Garlic Tea | వెల్లుల్లిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు అధిక శాతం మంది చేసే అన్ని రకాల వంటకాల్లోనూ దీనిని ఉపయోగిస్తూనే ఉంటారు. వెల్లుల్లి వంటలకు రుచిని పెంచడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. వెల్లుల్లి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇన్పెక్షన్ లు దరి చేరకుండా ఉంటాయి. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ముఖ్యంగా రక్తపోటును అదుపులో ఉంచడంలో వెల్లుల్లి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
వెల్లుల్లిని నేరుగా తినలేరు. ఇది చాలా ఘాటుగా ఉంటుంది. కనుక రక్తపోటుతో బాధపడే వారు వెల్లుల్లితో టీ తయారు చేసి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రక్తపోటుతో బాధపడే వారికి వెల్లుల్లి టీ ఏ విధంగా సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ధమనుల గోడలపై రక్తం బలం సాధారణం కంటే ఎక్కువగా ఉండే స్థితిని రక్తపోటు అంటారు. అధిక రక్తపోటును అదుపులో ఉంచడం చాలా అవసరం. దీనిని నియంత్రించకపోతే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. వెల్లుల్లిలోని సల్ఫర్ రక్తనాళాల్లో నైట్రిక్ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో రక్తనాళాలు వ్యాకోచించి రక్తపోటు తగ్గుతుంది. ధమనులు గట్టిపడడం, స్ట్రోక్ వంటి ప్రమాదాలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.
480 మిల్లీగ్రాముల నుండి 960 మిల్లీగ్రాముల మోతాదులో వెల్లుల్లిని తీసుకున్న వారిలో సిస్టోలిక్ రక్తపోటు గణనీయంగా తగ్గిందని నిపుణులు అధ్యయనాల ద్వారా వెల్లడించారు. ఈ విధంగా వెల్లుల్లి రక్తపోటును తగ్గించడంలో ఎంతో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇక వెల్లుల్లి టీని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. దీని కోసం 3 వెల్లుల్లి రెబ్బలు, 3 కప్పుల నీరు తీసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నీరు పోసి అందులో వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలి. తరువాత ఈ నీటిని 4 నుండి 5 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వడకట్టి అందులో రుచి కోసం తేనె లేదా నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతేకాకుండా శరీర ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.