బొమ్మల రామారం, జనవరి 18 : తాను చేస్తున్న చిరుద్యోగానికి వచ్చే వేతనం సరిపోక ఆకుకూరలు సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని సృష్టించుకున్నాడు మండలంలోని కొత్త రంగాపూర్ గ్రామానికి చెందిన తాళ్ళ ప్రవీణ్‌రెడ్డి. కొద్దిపాటి భూమిలోనే రోజువారీ ఆదాయాన్నిచ్చే తోటకూర, ఆకుకూరతో నెలకు రూ.15వేలు సంపాదిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రవీణ్‌రెడ్డి స్థానిక కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. వేతనం తక్కువగా ఉండడంతో ప్రతి నెలా అప్పు చేయాల్సిన పరిస్థితి ఉండేది. తనకున్న 2.20ఎకరాల్లో రెండెకరాలు వరి సాగుచేసినా ఆదాయం పెద్దగా ఉండడం లేదు. దాంతో 20గుంటల్లో తోటకూర, పాలకూర సాగు చేపట్టాడు.
రహదారి పక్కనే పొలం ఉండడంతో ఉదయం, సాయంత్రం పొలం దగ్గరే అమ్ముకుని నిత్యం ఆదాయాన్ని పొందుతున్నాడు. సెలవు రోజుల్లో కుషాయిగూడ, ఉప్పల్, బోయిన్పల్లి మార్కెట్‌కు తరలిస్తాడు. తోట కూర సాగు ఎరువులు, ట్రాక్టర్, కూలీలు, సస్యరక్షణ మందులకు కలిపి రూ.2వేల వరకు ఖర్చు ఉంటుంది. 30రోజుల్లో పంట కోతకు వస్తుంది. సుమారు 6వేల కట్టలు దిగుబడి వస్తుంది. కట్ట సీజన్‌ను బట్టి రూ.1నుంచి రూ.3వరకు అమ్ముతాడు. పాలకూర కూడా దాదాపు అంతే మొత్తంలో ఆదాయాన్నిస్తుంది. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.15వేల ఆదాయం వస్తుందని ప్రవీణ్‌రెడ్డి తెలిపాడు.