ఆహార్యానికి తగిన అలంకరణ ఉంటేనే అందం చందం. నిన్నమొన్నటి వరకూ పట్టుచీరలు కట్టుకున్నప్పుడు చేతినిండా గాజులు వేసుకునేవారు. కానీ ఇప్పుడంతా ఫ్యాన్సీ చీరలు, డ్రెస్సులదే హవా. వాటిమీదికి గాజులను పోలిన బ్రేస్లెట్స్ అతికినట్టు సరిపోతున్నాయి. ఆ నగలకే సంప్రదాయ సొగసులద్ది మగువలను ఆకర్షిస్తున్నారు డిజైనర్లు.
జంతువులు, పక్షులు, లతల డిజైన్లలో ఒదిగిపోయి మరింత ఆకట్టుకుంటున్నాయి బ్రేస్లెట్స్. కొన్నయితే కడియాలనూ పోలి ఉంటున్నాయి. మరికొన్ని చేతి సైజునుబట్టి సర్దుకోవడానికి అనువుగా ఉంటున్నాయి. బంగారంతోపాటు వెండి, ప్లాటినమ్ వంటి లోహాలతో నల్లపూసల బ్రేస్లెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.
ప్రియాంక చోప్రా లాంటి బాలీవుడ్ సెలెబ్రిటీలు ధరించడంతో అవి బాగా పాపులర్ అయ్యాయి. ఆన్లైన్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రకృతి అందాలు పలకరించేలా ముత్యాలు, శంఖాలు, రంగు రంగుల రాళ్లు పొదిగినవి కూడా ఉన్నాయి.
కంఠాభరణాలు, గాజులు, జుంకాలకు మ్యాచ్ అయ్యేలా.. బ్రేస్లెట్ కాంబోలు సైతం వచ్చాయి. త్రెడ్, ఫంకీ జువెలరీలోనూ నచ్చిన రంగులు, డిజైన్లలో వీటిని తయారు చేయించుకోవచ్చు.