తినకూడనివో/ బాగా ఇష్టమైనవో ఆబగా తిని ఇబ్బందులు పడేవారిని ఉద్దేశించి చెప్పిన సామెత ఇది. కొన్నిప్రాంతాల్లో రేగుపండ్లను ‘ర్యాలెకాయలు’ అని అంటారు. ఈ పండ్లను నక్కలు ఇష్టంగా తింటాయి. విసర్జించేటప్పుడు మాత్రం నొప్పితో ఊళ పెడుతుంటాయి. ఆ అరుపు ఎంత భయంకరంగా ఉంటుందంటే.. ఎక్కడో అడవుల్లో/ గుట్టల్లో/ బీళ్లలో ఊళపెడితే.. గ్రామాల్లోకి కూడా వినిపిస్తూ ఉంటుంది. ఆ బాధే సామెతలా మారింది. కొందరు ఇష్టమైన వాటిని అతిగా తిని, అరగక కడుపునొప్పి తెచ్చుకొని విలవిల్లాడిపోతుంటారు. నొప్పి భరించలేక కేకలు పెడుతుంటారు. అందుకే, కొత్త పదార్థం ఏదైనా తినేటప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలని, ఇష్టమైన వాటినైనా సరే మితంగా తినాలని సున్నితంగా హెచ్చరించే సామెత ఇది.
బీడీ బిచ్చం.. కల్లు ఉద్దెర
ఏదైనా పని వెతుక్కోకుండా.. సుఖానికి అలవాటు పడి, నిత్యం మంది మీద ఆధారపడి బతికేవాళ్లను ఉద్దేశించిన సామెత ఇది. ఒక్క
మాటలో చెప్పాలంటే వీళ్లు సోమరిపోతులు. చిన్న అవసరానికి కూడా ఇతరులవైపే ఆశగా చూస్తారు. ‘ఛీ’ కొట్టినా, చీదరించుకున్నా పట్టించుకోరు. బీడీ, సిగరెట్ వంటివి కూడా అడుక్కుంటారు. రాత్రికి కల్లు కూడా ఉద్దెరే! ఇలాంటివాళ్లను చూసే ‘వాడి బతుకే నయం రా.. బీడీ బిచ్చం.. కల్లు ఉద్దెరలా బతికేస్తున్నాడు’ అంటుంటారు.
వానికి మస్తు ‘ఒనారం’ ఉంది!
‘ఓ రమణక్కా! మీ చిన్నోడికి మస్తు ఒనారం ఉంది.. ఏ పనైనా ఇట్టే చేస్తుండు. బాగా సదివిపియ్ మంచి పైల్లోకొస్తడు’ ఈ పదబంధంలో ‘ఒనారం’ అనే పలుకుబడికి ‘నైపుణ్యం’ అని అర్థం. తెలివిగా వ్యవహరిస్తూ.. పనులు చకచకా చేసేవారిని పొగుడుతూ చెప్పే మాట ఇది. ఒనారం అనే పలుకుబడిని గ్రామాల్లో విరివిగా వాడుతున్నా.. ఇది తెలంగాణ సొత్తు కాదని అంటారు. ఎందుకంటే, దక్కన్ ప్రాంతంలో ఉర్దూ ప్రభావం ఎక్కువ. ఒనారం అనే మాట ‘హునర్’ అనే ఉర్దూ పదం నుంచి వచ్చిందని అంటారు. హునర్ అంటే జ్ఞానం, కళ, నైపుణ్యం, సాధన అనే అర్థాలున్నాయి. అయినా ఈ ‘ఒనారం’ తెలంగాణ ప్రజల నోళ్లలో నానుతూనే ఉంటుంది.
అర్థ వివరణ
1. సోభియ్యది = ఇది నీకు తగదు, శోభించదు (కోడలు పిల్లను ఇన్ని కష్టాలు పెట్టుడు నీకు సోభియ్యది బిడ్డా)
2. కాండి = కస్లం (ఎడ్లబండి)కు ముందటి బ్యాలెన్స్ భాగం, ఎడ్ల మెడలపై ఉంచేది (కాండి సరిగా కట్టురా.. ఎద్దు రంకేస్తుంది)
3. తెల్కపిండి = పశువుల పౌష్టికాహారం (నూనె తీసిన తర్వాత మిగిలిన నువ్వుల పొడి, అవిసెలు కలిపి తయారుచేసే పశువుల దాణ. ప్రస్తుతం కనుమరుగైన వాటిలో ఒకటి)
4. నంజుడుకూర = రొట్టెల్లో అద్దుకొని తినే మాంసాహారం (యామయ్యోయ్.. మిగిలిన రెండు రొట్టెల్లకు నంజుడుకూర వెయ్యమంటవా?)
5. బంగాయి = ఇంట్ల మంచం తీరు ఉండే ఊయల (బంగాయి ఎంతసేపు ఊగుతవ్రా.. చిన్నోనికి కాసేపు ఇవ్వు. ఆడూ ఊగుతడు)
-డప్పు రవి