సూర్యాపేట, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత ప్రభావం సిమెంట్, స్టీల్ ధరలపై పడింది. మరో పక్క పెట్రో మంట కారణంగా అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నాలుగు నెలల్లో స్టీల్ ధర కిలోపై దాదాపు రూ.15 నుంచి 20 వరకు పెరిగింది. సిమెంట్ బస్తా రూ.40 నుంచి 50కి ఎగబాకింది. అన్ని ధరలూ పెరుగడంతో 200 గజాల్లో నిర్మించుకునే ఇంటిపై రూ.4 లక్షల అదనపు భారం పడుతున్నది. పెరిగిన ధరల నేపథ్యంలో బిల్డర్లు సైతం గగ్గోలు పెడుతున్నారు.
ఇల్లు కట్టుకోవాలనేది ప్రతి ఒక్కరి కల. ఆ కల నెరవేర్చుకునేందుకు ప్రధానంగా చాలీచాలని జీతాలు, చిరువ్యాపారాలు, ప్రైవేట్‌తోపాటు రూ.30 నుంచి 40 వేల జీతం తీసుకునే మధ్య తరగతి వారు పడే పాట్లు అన్నీఇన్నీ కావు. 30 ఏండ్ల వయస్సులో ఇంటి నిర్మాణ ఆలోచన ప్రారంభిస్తే 50 నుంచి 55 ఏండ్ల మధ్య వయసులో గానీ నెరవేరడం లేదు. అయితే నాలుగు నెలలుగా ఇంటి నిర్మాణ వ్యయం విపరీతంగా పెరుగడంతో మధ్యతరగతి ఆందోళనకు గురవుతున్నది.
అన్ని ఖర్చులూ అదనమే..
200 గజాల్లో ఇంటి నిర్మాణ వ్యయం నాలుగు నెలల్లో రూ.4 లక్షల వరకు పెరిగింది. కేవలం స్టీల్, సిమెంట్ ధరల పెరుగుదలతోనే ఒక ఇంటికి అదనంగా రూ.1.05 లక్షలు పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో పీఓపీ, విద్యుత్ సామగ్రి, కలప, లేబర్ తదితరాల అన్ని ధరలు పెరిగి మరో రూ.3 లక్షల వరకు అదనపు భారం పడుతున్నది. జూన్‌లో ఒక్కో సిమెంట్ బస్తా ధర రూ.290 నుంచి 340 వరకు ఉండగా, నేడు రూ.60 నుంచి 90 అదనంగా పెరిగింది. 800 బస్తాల సిమెంట్ అవసరం ఉంటుండగా రూ.50వేల అదనపు భారం పడుతున్నది. స్టీల్ విషయానికి వస్తే ఆయా బ్రాండ్లకు కిలో ఒక్కంటికి రూ.15 నుంచి 20వరకు పెరిగింది. ఈ లెక్కన ఒక ఇంటికి కావాల్సిన 4 టన్నుల స్టీల్‌కు రూ.55వేలు అదనంగా చెల్లించుకోవాల్సిందే. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావంతో పెయింట్ల ఖర్చు లక్ష నుంచి రూ.1.40లక్షల దాకా చేరింది. విద్యుత్ సామగ్రి, పీఓపీ, లేబర్ చార్జీలు కూడా పెరిగిపోయాయి. మేస్త్రీకి రోజుకు రూ.1,000, అడ్డా కూలీకి రూ.800 ఇవ్వాల్సి వస్తున్నది. ఇసుక ధరలు గతంలో ట్రాక్టర్ ఒక్కంటికి రూ.1,800 నుంచి 2,200 మధ్యలో దొరకగా నేడు రూ.4వేల నుంచి 5వేలకు చేరింది.