మనిషికి పేరు, చిరునామా మాత్రమే కాదు.. లింగం (జెండర్) కూడా ఓ గుర్తింపే. కానీ, సమాజం కొందరి జెండర్ ఐడెంటిటీని గుర్తించడానికి ఒప్పుకోదు. సమాజంలానే ప్రభుత్వాలూ నిర్లిప్తంగా వ్యవహరిస్తే.. గుర్తింపునకు నోచుకోని వాళ్లకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో వివరిస్తూ కేంద్ర సర్కారుకు ఓ పెద్ద లేఖ రాశారు అనుప్రభా దాస్ మజుందార్. తను పశ్చిమ బెంగాల్లో పుట్టారు.
వయసు 29 సంవత్సరాలు. ట్రాన్స్ జెండర్. శరీరాన్ని మార్చుకున్నా ఆధార్ కార్డు మాత్రం తనను ‘పురుషుడు’ అనే నిర్ధారిస్తున్నది. దాన్ని ట్రాన్స్జెండర్ (టీజీ)గా మార్చాలని తన విన్నపం. లక్ష్య సాధన కోసం అనేక పోరాటాలు చేశారు. ప్రముఖులకు విజ్ఞాపన పత్రాలు సమర్పించారు. ఉద్యమాలూ నిర్వహించారు. ఆ పోరాట ఫలితంగానే.. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధార్లో తగిన సవరణలు చేయాలని నిర్ణయించింది. ఆ ఆదేశాల ప్రకారం, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ‘టీజీ’ ఐడెంటిటీ కార్డులను జారీ చేస్తున్నది. అనుప్రభకు ఇటీవలే ‘టీజీ’ ఆధార్ అందింది. తనలా ఆధార్ పొందినవాళ్లు దేశంలో 17 మంది వరకూ ఉన్నారు.