పెద్దవాళ్లే ట్రెక్కింగ్ అంటే భయపడిపోతారు. కానీ ఆఫ్రికా ఖండంలోనే ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన బాల ట్రెక్కీగా రికార్డు సృష్టించాడు తెలంగాణ బుడుతడు.. విరాట్ చంద్ర. ఎనిమిదేండ్ల ఈ చిచ్చరపిడుగు ఘనతకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ బాల పురస్కార్‌కు ఎంపిక చేసింది. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా బ్లాక్‌చైన్ టెక్నాలజీ ద్వారా విరాట్‌కు సర్టిఫికెట్ అందజేశారు.
హైదరాబాద్‌కు చెందిన శరత్చంద్ర, మాధవి దంపతుల తనయుడే విరాట్. ఈ పిల్లగాడు గత ఏడాది 75 రోజుల వ్యవధిలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. తనకు బాల్యంనుంచే పర్వతారోహణపై ఆసక్తి. దీంతో తల్లిదండ్రులు విరాట్‌కు ట్రెక్కింగ్‌లో శిక్షణ ఇప్పించారు. ‘అనుకున్నది సాధించగలవు’ అంటూ ప్రోత్సహించారు. రోజూ పరుగు, వ్యాయామం, యోగా సాధన చేస్తూ రాటుదేలాడు విరాట్. ఈ బాలుడి ధైర్యసాహసాలకు మెచ్చిన ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాలో రాష్ట్రీయ బాల పురస్కారం అందించింది. తన తదుపరి లక్ష్యం.. ఎవరెస్ట్!