మాస్కో: సైబీరియాకు చెందిన ఒక ల్యాబొరేటరీ పరిశోధకురాలి మరణం నేపథ్యంలో రష్యా ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. ఇర్కుట్స్ యాంటీ ప్లేగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఆమె ‘న్యూమోనిక్ ప్లేగ్’ కారణంగా మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆమెతో సన్నిహితంగా మెలిగిన దాదాపు 200 మందిని క్వారంటైన్లో ఉంచారు. సెలెఖోవ్లో దవాఖానలో చేరడానికి ముందు 28 ఏండ్ల ప్రయోగశాల పరిశోధకురాలు డార్యా షిపిలోవా పనిచేస్తుండగా ప్లేగు వ్యాధి బారిన పడినట్టు సమాచారం.
పరీక్షల కోసం నమూనాలను సేకరిస్తుండగా సజీవ బ్యాక్టీరియా ఉన్న టెస్ట్ ట్యూబ్ను ప్రమాదవశాత్తు పగులగొట్టానని ఆమె వైద్య అధికారులకు చెప్పినట్టు పలు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. తీవ్రమైన న్యూమోనియా లక్షణాలతో సెప్టెంబర్ 29న ఆమె దవాఖానలో చేరారు. అక్టోబర్ 1న మరణించే ముందు ఆమెకు వెంటిలేటర్ సహాయం అందించారు. ఆమెతో సన్నిహితంగా మెలిగిన సుమారు 200 మందిలో ప్రస్తుతం వ్యాధి లక్షణాలు ఏవీ కనిపించడం లేదని సమాచారం.