
హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ)/ కాచీగూడ: బ్యాంకింగ్ రంగం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉధృత పోరాటాలు చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏపీటీబీఈఎఫ్) 29వ మహాసభలను ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్కౌర్ ఆదివారం హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చాక దేశ సంపద పరిరక్షణ కోసం బ్యాంకుల జాతీయకరణ జరిగితే నేడు ప్రధాని మోదీ కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చేందుకు బ్యాంకులను ప్రైవేటీకరిస్తున్నారని విమర్శించారు.
మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు మాట్లాడుతూ.. కార్మికవర్గాన్ని మతం, భాష, ప్రాంతం పేరుతో విభజించేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తుండటం విచారకరమన్నారు. మహాసభల్లో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్, ఏపీటీబీఈఎఫ్ ప్రధాన కార్యదర్శి బీఎస్ రాంబాబు, ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు.