయాల్సి వస్తుంది. అంటే ఒక్కో స్కూల్లో 27 మంది టీచర్లు అవుతారు. వాస్తవానికి ఒక హైస్కూల్‌కు 15-18 మంది టీచర్లు సరిపోతారు. దాదాపు 30 వేల మంది టీచర్ల మిగులు ఏర్పడుతుందని ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నాయి. ఈ టీచర్లను వేరేశాఖల్లో సర్దుబాటు చేసే ప్రమాదం పొంచిఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్నా యి. టీచర్లను క్లర్కులుగా మార్చినా ఆశ్చర్యపోనక్కరలేదని అంటున్నాయి. ఇది ఇంతటితో ఆగదు. ఇంటర్‌ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రయత్నాలు షురూ అయ్యాయి. ఇదే క్రమంలో నాలుగువేల స్కూళ్లల్లో ఇంటర్ ప్రారంభిస్తే సర్కార్ జూనియర్ కాలేజీలు నిర్వీర్యమవుతాయి.
ఈ కాలేజీల్లో 6 వేలకుపైగా జూనియర్ లెక్చరర్స్ పనిచేస్తున్నారు. వీరి ఉద్యోగాలకూ ఎసరు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి వస్తుందని తాము ఊహించలేదని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ టీచర్ వాపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13 వేల గ్రామ పంచాయతీలున్నాయి. స్కూళ్లను నాలుగు వేలకు పరిమితం చేస్తే పది వేలకుపైగా గ్రామాల్లో అసలు బడులే ఉండవు. దీంతో డ్రాపౌట్ రేటు ఎక్కువై నిరక్షరాస్యుల సంఖ్య పెరుగుతుంది. సర్కార్ స్కూళ్లు మూతబడటంతో డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు రంగప్రవేశం చేస్తాయి. మొత్తంగా సర్కార్ వ్యవహారం చూస్తుంటే ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్నట్టు గోచరిస్తున్నదని విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘బడ్జెట్లో విద్యాశాఖకు రూ. 21 వేల కోట్లు కేటాయిస్తే, దీంట్లో 98 శాతం టీచర్ల జీతాలకే ఖర్చవుతున్నది’ ఈ మాటలన్నదెవరో కాదు స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి. అంటే టీచర్ల జీతాలను సాధ్యమైనంతవరకు తగ్గించాలన్న ఏకైక లక్ష్యంతో సర్కార్ అడుగులేస్తున్నట్టు అగుపిస్తున్నది. 27 వేల స్కూళ్లను నాలుగువేలకు కుదించే ఆలోచన ఈ కోవకు చెందినదేనని ఉపాధ్యాయ సంఘాలు అనుమానిస్తున్నాయి. విలీనంతో ఎలాగూ మిగులు టీచర్లు తేలుతారు. ఈ టీచర్లకు వలంటరీ రిటైర్మెంట్ స్కీమ్(వీఆర్ఎస్) ఇచ్చే ప్రమాదం పొంచి ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 30వేల మంది టీచర్లను ఇంటికి పంపించి జీతాల బడ్జెట్‌ను తగ్గించేందుకు సర్కార్ అడుగులేస్తున్నదని ఉపాధ్యాయ సంఘాల నేతలు అంటున్నారు.
విద్యకు బడ్జెట్ పెంచాల్సిందిపోయి టీచర్లను తగ్గించి బడ్జెట్ మిగుల్చుకోవాలని చూడటం అ త్యంత దారుణమని మండిపడుతున్నాయి. స్కూళ్లను కుదించడంతో టీచర్ రిక్రూట్మెంట్స్.. కొత్త నియామకాలు ప్రశ్నార్థకం కానున్నాయి. భవిష్యత్తులో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్లు జారీచేసే అవకాశాలు మృ గ్యం కానున్నాయి. విద్యాశాఖ అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 14 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 90 శాతం సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులే. కాంగ్రె స్ సర్కార్ అధికారంలోకి వచ్చాక 10 వేల టీచర్ పోస్టులను మాత్రమే భర్తీ చేసింది. మన రాష్ట్రంలో ఏటా 12 వేల మంది విద్యార్థులు బీఈడీ పట్టాలు పుచ్చుకుంటున్నారు.
మరో 1,200 మంది వరకు బీపీఈడీ, యూజీ డీపీఈడీ వంటి కోర్సులను పూర్తి చేస్తున్నారు. వీరుగాక మరో 4,500 మంది డీఎడ్ కోర్సు పూర్తి చేస్తున్నారు. మొత్తంగా ఏటా 16 వేల మంది పట్టాలు పుచ్చుకొని టీచర్ కొలువులకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మంది బీఎడ్, డీఎడ్ అభ్యర్థులున్నా రు. వీరంతా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం కండ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. డీఎస్సీ పడదు.. టీచర్ కొలువు దక్కదు అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి. అంటే సర్కార్ ఉద్దేశపూర్వకంగానే ముంద స్తు ప్రణాళికలో భాగంగా టీచర్ పోస్టులను భర్తీచేయడం లేదని నిరుద్యోగ జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు.
రాష్ట్రంలో అత్యవసర వైద్యాన్ని అందించే అంబులెన్స్‌లనే సర్కార్ సవ్యం గా నడుపలేకపోతున్నది. 108, 104 అంబులెన్స్‌లను సక్రమంగా నిర్వహించలేకపోతున్నది. చెడిపోయినవాటికి మరమ్మతులు చేపట్టడం లేదు. సిబ్బందికి సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదు. ప్రాణాలను కాపాడేవాటి విషయంలోనే సర్కార్ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. మండలానికి ఒకటి రెండు అంబులెన్స్‌లను నడుపలేక చేతులెత్తేసింది. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో 13 వేల గ్రామ పంచాయతీలు, మరో 2 వేల హ్యామ్లెట్స్ కలిపితే మొత్తంగా 15 వేల గ్రామాల నుంచి విద్యార్థులను రవాణా చేయడం సాధ్యమయ్యేపనేనా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అంబులెన్స్‌లనే నడుపలేని సర్కార్ స్కూల్ బస్సులను ఎలా నిర్వహించగలుగుతుందన్న ప్రశ్నలొస్తున్నాయి.
విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉండాల్సిందే. బడులను మూసివేయడమంటే ఉద్దేశపూర్వకంగా చదువును దూరం చేయడమే. బడుల కుదింపు అంటే అందరికీ విద్యనందించాలనే రాజ్యాంగ మౌలిక సూత్రాలు, ప్రాథమిక హక్కులను హరించడమే అవుతుంది. సర్కార్ నిధులివ్వకపోవడం, బడ్జెట్ పెంచకపోవడంతో స్కూళ్లు కళావిహీనంగా తయారవుతున్నాయి. ప్రజలను ఆకర్షించకలేకపోతున్నాయి. కుదింపు ఆలోచన విరమించి స్కూళ్ల బలోపేతానికి చర్యలు తీసుకోవాలి.
– రఘుశంకర్‌రెడ్డి, రిటైర్డ్ టీచర్