TANA | డాలస్, టెక్సస్: వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు రాష్ట్ర భాషా దినోత్సవం సందర్భంగా తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ అంతర్జాల సమావేశాన్ని నిర్వహించింది. ‘తెలుగే మన వెలుగు’ అనే అంశంపై ఆదివారం జరిగిన ఈ సమావేశం విజయవంతంగా కొనసాగింది. తానా సంస్థ సాహిత్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నెల నెలా తెలుగు వెలుగు’ కార్యక్రమంలో భాగంగా గత ఆరు సంవత్సరాలుగా ప్రతి నెలా చివరి ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ ఆదివారం సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ స్వాగతోపన్యాసంతో సమావేశం ప్రారంభమైంది. పలువురు ప్రముఖులు పాల్గొని తెలుగు భాష ప్రాధాన్యత, పరిరక్షణ, అభివృద్ధి, భవిష్యత్ తరాలకు భాషను అందించాల్సిన బాధ్యతపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా.. ముఖ్యఅతిథి, కీలకోపన్యాసకుడిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. తెలుగు భాష పరిరక్షణ, పరివ్యాప్తికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. త్వరలోనే ఒక సలహా కమిటీని ఏర్పాటు చేసి తెలుగు భాష అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించి తగిన విధివిధానాలను రూపొందిస్తామని తెలిపారు.
తెలుగు భాషకు విశేష సేవలందించిన మహనీయులను, ప్రముఖ వ్యక్తులను మరచిపోకూడదని ఆయన అన్నారు. అందులో భాగంగానే తమ ఉండి ప్రాంతంలో జన్మించిన తిరుపతి వెంకట కవుల్లో ఒకరైన తిరుపతిశాస్త్రి, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే కొత్తగా నిర్మిస్తున్న ఒక వంతెనకు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త డా. ఎల్లాప్రగడ సుబ్బారావు బ్రిడ్జిగా నామకరణం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇలాంటి మహనీయులు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ఆంగ్ల భాష ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుంటూనే తెలుగుభాషను నిలబెట్టుకోవడంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతో కీలకమన్నారు. ప్రభుత్వం అన్ని శాఖల్లోనూ తెలుగుభాషను ఉపయోగించాలని, పరిపాలనా భాషగా తెలుగు ఉండాలని సూచించారు.
ఆంగ్లంలో వెలువడే ప్రభుత్వ ఉత్తర్వులన్నింటినీ వెంటనే తెలుగులోకి అనువదించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. దీనివల్ల తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం ఉన్న వారికి కొన్ని ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని పేర్కొన్నారు. కనీసం ఐదో తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన జరగాల్సిన అవసరం ఉందన్నారు.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆచార్య డా. శలాక రఘునాథ శర్మ మాట్లాడుతూ.. ఎన్ని భాషల్లోని పదాలనైనా అవలీలగా తనలో మిళితం చేసుకోగల శక్తి ఉన్న గొప్ప భాష తెలుగు అని అన్నారు. అందుకే పరభాషీయులు, శ్రీకృష్ణదేవరాయలతో సహా విదేశీయులు సైతం తెలుగు భాషా వైభవాన్ని ప్రశంసించారని తెలిపారు. తెలుగుభాషను విస్తృతం చేయడంలో నిర్లక్ష్యం తగదని సూచించారు.
విశిష్ట అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు మాట్లాడుతూ.. తెలుగు భాష, సంస్కృతుల అభివృద్ధికి కృషి చేస్తున్న వారికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం తెలుగు భాషా పురస్కారాలు, కళారత్న పురస్కారాలు అందజేస్తోందన్నారు.
గిడుగు రామ్మూర్తి పంతులు మునిమనుమరాలు గిడుగు లక్ష్మీకాంతికృష్ణ మాట్లాడుతూ.. తన ముత్తాత గిడుగు రామమూర్తి ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని గ్రాంధిక భాషను వ్యవహారిక భాషగా తీర్చిదిద్దారని తెలిపారు. తాము కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ గిడుగు రామ్మూర్తి ఫౌండేషన్‌ను స్థాపించామని చెప్పారు. ప్రతి సంవత్సరం భాషా, సాహిత్య వికాసానికి కృషి చేసిన వారికి పురస్కారాలు అందజేస్తున్నామని తెలిపారు.
ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు డా. మాడభూషి సంపత్‌కుమార్ మాట్లాడుతూ.. తెలుగుకు ప్రాచీన భాష హోదా సాధించడంలో విజయవంతమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో ఇంకా వెనుకబడి ఉన్నామని అన్నారు. ఈ విషయంలో పార్లమెంట్ సభ్యుల సహకారం అవసరమని పేర్కొన్నారు.
తెలుగు భాషోద్యమ సమాఖ్య కార్యదర్శి డా. గుంటుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పిల్లలకు తెలుగు భాషను నేర్పడంలో అధునాతన పద్ధతులను ఉపయోగించాలని సూచించారు. కేవలం పిల్లలు సాధించే మార్కులతో సంతృప్తి చెందకుండా, వారికి భాష ఎంతవరకు అర్థమవుతోంది, ఎంతవరకు పట్టుబడుతోందనే అంశాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్రస్థాయిలో మార్పులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
సీనియర్ జర్నలిస్ట్ రమేశ్ కందుల మాట్లాడుతూ.. కాలక్రమేణా తెలుగుభాష అన్ని రంగాల్లోనూ అనేక మార్పులకు లోనవుతూ వస్తోందన్నారు. తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకురావడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు, సమావేశం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర కృతజ్ఞతలు తెలిపారు.