న్యూఢిల్లీ, అక్టోబర్ 5: ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే ఎన్నికల సంఘం(ఈసీ) అనేక నిర్ణయాలు తీసుకుందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ల నేపథ్యంలో కేంద్రానికి, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీచేసింది. ఎన్నికల సంఘం తీసుకున్న అన్ని నిర్ణయాలను పరిశీలించి చట్టానికి అనుగుణంగా లేని వాటిని రద్దు చేస్తామని న్యాయస్థానం పేర్కొన్నది. వివిధ రాష్ర్టాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియలో ఎన్నికల సంఘం ఉపయోగిస్తున్న ఫామ్-6లో చేసిన మార్పులకు తాము ఆమోదం తెలపలేదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఎన్నికల సంఘానికి కల్పించిన రక్షణ న్యాయమూర్తులకు కూడా లేదని ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వీ మోహనలతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఫామ్ 6లో చేసిన వివాదాస్పద మార్పులతో సహా పిటిషనర్లు సవాలు చేసిన నిర్ణయాలకు సంబంధించిన రికార్డులను సమర్పించాలని ఆదేశిస్తూ ఎన్నికల సంఘానికి కోర్టు నోటీసులు జారీచేసింది. కాగా, సర్ ప్రక్రియ కోసం ఫామ్ 6లో జోడించిన డిక్లరేషన్‌కు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిందని ఈసీ పది రోజుల కిందట పేర్కొన్నది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు తాజాగా స్పష్టతనిచ్చింది.
సీఈసీ నాయకత్వంలోని ఎన్నికల సంఘం పనితీరును సవాలు చేస్తూ పాట్నా నివాసి రాకేశ్ కుమార్ సింగ్, న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ‘సర్’కు సంబంధించిన సుమారు 14 నిర్ణయాలను మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తీసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. ఈ నిర్ణయాలను రద్దు చేయాలని, జ్ఞానేశ్ కుమార్‌పై విచారణ జరపాలని, సర్ ప్రక్రియలో ఓటర్ల పేర్లను తొలగించడంపై సిట్ దర్యాప్తు జరపాలని వారు కోరారు.
ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునే వరకు సీఈసీ తన విధులను నిర్వర్తించకుండా నిరోధించాలని కూడా పిటిషనర్లు కోరారు. రాజ్యాంగ, చట్టపరమైన విధానాలకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొంటూ సీఈసీని సస్పెండ్ చేయాలని కూడా వారు కోరారు. ఆ నిర్ణయాలను కేవలం సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఒక్కరే తీసుకున్నారా లేక ఎన్నికల సంఘం ఏకగ్రీవంగా లేదా మెజారిటీ ఆమోదంతో తీసుకున్నదా అనే అంశాన్ని పరిశీలించాలని భావిస్తున్నట్టు ధర్మాసనం విచారణ సందర్భంగా పేర్కొంది. రికార్డులను సమర్పించినపుడు ఫామ్ 6ను ఎవరు సవరించారో మేము చూడాలనుకుంటున్నాము. ఏకాభిప్రాయం లేనట్లయితే, ఏ నిర్ణయమైనా మెజారిటీ ప్రాతిపదికన తీసుకోవాలి. లేదంటే ఆ నిర్ణయాన్ని రద్దు చేయాల్సి రావచ్చు.
మీరు కేవలం ఒక వార్తాపత్రిక కథనం ఆధారంగానే మీ వాదనలు వినిపిస్తున్నారు అని సీజేఐ సూర్యకాంత్ అన్నారు. సమస్య తీవ్రతపై సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలోని ఓటు హక్కు ప్రభావితమవుతున్నదని అన్నారు. దీనికి సీజేఐ జవాబిస్తూ చట్టవిరుద్ధమైన చర్య ఏదైనా జరిగి ఉంటే దాని పర్యవసానాలు తప్పక ఉంటాయని పేర్కొన్నారు. కాగా, ఒక వారంలోగా స్పందన తెలియచేయాలని కోరుతూ, కోర్టు జోక్యం చేసుకోకపోతే దేశం అగ్నిగుండంలా మండుతుందని న్యాయవాది వికాస్ సింగ్ వాదించినప్పటికీ ఈసీ స్పందనకు సుప్రీంకోర్టు ఎటువంటి నిర్దిష్ట గడువును విధించలేదు.